Vijay – Trisha: తమిళనాడు సీఎం విజయ్, ప్రముఖ నటి త్రిష అంశం అక్కడి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి గురించి గత కొద్దిరోజులుగా ఏదోక రూపంలో చర్చ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ఎలాంటి అధికారిక హోదా లేకపోయిన త్రిష పాల్గొనడం, ముందు వరుసలో కూర్చొని సీఎం విజయ్ కు సెల్యూట్ చేయడం వంటివి తీవ్ర దుమారం రేపింది. తాజాగా ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే తీవ్రంగా మండిపడింది. తన అధికారిక పత్రిక ‘మురసోలి’లో నటి పేరు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించింది.
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి ప్రవర్తన తగినట్లుగా లేదని డీఎంకే తన సంపాదకీయంలో పేర్కొంది. విజయ్ తల్లిదండ్రులతో పాటు నటి త్రిష ముందు వరుసలో కూర్చోవడాన్ని తప్పుబట్టింది. పోలీసుల గౌరవందనం స్వీకరిస్తూ ఓపెన్ టాప్ లో వెళ్తున్న విజయ్ కు త్రిష సెల్యూట్ చేయడం ఆయన ప్రతిగా ఆమెకు సెల్యూట్ చేయడాన్ని ఈ కథనం డీఎంకే హైలెట్ చేసింది. ‘ఒక నటిని మొదటి వరుసలో కూర్చోబెట్టి, పరస్పరం సెల్యూట్ చేసుకోవడం విజయ్‌కి ఓటేసిన ప్రజలు సహించలేకపోతున్నారు. ఇలాంటి దిగజారుడుతనాన్ని సమర్థించుకుంటారా?’ అని రాసుకొచ్చింది. టీవీకే మద్దతుదారులు కూడా ఈ విషయాన్ని అంగీకరించలేకపోతున్నారని డీఎంకే వ్యాఖ్యానించింది.
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సీఎం విజయ్ తన ప్రజాదరణపై నమ్మకం కోల్పోయి భయపడుతున్నారని ‘మురసోలి’ ఆరోపించింది. జెండా ఆవిష్కరణ అనంతరం విజయ్ మాట్లాడుతూ.. ‘మన పని అయిపోయిందని అనుకోవద్దు. ప్రభుత్వం అమలు చేసే మంచి పథకాలకు ప్రజలు మద్దతుగా నిలవాలి’ అని విజ్ఞప్తి చేయడాన్ని డీఎంకే ఎత్తిచూపింది. అయితే డీఎంకే అధికారిక పత్రికలో వచ్చిన విమర్శల దాడిపై టీవీకే పార్టీ ఇప్పటివరకూ స్పందించలేదు. ఇదిలా ఉంటే మే నెలలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా త్రిష హాజరైన సంగతి తెలిసిందే.
Also Read: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. జైలు నుంచి ఆస్పత్రికి.. పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
ఇదిలా ఉంటే విజయ్ విడాకుల అంశమూ తమిళనాట రాజకీయ చర్చకు తావిచ్చింది. విజయ్ భార్య సంగీత ఇటీవలే విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నప్పటికీ.. అందులో పేర్కొన్నమానసిక వేధింపులు, సంబంధాల అంశాలు మాత్రం రాజకీయంగా వివాదాస్పదంగా మారాయి. అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష నేతలు వీటి గురించి ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలను ‘అర్థం లేనివి’గా సీఎం విజయ్ కొట్టిపారేశారు. మెుత్తం మీద విజయ్ పాలన పక్కకు జరిగి.. ఆయన వ్యక్తిగత జీవితంపై నిత్యం ఏదోక చర్చ జరుగుతుండటంపై టీవీకే వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
Also Read: ‘అమరుల భూమి.. అసురుల భూమి’.. అమరావతిపై పాటతో విరుచుకుపడ్డ అంబటి!