BigTV English

Dragon Fruit Cultivation : కరువు జిల్లాలో కనకవర్షం!

Dragon Fruit Cultivation : కరువు జిల్లాలో కనకవర్షం!
Dragon Fruit Cultivation

Dragon Fruit Cultivation : సంగోల్ తాలూకా అంటేనే కరువుకు కేరాఫ్. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని ఈ తాలూకాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తు తున్నాడు మహేశ్ అసాబే. వసూద్ గ్రామంలోని 20 ఎకరాల్లో దీనిని సాగు చేయడం ద్వారా ఏటా రూ.2 కోట్ల ఆదాయం గడిస్తున్నాడు.


వర్షం కురిస్తే ఒట్టు

సంగోల్ తాలూకా వార్షిక సగటు వర్షపాతం 500 మిల్లీమీటర్ల కంటే తక్కువే. 2018లో 241.6 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే అక్కడ నమోదైంది. గత 20 ఏళ్లలో అత్యల్ప వర్షపాతం అదే. మొత్తం మీద 24 రోజులు మాత్రమే వర్షం కురిసింది.
అలాంటి ప్రాంతంలో వ్యవసాయం చేయడమే వేస్ట్ అని అందరూ అనుకుంటున్న వేళ మహేశ్ సాహసించాడు. పండ్ల తోటల సాగుతో ఎకరానికి రూ.10 లక్షల ఆదాయం సంపాదించే మార్గాన్ని చూపి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచాడీ 27 ఏళ్ల ఇంజనీర్.


వ్యవసాయంపై మక్కువ

కొల్హాపూర్‌లో 2018లో బీటెక్, ఆపై ఉదయ్‌పూర్‌లో ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశాడు. వ్యావసాయిక కుటుంబనేపథ్యం ఉన్న మహేశ్‌కు వ్యవసాయమంటే చిన్నతనం నుంచే మక్కువ. రైతుగా అతని తండ్రి కూడా ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కేవాడు. 2009లోనే ఆయన యాపిల్ బేర్‌ను ఆ కరువు ప్రాంతంలో సాగు చేయడం విశేషం. ఇతర రైతులు కూడా ఆయన బాటనే అనుసరించి పండ్ల తోటలను పెద్ద ఎత్తున సాగు చేశారు.కొత్త కొత్త పండ్ల మొక్కల సాగును చేపట్టే అలవాటు మహేశ్‌కు తండ్రి నుంచే వచ్చింది.

బెంగాల్ నుంచి మొక్కలు

డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి మహేశ్ చెప్పిన వెంటనే తండ్రి నుంచి ఆమోదం లభించింది. 3 ఎకరాల్లో మొత్తం 9 వేల మొక్కలను నాటాడు. పశ్చిమబెంగాల్‌లోని ఓ నర్సరీ నుంచి రూ.110‌కి ఒక మొక్క చొప్పున మహేశ్ వాటిని కొనుగోలు చేశాడు. ఇప్పుడంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్క రూ.25 నుంచి రూ.30కే దొరికేస్తోంది. కర్రల ఊతంతో ఈ మొక్కలు ఎదుగుతాయి. ఒక్కో ఎకరానికి 2000-2500 మొక్కలు పెట్టేందుకు 500 కర్రలు సరిపోతాయి.

డ్రిప్ పద్ధతి మేలు

మొక్కలు ఏపుగా పెరిగి ఫలసాయం అధికంగా లభించాలంటే డ్రిప్ పద్ధతి మేలు. ఈ విషయాన్ని ఆకళింపు చేసుకున్న మహేశ్.. ఆ విధానాన్నే అనుసరించారు. ఫ్లడ్ ఇరిగేషన్ వల్ల నీరు వ్యర్థం కావడమే కాకుండా.. కలుపు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. పోల్స్, ప్లాంట్స్, డ్రిప్ ఇరిగేషన్, లేబర్, ఇతర ఖర్చులన్నీ కలిపి డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఎకరానికి రూ.5-6 లక్షలు వ్యయమైంది.

తొలి ఏడు ఎకరాకు 5 టన్నులు

12-15 నెలల అనంతరం ఫలసాయం అందుతుంది. మన దేశంలో ఫ్రూటింగ్ సీజన్ జూన్ నుంచి నవంబర్ వరకు. ఈ సమయంలో దిగుబడి ఆరురెట్లు ఎక్కువగా ఉంటుందని మహేశ్ చెప్పాడు. తొలి ఏడాది ఎకరాకు 5 టన్నుల దిగుబడిని పొందగలిగాడు. రూ.వందకు కిలో చొప్పున విక్రయిస్తే రూ.5 లక్షల ఆదాయం వచ్చింది.

రెండేళ్లలోనే పెట్టుబడి వెనక్కి..

తొలి రెండేళ్లలోనే రైతులకు పెట్టుబడి తిరిగి వచ్చేస్తుందని వివరించాడు మహేశ్. డ్రాగన్ ఫ్రూట్ పండించినందుకు 2.5 ఎకరాలకు 1.6 లక్షల సబ్సిడీని మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తోంది. రెండేళ్ల అనంతరం ఖర్చులన్నీ పోను ఎకరాకు రూ.9 లక్షలు నికర ఆదాయం లభిస్తుందని చెబుతున్నాడు మహేశ్. 95 శాతం దిగుబడిని అతను అక్కడికక్కడే విక్రయించేస్తాడు.

సిద్ధమవుతున్న ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్

సంగ్లి, కొల్హాపూర్, షోలాపూర్, ముంబై, పుణెల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ నుంచి కూడా కొనుగోలు‌దారులు పెద్ద ఎత్తున వస్తుంటారని చెప్పాడు. 2018-20లో ఫుడ్ ప్రాసెసింగ్‌లో పీజీ పూర్తి చేసిన ఈ అగ్రిప్రెన్యూర్.. డ్రాగన్ ఫ్రూట్ జామ్, జ్యూస్, జెల్లీ, స్వ్కాష్, చిప్స్, వైన్ వంటి ఉత్పత్తుల తయారీకి సిద్ధమవుతున్నాడు. లైసెన్స్‌లు మంజూరయ్యాక ఈ ఏడాది జూన్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఆరంభించనున్నాడు మహేశ్. 20 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు ద్వారా ఏటా రూ.2 కోట్ల ఆదాయం లభిస్తుండగా.. ప్రాసెసింగ్ యూనిట్‌తో అది మరింత పెరగనుంది.

Tags

Related News

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Big Stories

×