Bangalore News: ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెత మాదిరిగా ఉంది ఈ శునకం పరిస్థితి. ఓ యజమానికి రూ. 50 కోట్ల విలువ చేసే శునకం ఉన్నట్లు ఈడీ చెవిలో పడింది. దీనిపై ఏ మాత్రం ఆలోచించకుండా రంగంలోకి దిగేసింది. చివరకు యజమాని ఇంటికి వెళ్లి చూసేసరికి ఖంగుతిన్నారు. అసలేం జరిగింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఈ మధ్యకాలంలో వివిధ జాతుల శునకాలను ఇంట్లో పెంచుతున్నారు కొందరు వ్యక్తులు. అందులో బడా బాబులు ఉంటారనుకోండి. కుక్కలను పెంచుకోవడం చాలా మందికి హాబీగా భావిస్తుంటారు. వీటి కోసం లక్షల్లో ఖర్చు చేస్తారు. దాని కింద అయ్యే ఖర్చు, శ్రమ కూడా అదే విధంగా ఉంటుందనుకోండి.. అది వేరే విషయం.
బెంగుళూరులో ఓ వ్యక్తి రూ. 50 కోట్ల విలువ చేసే శునకాన్ని పెంచుతున్నట్లు ఈడీ దృష్టిలో పడింది. వెంటనే ఆ యజమాని ఇంటి దగ్గర వాలిపోయారు. దర్యాప్తు వెళ్లిన ఈడీ అధికారులు ఇంటి ఓనర్ చెప్పిన సమాధానాలకు షాకయ్యారు. వెంటనే అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఇటీవల బెంగుళూరులో డాగ్స్ షో జరిగింది. అక్కడికి సతీశ్ ఇంటి నుంచి ఓ డాగ్ వచ్చింది. తోడేలు మాదిరిగా ఉంటుంది ఆ కుక్క. అందుకే దాన్ని ఊల్ఫ్‌డాగ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ శునకాన్ని ఫలానా ఏరియా నుంచి తెచ్చానని, దాని ఖరీదు తలచుకుంటే కన్నీళ్లు వస్తాయని మాటల సందర్భంగా పక్కవారితో చెప్పాడు. సతీష్ చేసిన మౌత్ ప్రచారం ఆ నోటో ఈ నోటా పాకింది. అందరు ఆ కుక్కతో సెల్ఫీలు దిగడం మొదలుపెట్టారు.
ALSO READ: కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం.. ఆపై కేంద్రం కొరడా
ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఊల్ఫ్‌డాగ్‌కు బోలెడంత ప్రచారం వచ్చింది. ఈ విషయం ఈడీ చెవిలో పడింది. ఒక్క శునకం 50 కోట్ల ఉంటే, ఆ వ్యక్తి ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారోనన్న అనుమానం వెంటనే వచ్చింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాగ్ ఓనర్ సతీష్ ఇంటి ముందు వాలిపోయారు. రూ.50 కోట్ల డబ్బు ఎక్కడిది? డబ్బు లావాదేవీలు ఎలా జరిగాయి? అంటూ రకరకాల ప్రశ్నలు సంధించారు.
కుక్క కొనుగోలుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో తాను చూపించిన శనకానికి అంత సీను లేదన్నాడు సతీష్. రూ.50 కోట్లు పెట్టి కొనలేదని కేవలం ప్రచారం కోసం ఇలా చేశానని అసలు విషయాన్ని బయటపెట్టాడు. కనీసం రూ.50 వేలు కూడా ఉండదని చెప్పడంతో అధికారులు ఖంగుతిన్నారు.
ఈ సోదాలపై ఈడీని ఓ న్యూస్ ఏజెన్సీ సంపద్రించింది. సోషల్ మీడియాలో ఫేమ్ కోసమే యజమాని రూ.50 కోట్ల అంటూ ప్రచారం చేసుకున్నాడని తెలిపారు. భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేయలేదని తాము గుర్తించామని తెలిపారు. కుక్కపై జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు.
ఈడీ దర్యాప్తు చేస్తే నార్మల్‌గా ఉండరు. అన్ని వివరాలు లేకుంటే, పోలీసుల నుంచి సమాచారం తీసుకున్న తర్వాతే రంగంలోకి దిగుతుంది. కనీసం యానిమల్ ఆసుపత్రి నుంచి ఆ ఊల్ఫ్‌డాగ్ గురించి వివరాలు తీసుకుని ఈడీ బయలుదేరినా బాగుండేది. అలా చేయకుండా కేవలం సోషల్ మీడియా ప్రచారంతో ఈడీ దర్యాప్తుకు దిగడంపై రకరకాల కామెంట్స్ పడిపోతున్నాయి.