Himanshi Narwal: కశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడికి భారత్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట 25 నిమిషాల పాటు మెరుపు దాడులు చేసింది. అయితే ఈ ఘటనపై పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ స్పందించారు.
టెర్రరిస్టులను అంతమొందించడానికి ఆపరేషన్ సిందూర్ పేరు సరిగ్గా సరిపోయిందని ఆమె చెప్పారు. ఉగ్రదాడుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ అటాక్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఉగ్రవాదం అంతానికి ఇదే ఆరంభమని అన్నారు. అలాగే ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ అమరవీరుల హోదా ఇవ్వాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడిలో నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే వివాహం జరిగిన నాలుగు రోజులకే భార్యను తీసుకుని హనీమూన్ కోసం కశ్మీర్ వెళ్లగా దురదృష్టవశాత్తు ఈ ఘటన చోటుచేసుకుంది. అనుకోకుండా టెర్రరిస్టుల చేతిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. భార్య కళ్ల ముందే ఆ రాక్షసులు అతడిని దారుణంగా కాల్చి చంపారు. అతని భార్య హిమాన్షి నర్వాల్ భర్త మృతదేహం పక్కనే కూర్చుని కన్నీళ్లు పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ దృశ్యాలను చూసి దేశం మొత్తం కంటతడి పెట్టింది. అయితే పహాల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం రోజు అర్ధరాత్రి భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది.
More Power to you Himanshi Narwal.pic.twitter.com/jcqNKtuOmQ
— Avdhesh Pareek (@Zinda_Avdhesh) May 7, 2025
దీనిపై లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ సతీమణి హిమాన్షు నర్వాల్ స్పందించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసి దేశానికి శాంతి చేకూర్చాలనే లక్ష్యంతోనే తన భర్త రక్షణ దళంలో చేరారని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఆయన లేకపోయినా.. ఆ స్ఫూర్తి మాత్రం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక టూరిస్టుల ప్రాణాలు తీసి, వారి కుటుంబాలను రోడ్డుకు ఈడ్చిన వారిని ఇలానే కఠినంగా శిక్షించాలని అన్నారు. అలాగే ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని పేర్కొన్నారు. తనలాంటి పరిస్థితి మరే కుటుంబానికి రాకూడదని.. ఈ ప్రతీకార చర్యకు ఆపరేషన్ సిందూర్ పేరు సరిగ్గా సరిపోయిందని ఆమ చెప్పుకొచ్చారు.
Also Read: India Pakistan War : పాక్ యుద్ధ విమానాల కూల్చివేత.. భారత్ చావుదెబ్బ.. వైరల్ వీడియో..
తనకు ఇటీవలే మ్యారేజ్ అయిందని చెప్పిన హిమాన్షి నర్వాల్.. తన జీవితాన్ని ఉగ్రవాదులు లాగేసుకున్నారని గుర్తు చేశారు. కళ్లముందే తన లైఫ్ తల్లకిందులైందని.. తనతో పాటు చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయని చెప్పారు. తన భర్త మృతితో తానెంత బాధను అనుభవిస్తున్నానో చెప్పలేకపోతున్నానని ఒక్కసారిగా కన్నీటిపర్యంతం అయ్యారు.