Yamuna Kejriwal Rahul Gandhi Delhi Elections | హరియాణాలోని బిజేపీ ప్రభుత్వం యమునా నదిలోకి పారిశ్రామిక వ్యర్థాలను ఉద్దేశపూర్వకంగా వదులుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం (Election Commission) స్పందించింది. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు వెంటనే అందించాలని పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి లేఖ రాసింది. బుధవారం జనవరి 29న రాత్రి 8 గంటల్లోపు ఈ ఆధారాలను అందించాలని ఆప్‌కు ఈసీ డెడ్‌లైన్ విధించింది.
హరియాణా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదిలో అమోనియం స్థాయిలు ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ పారిశ్రామిక వ్యర్థాల వల్ల నగరవాసులకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, హరియాణా ప్రభుత్వం ఈ విషయం తెలిసినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే వ్యర్థాలను డంప్ చేస్తోందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ప్రస్తుత సిఎం ఆతిషి సింగ్ ఆరోపించారు. ఈ క్రమంలో నదిలో విషం కలపడం ద్వారా ప్రజలను హతమార్చాలని హరియాణా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, బిజేపీ ఎన్నికల వేళ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ కూడా యమున నదిని కలుషితం చేయడాన్ని ‘జల ఉగ్రవాదం’గా పేర్కొన్నారు.
యమునా నదిలో వ్యర్థాల వివాదంపై హరియాణా ప్రభుత్వం నుంచి ఎన్నికల సంఘం ఇటీవల వివరణ కోరింది. అమోనియా స్థాయిలపై వాస్తవిక నివేదికను జనవరి 28లోగా అందజేయాలని ఆదేశించింది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి లేఖ రాసిన ఈసీ, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు అందించాలని కోరింది. ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: కుంభమేళాకు పుణ్యం కోసం వచ్చాడు.. పోలీసులకు చిక్కాడు!
మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. అధికారంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
‘‘కేజ్రీవాల్ తనకు తోచిన విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. మొదట్లో ఢిల్లీలో అవినీతి రహిత రాజకీయాలు చేస్తానని చెప్పారు. కానీ, పేదలు కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించకుండా పోతారు. ఢిల్లీలో హింస జరిగే సమయంలో మాయం అయ్యారు. ఆయనకు మొదట్లో చిన్న కారు మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు శీష్ మహల్‌లో (అద్దాల మేడ) నివసిస్తున్నారు’’ అని కేజ్రీవాల్ పై రాహుల్ గాంధీ అవినీతి ఆరోపణలు చేశారు.
అలాగే, ‘‘అవినీతి రహిత రాజకీయాలు చేస్తానని చెప్పి, ఢిల్లీలో భారీ కుంభకోణాన్ని సృష్టించారు. కేజ్రీవాల్ కుంభకోణానికి రూపకల్పన చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోదియా జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కేజ్రీవాల్ ఇప్పుడు అత్యంత విలాసవంతమైన అద్దాల మేడలో నివసిస్తున్నారు. వారి రాజకీయాలు ఇప్పుడు అందరికీ అర్థమయ్యాయి’’ అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారంలోని ఆమ్ ఆద్మీ పార్టీని గద్దె దింపేందుకు ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘సీఎం బంగ్లా’ వివాదం రాజకీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది. ఈ బంగ్లాను ‘శీష్ మహల్’ (అద్దాల మేడ) అని బిజేపీ విమర్శిస్తోంది. ఇప్పుడు ఇదే వివాదంపై రాహుల్ గాంధీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో పోలింగ్ జరగనుంగా.. ఫలితాలు ఫిబ్రవరి 8న ప్రకటించబడతాయి.