IAF Fighter Jets : భారత వాయు సేన అవసరాలు తీర్చేందుకు కావాల్సిన యుద్ధ విమానాలు అందుబాటులో లేవని ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎపీ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశీయ ప్రభుత్వ రంగ హిందుస్థాన్ ఎయిరోనాటికల్స్ సంస్థ ఉత్పత్తి వేగాన్ని పెంచకపోవడం, దశాబ్దాలుగా ఆర్డర్లను అందించలేకపోతున్న వేళ.. ఈ రంగంలోకి ప్రైవేట్ రంగ సంస్థలను అనుమతించాలని.. రక్షణ ప్యానెల్ నిర్ణయించింది. స్క్వాడ్రన్ బలం, కావాల్సిన స్థాయిలో యుద్ధ విమానాల డెలివరీని పెంచేందుకు ప్రైవేట్ రంగ ప్రమేయం అవసరమని అభిప్రాయపడింది. విమానాల ఉత్పత్తి, సరఫరాలో ఆలస్యాలను నివారించడం, తేలికపాటి యుద్ధ విమానాల (LCA) ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు దశల వారీగా చర్యలను అమలు చేయాలని రక్షణ సాధికారత కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
భారత్ ఫైటర్ జెట్ అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరాలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యానికి అనుమతించేందుకు రక్షణ ప్యానెల్ మార్గం సుగమం చేసింది. ఇది లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) Mk-1A ఉత్పత్తి, సరఫరాను వేగవంతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచించింది. ఇటీవల కాలంలో ఎయిర్ ఛీప్ మార్షల్ హిందుస్థాన్ ఎయిరోనాటికల్స్ లిమిటెడ్ మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో.. సమస్యను గుర్తించి, సరిచేసేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని కేంద్ర రక్షణ శాఖ ఏర్పాటు చేసింది. తాజాగా.. అనేక అంశాలను పరిశీలించిన ఈ కమిటీ.. ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించడమే సరైన పరిష్కరం అని తేల్చి చెప్పింది.
కమిటీ రిపోర్టును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు సమర్పించారు. ఈ కమిటీ సిఫార్సులను దశలవారీగా అమలు చేయాలని సూచించారు. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఈ కమిటీ, LCA కార్యక్రమంలో అడ్డంకులను తొలగించడానికి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలికంగా తీసుకోవాల్సిన చర్యల్ని ప్రతిపాదించింది. ఉత్పత్తిని వేగవంతం చేయడానికి, ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) పై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రైవేట్ రంగ కంపెనీల ప్రవేశం కల్పించడం ఈ కమిటీ సిఫార్సుల్లో కీలకమైన అంశం. రాబోయే దశాబ్దంలో IAF Mk-1, Mk-1A, Mk-2 సహా సుమారు 350 LCA వేరియంట్‌లను ఆపరేట్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే, యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇంజిన్‌లను పొందడంలో జాప్యం కారణంగా పురోగతికి ఆటంకం ఏర్పడింది, ఇది ఈ విమానాల సరైన సమయంలో అందుబాటులోకి రావడంపై తీవ్ర ప్రభావం చూపింది.
రక్షణ తయారీలో స్వావలంబన సాధించాలనే భారత విస్తృత లక్ష్యానికి ఈ నివేదిక ఉపయోగపడుతుందని అంటున్నారు. బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా ప్రదర్శన సందర్భంగా, ఎయిర్ చీఫ్ మార్షల్ HAL విమానాల డెలివరీలో జాప్యంపై ఆందోళనలను వ్యక్తం చేశారు. కమిటీ నివేదిక సైతం ఈ ఆందోళనలను నిర్థరించింది. కమిటీ కీలకమైన ప్రాధాన్యతా రంగాలను గుర్తించిందని రక్షణ శాఖ ధృవీకరించింది. రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు (DPSU), రక్షణ పరిశోధన – అభివృద్ధి సంస్థ (DRDO) సమన్వయంతో ప్రైవేట్ రంగంలో పరిశోధనల్ని, ఉత్పత్తుల్ని చేపట్టాలని ఈ రక్షణ ప్యానెల్ సూచించింది.
Also Read : Ayodhya Terror Attack : అయోధ్యపై ఉగ్ర కుట్రలు – పాక్ ఐఎస్ఐ పాత్రపై సంచలన విషయాలు
ఈ సిఫార్సులను నిర్ణీత కాలపరిమితిలోగా అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారుల్ని ఆదేశించారు. IAFకి అవసరమైన స్క్వాడ్రన్ బలాన్ని సమకూర్చుకోవాలి అంటే ఏటా 35 నుంచి 40 కొత్త ఫైటర్ జెట్‌ల అవసరం అవుతాయి. ప్రస్తుతం, వైమానిక దళం కేవలం 31 ఫైటర్ స్క్వాడ్రన్‌లతో మాత్రమే పనిచేస్తోంది. వాస్తవంలో మనకు 42 స్వ్కాడ్రన్లు అవసరం అవుతాయి.