Fridge blast reason: హైదరాబాద్‌లోని సనత్‌నగర్ రాజానగర్ ప్రాంతంలో గురువారం ఫ్రిజ్ పేలిన ఘటన కలకలం రేపింది. ఓ ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో పేలిపోవడంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ప్రాణాపాయం జరగలేదు. కానీ ఈ ఘటన మనందరికీ ఒక స్పష్టమైన హెచ్చరిక. మన ఇళ్లలో రోజూ నిత్యవసరాల కోసం వాడే ఫ్రిజ్ కూడా ప్రమాదానికి దారి తీయగలదన్న విషయాన్ని ఇది రుజువు చేసింది.
భారీ శబ్దం..
ఈ ఘటనలో ఇంటి సభ్యులు తెల్లవారుజామున ఫ్రిజ్ నుంచి గట్టిగా పేలుడు శబ్దం విన్నారని చెప్పారు. వెంటనే అక్కడ మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వారు వెంటనే ఇంటి నుంచి బయటికి పరుగులు తీశారు. ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందగానే ఫైర్ టెండర్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. ప్రాథమికంగా అధికారులు ఈ పేలుడు ఫ్రిజ్‌లోని కంప్రెసర్ వల్ల జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పూర్తి కారణాలు తెలియజేయడానికి దర్యాప్తు కొనసాగుతోంది.
ఎలా పేలుతుంది?
ఇక్కడ అసలు ప్రశ్న ఎమిటంటే ఫ్రిజ్ ఎలా పేలుతుంది? రిఫ్రిజిరేటర్ అనే పరికరం మనకు రోజూ ఉపయోగపడుతుంటుంది. అది శబ్దం చేయదు, ప్రమాదకరంగా కూడా కనిపించదు. కానీ పక్కాగా ఉపయోగించకపోతే.. అది కూడా ముప్పుగా మారవచ్చు. ముఖ్యంగా కంప్రెసర్ సమస్యలు, గ్యాస్ లీక్, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఫ్రిజ్‌లో పేలుడు సంభవించే అవకాశముంది. కంప్రెసర్ ఓవర్‌హీట్ అయినప్పుడు లేదా గ్యాస్ అధికంగా జమైపోయినప్పుడు, ఏ చిన్న షార్ట్‌సర్క్యూట్ లేదా స్పార్క్ కూడా ప్రమాదానికి దారి తీయగలదు.
ఇలా చేస్తే సేఫ్..
ఇలాంటి ప్రమాదాలు నివారించాలంటే కొన్ని భద్రతా చర్యలు తప్పనిసరి. ముందుగా, నాణ్యమైన బ్రాండ్‌కి చెందిన ఫ్రిజ్‌ను మాత్రమే కొనుగోలు చేయాలి. చీప్ బ్రాండ్లు, నకిలీ వస్తువులు లోపభూయిష్టంగా తయారవుతాయి. ఫ్రిజ్‌కు ప్రత్యేకంగా ఒకే ప్లగ్ పాయింట్ కల్పించాలి. మల్టీ ప్లగ్‌లలో టీవీ, వాషింగ్ మెషీన్, మైక్రోవేవ్ వంటివి కలిపి వాడటం ప్రమాదకరం. వోల్టేజ్ సమస్యలు ఉండే ప్రదేశాల్లో స్టాబిలైజర్ వాడటం ఉత్తమం. అదనంగా, ఫ్రిజ్ వెనక భాగం వేడిగా అనిపిస్తే, గ్యాస్ వాసన వస్తే లేదా ఎలక్ట్రిక్ స్పార్కింగ్ వంటివి కనిపిస్తే వెంటనే టెక్నీషియన్‌ను సంప్రదించాలి.
Also Read: Hyderabad electric buses: హైదరాబాద్ కు అన్ని బస్సులా? ఇకపై మెట్రో పరిస్థితి ఏంటో?
ఇంకొంత మంది ఫ్రిజ్‌ను పగటి సమయంలో ఓపెన్ చేస్తూ, రాత్రిళ్లు పూర్తీగా మూసివేస్తూ ఉండటం చూశాం. కానీ దీని వల్ల కంప్రెషర్ నిరంతరం పని చేస్తూ వేడిని ఉత్పత్తి చేస్తుంది. అది ఓవర్ లోడ్ అవడం వల్ల పేలుడు సంభవించే అవకాశం ఉంది. అలాగే ఫ్రిజ్‌లో పదార్థాలను నింపడం వల్ల గాలి ప్రసరణ జరగకపోవడం వల్ల కూడ ఫ్రిజ్ ఓవర్ హీట్ అవుతుంది. ఎప్పటికప్పుడు క్లీనింగ్, సర్వీసింగ్ చేయడం మంచిది.
ఈ ఘటనలో మంటలు త్వరగా అదుపులోకి రావడంతో నష్టం తక్కువగా ఉంది. కానీ ఇదే మరొక ఇంట్లో జరిగితే పరిస్థితి భిన్నంగా ఉండేది. ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఒక తప్పనిసరి పరికరమైపోయిన ఈ రోజుల్లో, దీన్ని ఎలా వాడాలో తెలుసుకోవడం అత్యవసరం. ఇంట్లో ఉండే చల్లదనం కలిగించే పరికరం.. చెలరేగే మంటలకు కారణమవుతుందా? అనే అనుమానం ఎంత తీవ్రంగా ఉంటుందో.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అది నిజంగా జరిగే ప్రమాదం.
ఫ్రిజ్ వాడకంలో నిర్లక్ష్యం ప్రాణాలకు హానికరమయ్యే ప్రమాదం ఉన్నందున, కుటుంబ సభ్యుల రక్షణ కోసం మేము తీసుకునే ముందు జాగ్రత్తలే మన భద్రతకు బలమైన గోడ. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. చిన్న ఘటనలు, పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అందుకే అప్రమత్తతే అసలైన రక్షణ!