Delhi earthquake: ఢిల్లీ.. ఎన్‌సీఆర్ ప్రజల గుండెల్లోకి భయం నింపుతూ శుక్రవారం సాయంత్రం మరోసారి భూమి కంపించింది. హర్యాణాలోని ఝజ్జర్ ప్రాంతంలో 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సాయంత్రం 7.49 గంటలకు నమోదైంది.
దీని కేంద్రబిందువు భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉండటం, ఊపులు కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఉండటం గమనార్హం. ఇదే ప్రాంతంలో ఒక రోజు ముందు అంటే గురువారం ఉదయం 4.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించడం గమనించాల్సిన అంశం.
వరుసగా రెండోరోజు భూమి వణకడంతో ఢిల్లీ, ఝజ్జర్, గురుగ్రామ్, రోహ్తక్, నోయిడా వంటి ప్రాంతాల్లో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇంట్లో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ, గత కొన్ని రోజులుగా NCR ప్రాంతం భూకంపాల పరంపరను చూడడం ప్రజల్లో భయాన్ని పెంచుతోంది.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, ఇవి ఆఫ్టర్‌షాక్స్ కావచ్చని, ఇవి పెద్ద ప్రమాదం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెద్ద భూకంపం తర్వాత కొన్ని రోజులపాటు భూమి లోపల కదలికలు కొనసాగుతుంటాయి. ఈ ప్రక్రియ భూమిలో జమైన టెక్టానిక్ శక్తిగా విడుదల కావడం వల్ల జరుగుతుంది. ఇది కొన్ని దశలలో మేలైన సంకేతంగా కూడా భావించబడుతుంది, ఎందుకంటే పెద్ద ఉత్పాతానికి అవకాశం తగ్గుతుంది.
ఈ భూకంపాల వెనుక గల ప్రధాన కారణం.. ఢిల్లీ పరిసర భూగర్భ ఫాల్ట్‌ల వ్యవస్థ. ముఖ్యంగా మహేంద్రగఢ్-దేహ్రాడూన్ ఫాల్ట్ (MDF), ఢిల్లీ-హరిద్వార్ రిడ్జ్ (DHR), ఢిల్లీ-సర్గోధా రిడ్జ్ (DSR), సోహ్నా ఫాల్ట్, మథురా ఫాల్ట్, ఢిల్లీ-మురాదాబాద్ ఫాల్ట్, రివర్స్ ఫాల్ట్ (F1) వంటి లైన్లు ఈ ప్రాంతాన్ని సీస్మిక్‌గా అత్యంత సున్నితమైన ప్రాంతంగా మార్చుతున్నాయి. MDF ఫాల్ట్ మహేంద్రగఢ్ నుండి దేహ్రాడూన్ వరకు విస్తరించి ఉండటం, NCR ప్రాంతాన్ని ఛేదించడం వల్లే ఈ తరహా ప్రకంపనలు తరచూ సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ప్రాంత భూగర్భ నిర్మాణాన్ని ప్రభావితం చేయడంలో హిమాలయాల భౌగోళిక కదలికలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. భారత ఉపఖండం ఉత్తరంగా హిమాలయాలను ఢీకొడుతూ ఉండటమే ఆంతర్యంగా పలు టెక్టానిక్ ద్రవ్యాలు లోపల దాచిపెట్టిన ఉత్పాత శక్తిని బయటకు విడిచిపెడుతున్నాయి. దీనివల్లే తక్కువ నుండి మధ్యస్థాయిలో ప్రకంపనలు వస్తుంటాయి.
Also Read: Bitcoin India value: 2009లో మీరు ఇందులో రూ.2 పెట్టుబడి పెట్టి ఉంటే.. ఈరోజు కోటీశ్వరులు అయ్యేవారు!
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండడం అత్యంత అవసరం. భూకంపాల సమయంలో బలమైన టేబుల్ కింద దాక్కోవడం, భవనాల నుంచి పరుగులు తీయకుండా, తలపై ఏదైనా రక్షణగా పెట్టుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అధికారుల సూచనలు పాటిస్తూ, అప్రమత్తతతో వ్యవహరించాల్సిన సమయం ఇది.
వాస్తవానికి తక్కువ తీవ్రత గల భూకంపాలు కాస్త ఊరటనిచ్చే అంశమే. ఎందుకంటే భూమిలోని భయంకర శక్తి ఒక్కసారిగా కాకుండా దశల వారిగా విడుదల కావడం వల్ల భవిష్యత్‌లో పెద్ద భూకంపం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కానీ వరుస భూకంపాలు నమోదవ్వడం అనేది ఈ ప్రాంత భూగర్భ స్థితి ఎంత సంక్లిష్టంగా ఉందన్న విషయం తేటతెల్లం చేస్తోంది.
ఢిల్లీ.. ఎన్‌సీఆర్ వంటి జనాభా గణనకు చాలా ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి భూగర్భ ప్రకంపనలకు ఎదురయ్యే ముప్పులను తగ్గించేందుకు ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడం తప్పనిసరి. భవన నిర్మాణం నుండి మున్సిపల్ ప్లానింగ్ వరకు భూకంప నిరోధక విధానాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క ప్రకంపన భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపవచ్చు.