Delhi Terror: దేశ రాజధానిలో రక్తపాతం సృష్టించటానికి ఉగ్రవాదులు చేసిన కుట్రను దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ నలుగురికి పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టుగా వెల్లడైంది.
దేశ రాజధానిలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నట్టుగా ఇటీవల దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. విచారణలో ఐఎస్ఐ హ్యాండ్లర్లు ఇక్కడ రక్తపాతం సృష్టించటానికి పంజాబ్ రాష్ట్రానికి చెందిన యువకులను రిక్రూట్ చేసినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో విచారణను ముమ్మరం చేసిన ప్రత్యేక బృందాలు పక్కాగా సేకరించిన సాంకేతిక ఆధారాల సహాయంతో దిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోని వేర్వేరు చోట్ల దాడులు జరిపారు.
మొదటగా అమృత్ సర్ లోని మజీఠా రోడ్డులో శుభ్ దీప్ సింగ్ (23) ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి సెమీ ఆటోమేటిక్ పిస్టల్, 5 లైవ్ బుల్లెట్లు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పాకిస్తాన్ లో ఉంటున్న ఐఎస్ఐ హ్యాండ్లర్ షెహజాద్ భట్టీ నెట్ వర్క్ కు చెందిన వారితో తనకు సంబంధాలు ఉన్నట్టుగా శుభ్ దీప్ వెల్లడించాడు. డ్రోన్ల ద్వారా పంజాబ్…పాకిస్తాన్ సరిహద్దుల నుంచి ఆయుధాలు తెప్పించుకున్నట్టుగా చెప్పాడు. దాంతోపాటు మాదక ద్రవ్యాలు కూడా తెప్పించుకున్నట్టుగా వెల్లడించాడు.
ఇక, శుభ్ దీప్ వెల్లడించిన వివరాల ఆధారంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న గగన్ ప్రీత్ (24) అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ లోని వివరాలను విశ్లేషించగా కుట్రకు సంబంధించిన పలు కీలక వివరాలు వెలుగు చూశాయి. గగన్ ప్రీత్ ను జరిపిన విచారణలో దిల్లీలో రద్దీగా ఉండే ప్రార్థనా స్థలాలు, పోలీస్ స్టేషన్లపై నిఘా పెట్టాలని హ్యాండ్లర్లు సూచించినట్టుగా వెల్లడైంది. పూర్తిస్థాయిలో రెక్కీ జరిపిన తరువాత కాల్పులు జరపాలని ఆదేశించినట్టుగా తెలిసింది.
అటు గగన ప్రీత్ విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా గుర్జంత్ సింగ్ (22)..అతని బంధువు సజన్ సింగ్ (28)లను కూడా స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు పాకిస్తాన్ లో ఉంటున్న హ్యాండ్లర్లకు నిత్యం టచ్ లో ఉంటూ డ్రోన్ల ద్వారా వచ్చిన ఆయుధాలు, మాదక ద్రవ్యాలను సేకరించి మిగితా వారిని చేర్చినట్టుగా దర్యాప్తులో తేలింది. పాకిస్తాన్ కు చెందిన హ్యాండ్లర్లు.. ఈ ఇద్దరికి పోలీస్ స్టేషన్లు, చెక్ పోస్టుల వద్ద రెక్కీ జరిపి కాల్పులు జరపాలని సూచించినట్టుగా వెల్లడైంది.
Also Read: డేటానే సంపద.. ఐటీతోనే ప్రగతి.. స్వర్ణాంధ్ర విజన్‌పై చంద్రబాబు మార్క్ స్పీచ్
స్పెషల్ ఆపరేషన్ జరిపి పట్టుకున్న నిందితుల నుంచి రెండు తుపాకులు, ఓ జిగానా పిస్టల్, ఒక 30 బోర్ పిస్టల్, తొమ్మిది లైవ్ బుల్లెట్లు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు స్పెషల్ సెల్ డీసీపీ ప్రవీణ్ కుమార్ త్రిపాఠి తెలిపారు. నిందితులు నలుగురు దిల్లీలోని పోలీస్ స్టేషన్లు, ప్రార్థనా స్థలాలు, చెక్ పోస్టుల వద్ద రెక్కీ జరిపినట్టు చెప్పారు. ముగ్గురిని పంజాబ్ లో అరెస్ట్ చేయగా ఒకరిని ఢిల్లీలో పట్టుకున్నామని వివరించారు.
Also Read: కవిత అరెస్టు పర్వంలో పోలీస్ దాష్టీకం..! ఈడ్చుకెళ్లి.. రాళ్లపై పడేసి.. కారు డోరుకు ఢీకొట్టి..!