Surat News: దోపిడీ దొంగలు తెగబడుతున్నారు. ఒకప్పుడు రహదారులపై వెళ్లే వాహనాలను ఆపి దోపిడీకి పాల్పడేవారు. వారు రూటు మార్చారు. ఇప్పుడు సిటీలను టార్గెట్ చేశారు.. చేస్తున్నారు కూడా. తాజాగా సూరత్‌లో ఫేమస్ డైమండ్ షోరూమ్‌లో రూ. 25 కోట్ల విలువైన వజ్రాలను దోపిడి చేశారు నిందితులు. అసలేం జరిగింది?
గుజరాత్‌లోని సూరత్ సిటీలో వజ్రాల దోపిడీ తీవ్ర కలకలం రేపింది. డైమండ్ కంపెనీ డీకే అండ్ సన్స్ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు రూ.25 కోట్ల విలువైన వజ్రాలను దొంగిలించారు. ఈ ఘటన ఆగస్టు 15 నుంచి 17 మధ్య జరిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఇదే అదునుగా భావించిన దొంగలు, దోపిడీకి తెరలేపారు.
సూరత్ పేరు చెప్పగానే డైమండ్స్ గుర్తుకు వస్తాయి. ఎందుకంటే ఆ సిటీ వజ్రాల వ్యాపారానికి ఫేమస్. అక్కడ డీకే అండ్ సన్స్ సంస్థ గురించి చెప్పనక్కర్లేదు. వందల కోట్ల రూపాయలు అక్కడ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఆగష్టు సెకండ్ వీక్‌లో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. శుక్రవారం ఆగష్టు 15, శనివారం కృష్ణాష్టమి, ఆదివారం వీకెండ్ కావడంతో సెలవు ఉంటుంది.
ఇదే అదునుగా భావించిన దొంగలు.. పక్కాగా వజ్రాల చోరీకి ప్లాన్ చేశారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 25 కోట్ల రూపాయల విలువ చేసే డైమండ్స్‌ని దొంగిలించారు. సోమవారం షాపు ఓపెన్ చేసేసరికి లోపల వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయి. దీంతో షాకయ్యాడు ఓనర్ దేవేంద్ర చౌదరి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ALSO READ: మోడీని కలిసిన వ్యోమగామి శుభాంసు శుక్లా
చోరీ ఎలా జరిగింది? భవనంలోని దిగువ అంతస్తులోని షాపులోకి ఎంట్రీ ఇచ్చారు దొంగలు. మిగిలినవారు ప్రధాన ద్వారం ద్వారా లోపలికి వచ్చారు. మూడో అంతస్తులో మెటల్ సేఫ్ వద్దకు చేరుకుని గ్యాస్ కట్టర్ సహాయంతో డోర్లను కట్ చేసి వజ్రాలను దోచుకున్నారు. చోరీ జరిగిన సమయంలో భవనంలో సీసీటీవీ కెమెరాలు ధ్వంసమయ్యాయి.
దీంతో దర్యాప్తు చేయడం పోలీసులకు కాసింత కష్టంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. వజ్రాలు దొంగితనం జరిగినప్పుడు సెక్యూరిటీ గార్డులు లేరని తెలుస్తోంది. వజ్రాల కంపెనీలో మాజీ సెక్యూరిటీ గార్డు కోసం తాము వెతుకుతున్నట్లు తెలిపారు.
అనుమానాస్పద కార్యకలాపాల నేపథ్యంలో నెల రోజుల కిందట ఓ సెక్యూరిటీ గార్డుని తొలగించాడు షాపు యజమాని. ఆ తర్వాత అతడు తన స్నేహితులను ఆ కంపెనీకి తీసుకువచ్చి ఓనర్‌తో మాట్లాడించాడు. ఆ తర్వాత ఏమైందో తెలీదు. మాజీ సెక్యూరిటీ గార్డు అనుమానితులలో ఒకడిగా పోలీసులు భావిస్తున్నారు. ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ జార్ఖండ్‌లో యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
డైమండ్ ఫ్యాక్టరీలో ఇతర సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వజ్రాల బాక్స్ చాలా వేడిగా ఉందని, దొంగతనం ఆదివారం రాత్రి జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దుండగులు గ్యాస్ కట్టర్ ఉపయోగించి మెటల్ సేఫ్ మూడు అంచెల పగలగొట్టినట్టు పోలీసుల మాట. పాలిష్ చేసి అమ్మకానికి రెడీ ఉన్నాయని, వాటిని దొంగిలించినట్టు డిప్యూటీ కమిషనర్ చెప్పుకొచ్చారు.