జులై 1 నుంచి ఢిల్లీలో అమలులోకి వచ్చిన పాతవాహనాల నిషేధం నిబంధన తీవ్ర విమర్శలకు దారితీసింది. 10 ఏళ్ల క్రితం కొన్న డీజిల్ వాహనాలకు, 15 ఏళ్ల పాతవైన పెట్రోల్ వాహనాలకు ఇంధనం అమ్మడానికి వీల్లేదంటూ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (CAQM) ఒక నిబంధన తెరపైకి తెచ్చింది. దీనికారణంగా పాతవాహనాల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది ఎంతో ఖరీదుపెట్టి కొన్న వాహనాలను కూడా ఈ నిబంధన కారణంగా తెగనమ్ముకున్నారు. క్రమక్రమంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. ఫైనల్ గా మూడు రోజుల్లోనే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. CAQM నిబంధనల్ని వెనక్కి తీసుకుంది.
కాలుష్య నివారణకు..
ఢిల్లీలో వాహనాల, నిర్మాణ రంగం నుంచి వెలువడే కాలుష్యం ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ముఖ్యంగా శీతాకాలంలో ఈ కాలుష్యం వల్ల పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్వాసకోశ సమస్యలతో ఢిల్లీవాసులు అనారోగ్యంపాలవుతున్నారు. ప్రతి ఏడాదీ దీపావళికి టపాకాయలు కాల్చే విషయంలో కూడా కోర్టులో కేసులు నడవాల్సిందే. ఈ దశలో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. పాతవాహనాల వల్లే కాలుష్యం అధికం అవుతుందంటూ.. వాటిపై నిషేధం విధించాలని చూసింది. అయితే నేరుగా వాటిని నిషేధించకుండా ఢిల్లీలో పాతవాహనాలకు పెట్రోల్ అమ్మకాలను నిషేధించింది.
ఆ అంచనా తప్పు..
పాతవాహనాలతో కాలుష్యం అధికం అనేమాట కొంతవరకు నిజం. కానీ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించుకుంటూ, మెయింటెనెన్స్ బాగా ఉన్న వాహనాలు పాతవి అయినా వాటినుంచి వెలువడే కాలుష్యం పరిమితంగానే ఉంటుంది. కొత్త వాహనాల మెయింటెనెన్స్ బాగోలేకపోయినా అవి కాలుష్యకారకాలుగా మారడం ఖాయం. ఇలాంటప్పుడు పదేళ్లు, పదిహేనేళ్లు అంటూ లెక్కలేసి పాతవాహనాలకు పెట్రోల్ పోయలేం అంటే కుదురుతుంతా. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కొత్త ప్రకటన విడుదల చేసింది.
Delhi Environment Minister Manjinder Singh Sirsa writes to the Commission for Air Quality Management to place on hold the enforcement of Direction No. 89, which mandates the denial of fuel to End-of-Life (EOL) vehicles in Delhi
"We urge the Commission to put the implementation… pic.twitter.com/mgg1Ymdaes
— ANI (@ANI) July 3, 2025
చేతులు కాలాక..
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం CAQM నిబంధనల్ని నిలిపివేసింది. అయితే దీనికి ఓ కొత్త సాకు వెదుక్కుంది. పదేళ్లు, పదిహేనేళ్ల పాత వాహనాలను గుర్తించే వ్యవస్థ సమర్థంగా లేనందున ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా. ‘సాంకేతిక సవాళ్లు-సంక్లిష్ట వ్యవస్థల’ కారణంగా ఆ నిర్ణయం అమలు చేయడం కష్టంగా ఉందన్నారాయన. పాత కార్లు, బైక్ లను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తులను శిక్షించే బదులు, సరిగా నిర్వహించని వాహనాలను స్వాధీనం చేసుకునే వ్యవస్థను రూపొందిచబోతున్నట్టు ప్రకటించారు. పాత వాహనాలను నెంబర్ ప్లేట్ల ఆధారంగా గుర్తించేందుకు ఢిల్లీలోని 498 పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాలు నంబర్ ప్లేట్‌లను క్రాస్-వెరిఫై చేస్తాయి. వాహనాల స్థితిని గుర్తించి పెట్రోల్ బంక్ ఆపరేటర్లను హెచ్చరిస్తాయి. అయితే ఈ వ్యవస్థ ఏప్రిల్ 2019 తర్వాత వచ్చిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్‌లను గుర్తించలేకపోతోంది. ఇతర సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో పాతవాహనాలను గుర్తించడంలో ఈ వ్యవస్థ తడబడుతోంది. కొన్ని సందర్భాల్లో కొత్త వాహనాలను కూడా పాతవాటికింద జమకడుతోంది. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. అందుతే తాత్కాలికంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు మంత్రి. ఢిల్లీలో ఈ సిస్టమ్ సక్సెస్ అయితే నవంబర్ నుంచి గురుగ్రామ్ సహా ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేయాలనుకున్నారు. ఇప్పుడు అక్కడ కూడా క్యాన్సిల్ అవుతుందని అంటున్నారు.