Big Stories

EC : సార్వత్రిక ఎన్నికలకు ఈసీ సన్నద్ధం.. కీలక మార్గదర్శకాలు జారీ..

EC : కేంద్రం ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది కాలంలో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. అలాగే
లోక్‌సభకు ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల సిబ్బంది నియామకంపై అన్ని రాష్ట్రాల సీఈవోలకు మార్గదర్శకాలు జారీచేసింది. రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, ప్రిసైడింగ్‌ అధికారులు, పోలింగ్‌ అధికారులు, ఆ చట్టంలోని సెక్షన్‌ 159 కిందికి వచ్చే ఇతర సిబ్బంది, పోలీస్‌ సిబ్బందిని ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన నాటి నుంచి ఫలితాలు వెల్లడించే వరకు ఈసీకి డెప్యుటేషన్‌పై వచ్చిన ఉద్యోగులుగానే పరిగణిస్తారు. ఆ సమయంలో వారంతా ఈసీ పర్యవేక్షణలోనే ఉండాలి. ఈ విషయాలపై రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు ఈసీ సూచనలు చేసింది.

- Advertisement -

జిల్లా ఎన్నికల అధికారి తన పరిధిలోని అర్హులైన పోలింగ్‌ సిబ్బంది సమాచారాన్ని ఎలక్ట్రానిక్‌ నమూనాలో సిద్ధం చేసి కంప్యూటర్‌ ద్వారా ర్యాండమైజేషన్‌కు అనువుగా ఉంచాలి. డేటాబేస్‌లో పేరు, జెండర్, హోదా, నివాస స్థలం, పనిచేసే స్థలం, సొంత అసెంబ్లీ నియోజకవర్గం ఈ వివరాలు పొందుపరచాలి. పోలింగ్‌ సిబ్బందిగా నియమించడానికి వీలైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలు డేటాబేస్‌లో వేర్వేరుగా పొందుపర్చాలి. వివిధ శాఖలు, వేర్వేరు కార్యాలయాల నుంచి తీసుకున్న సిబ్బందిని తగిన విధంగా సర్దుబాటు చేయాలి.

- Advertisement -

సీనియారిటీ, వేతనాలు, ర్యాంకులు, పోస్ట్‌ ఆధారంగా ప్రిసైడింగ్‌ అధికారులు, పోలింగ్‌ అధికారులను నియమించాలి. గెజిటెడ్‌ అధికారులను ప్రిసైడింగ్‌ అధికారులుగా నియమించడం సాధ్యం కాకపోతే సూపర్వైజరీ సామర్థ్యంలో పనిచేసే అధికారులను మాత్రమే పెట్టుకోవాలి. పని చేస్తున్న, నివాసం ఉంటున్న, సొంత అసెంబ్లీ నియోజకర్గంలో ఎన్నికల బాధ్యతలను అప్పగించకూడదు.

ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేస్తే తప్ప ఎన్నికల సిబ్బందిని ఆ జిల్లాలోనే నియమించాలి. పోలింగ్‌ జరిగే రోజు పోలీస్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ చేపట్టాలి. ఇతర జిల్లాల నుంచి వచ్చే పోలీసు కానిస్టేబుళ్లు, హోంగార్డులను ఎలాంటి ర్యాండమైజేషన్‌ లేకుండానే విధుల్లోకి తీసుకోవచ్చు. జిల్లాల వారీగా కానిస్టేబుళ్లు, హోంగార్డుల జాబితాను హోంశాఖకు చెందిన కంప్యూటరైజ్డ్‌ డేటాబేస్‌తో పోల్చి సరిచూసుకోవాలి. ఇలా కీలకమైన మార్గదర్శకాలను కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్రాల అధికారులకు పంపించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News