ఒక చిన్న ఏనుగు.. వయసు కేవలం ఐదేళ్లు. అస్సాంలోని మనాస్ నేషనల్ పార్క్ నుంచి తమిళనాడులోని మదురై మీనాక్షి అమ్మన్ ఆలయానికి తీసుకొచ్చారు. దాదాపు 3 వేల కిలోమీటర్ల ప్రయాణం. ఆరు రోజుల్లోనే గమ్యస్థానానికి చేర్చారు. ఆ ఏనుగు పేరు దుర్గ. కానీ దుర్గ ఒక్కటే కాదు. ఇలాగే అస్సాం నుంచి తమిళనాడులోని వేర్వేరు ఆలయాలకు మరో నాలుగు ఏనుగులను కూడా తరలించారు. మొత్తం ఐదు ఏనుగులు. ఐదు వేర్వేరు యజమానులు. కానీ వీటన్నింటి వెనుక ఉన్నది మాత్రం ఒకే ట్రస్ట్. ఈ ఏనుగులను ఆలయాలకు బహుమతిగా ఇచ్చినట్టు చెబుతున్నారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే.. అడవుల నుంచి ఏనుగుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఇన్నేళ్లుగా ప్రభుత్వాలు ఎన్నో నిబంధనలు తీసుకొస్తుంటే.. ఇప్పుడు ఇంత చిన్న వయసున్న ఐదు ఏనుగులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎలా వచ్చాయి? వీటిని నిజంగానే బహుమతిగా ఇచ్చారా? లేక ఈ బహుమతుల వెనుక కోట్ల రూపాయల వ్యవహారం ఉందా? ఇంకా ఆసక్తికరమైన విషయం.. ఈ వ్యవహారంలో బీజేపీ అగ్రనేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది?
మొదట ఈ ఐదు ఏనుగుల కథ ఏంటో తెలుసుకుందాం. అస్సాం నుంచి వచ్చిన ఐదు ఏనుగుల్లో మొదటిది దుర్గ. దీన్ని మదురై మీనాక్షి అమ్మన్ ఆలయానికి ఇచ్చారు. రెండోది రుప్సింగ్. దీన్ని నాగపట్నంలోని వైతీశ్వరన్ ఆలయానికి తరలించారు. మరో రెండు ఏనుగులు హీరాలాల్, శివ. వీటిని తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయానికి ఇచ్చారు. ఐదో ఏనుగు బిజులీ. దీన్ని కాంచీపురంలోని కంచి కామకోటి పీఠానికి అందించారు. ఈ ఐదు ఏనుగులనూ అందించింది సేవా ట్రస్ట్. ఈ ట్రస్ట్‌ను నడిపిస్తున్నది అనురాధ సుబ్రమణియన్. ఆమె భర్త వైద్యనాథన్ కృష్ణమూర్తి.
2025లో అనురాధ సుబ్రమణియన్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను కలిసి ఆలయాలకు ఏనుగులను ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. సెప్టెంబర్ 4, 2025న సీఎంకు లెటర్ కూడా రాశారు. తమిళనాడులోని కొన్ని ఆలయాల్లో సంప్రదాయ పూజలు, ఆచారాల నిర్వహణ కోసం ఏనుగులు కావాలన్నారు. దీనికి అస్సాం ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు ట్రస్ట్ చెబుతోంది. ది న్యూస్ మినిట్ అనే మీడియా సంస్థ ఈ సమస్యపై విచారణ జరుపుతున్నప్పుడు ఈ విషయాలు బయటపడ్డాయి.
వీళ్లు కోరారు.. వారు ఓకే అన్నారు.. ఇందులో ఏముంది? అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కథ. ఒక ప్రైవేట్ ట్రస్ట్ అడిగితే.. అస్సాం ప్రభుత్వం ఐదు ఏనుగులను ఆలయాలకు ఇవ్వడానికి ఎందుకు ముందుకొచ్చింది? ఈ ఏనుగుల అసలు యజమానులు ఎవరు? వీటిని ప్రభుత్వమే ఎంపిక చేసిందా? లేక ట్రస్ట్ ముందుగానే ఈ ఏనుగులను ఇచ్చేందుకు రెడీ అయ్యాక.. ఈ తతంగమంతా జరిగిందా? ఈ క్వశ్చన్స్కు ఎగ్జాక్ట్‌గా అయితే ఆన్సర్ రాలేదు. కానీ.. ఈ అనుమానాలు బలపడటానికి కారణం.. పర్మిషన్స్ వచ్చిన స్పీడ్.
ఇప్పుడు ఈ ఏనుగుల తరలింపులో జరిగిన పరిణామాలను గమనించండి. 2026 సెప్టెంబర్ 2న మద్రాస్ హైకోర్టు గతంలో ఆలయాలు కొత్త ఏనుగులను పొందకుండా అడ్డుకున్న 2023 నాటి ఆర్డర్స్‌ను కొట్టేసింది. అంతేకాదు బంధించినప్పుడు పుట్టి పెరిగిన ఏనుగులను చట్ట ప్రకారం బహుమతిగా ఇవ్వవచ్చని కోర్టు చెప్పింది. ఆ తర్వాత సెప్టెంబర్ 4న ఆలయాల్లో ఏనుగులను ఉంచేందుకు అవసరమైన సౌకర్యాలపై తనిఖీలు చేయాలని తమిళనాడు అటవీ శాఖను ఆదేశించింది. అయితే అదే రోజు మదురై మీనాక్షి అమ్మన్ ఆలయానికి సంబంధించిన తనిఖీ పూర్తయింది. సాయంత్రం 7 గంటలకు రిపోర్ట్ వచ్చింది. రాత్రి 8 గంటల 58 నిమిషాలకు దుర్గ ఏనుగును అస్సాం నుంచి తమిళనాడుకు తరలించడానికి అనుమతి కూడా వచ్చేసింది. అంటే తనిఖీ చేయడం.. రిపోర్ట్ రావడం.. పర్మిషన్ ఇవ్వడం.. ఇవన్నీ కూడా కొన్ని గంటల్లోనే జరిగిపోయాయి. సెప్టెంబర్ 7న సేవా ట్రస్ట్ మరోసారి హైకోర్టును ఆశ్రయించి ఐదు ఏనుగులను తరలించేందుకు అనుమతి కోరింది. అదే రాత్రి దుర్గను అస్సాంలోని మనాస్ నుంచి తమిళనాడుకు పంపించారు. సెప్టెంబర్ 13న దుర్గ మదురై చేరుకుంది.
ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ ఏనుగుల రవాణా కోసం సేవా ట్రస్ట్ కొన్ని రూల్స్‌ను పెట్టింది. రోజుకు 125 కిలోమీటర్లకు మించి ఏనుగులను తరలించకూడదు. వాహన ప్రయాణం రోజుకు ఆరు గంటలకు మించకూడదు. కానీ దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరాన్ని దుర్గ కేవలం ఆరు రోజుల్లోనే చేరుకుంది. అంటే నిబంధనలను పాటించలేదు అని అర్థమవుతుంది. మరి ట్రస్ట్ ప్రతిపాదించిన నిబంధనలనే ఎందుకు పాటించలేదు? ఈ విషయంపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.
ఇప్పుడు ఈ కథలో అత్యంత కీలకమైన అంశానికి వద్దాం. భారతదేశంలో ఏనుగులను కొనడం, అమ్మడం సాధారణంగా చట్టవిరుద్ధం. ఏనుగులను ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయాలంటే చట్టపరమైన నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా ఒక ఏనుగు బందిఖానాలో పుట్టిందని నిరూపించాలి. దాని తల్లి ఎవరు? ఎక్కడ పుట్టింది? దాని యజమాని ఎవరు? వంటి వివరాలు ఉండాలి. దీని కోసం DNA పరీక్షలు, మైక్రోచిప్పింగ్ వంటి విధానాలను ఉపయోగిస్తారు. కానీ ఈ ఐదు ఏనుగుల విషయంలో కొన్ని విషయాలు అనుమానాలకు తావిస్తున్నాయి. దుర్గ, హీరాలాల్, శివ ఏనుగులకు సంబంధించిన ఓనర్ సర్టిఫికెట్స్ ఒకే నెలలో జారీ అయ్యాయి. అక్టోబర్, నవంబర్ 2025లో కేవలం 26 రోజుల వ్యవధిలోనే ఈ మూడు ఏనుగులకు సర్టిఫికెట్లు వచ్చాయి.
ఇంకో విషయం ఏంటంటే.. ఈ ఏనుగుల చెవులపై చిన్న రంధ్రాలు ఉన్నట్లు వాటిలో చెప్పారు. కానీ, అస్సాంలో అడవి ఏనుగులను పట్టుకుని శిక్షణ ఇచ్చే టైమ్‌లో ఇలాంటి రంధ్రాలు కనిపిస్తాయని కొందరు వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రూప్ సింగ్ అనే ఏనుగుకు 2019లోనే ఎడమ ముందు కాలుపై బుల్లెట్ గాయం ఉన్నట్లు అటవీ శాఖ తనిఖీలో గుర్తించిందని తెలుస్తోంది. అంటే ఈ ఏనుగు అడవిలో పట్టుబడి ఉండొచ్చనే అనుమానాలకు కారణమైంది. అంతేకాదు.. ఈ ఏనుగుల వయసు, శరీర పరిమాణాల విషయంలోనూ కొన్ని పొంతనలేని వివరాలు ఉన్నాయని నివేదిక చెబుతోంది. అయితే ఈ ఆధారాలు మాత్రమే చూసి అవి కచ్చితంగా అడవుల్లో పట్టుకున్న ఏనుగులని నిర్ధారించలేం. కానీ వాటి అసలు పుట్టుకను, మాతృత్వాన్ని నిర్ధారించాల్సిన అవసరం మాత్రం ఉంది.
నెక్ట్స్ కమ్ టు ది పొలిటికల్ యాంగిల్. ఈ వ్యవహారంలో మరో వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే వైద్యనాథన్ కృష్ణమూర్తి. ఆయనకు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నరేంద్ర మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతోంది. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో కూడా సభ్యుడిగా ఉన్నారు. అయితే ఈ రాజకీయ సంబంధాలపై వచ్చిన ఆరోపణలకు ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు బయటపడలేదు. మరోవైపు అస్సాం నుంచి ఇతర రాష్ట్రాలకు ఏనుగుల బదిలీ విషయంలో గతంలోనూ రాజకీయ ప్రభావం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఐదు ఏనుగుల విషయంలో కూడా అదే తరహా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అస్సాం కాంగ్రెస్ నేత రీతమ్ సింగ్ అయితే ఈ ఐదు ఏనుగుల కోసం ఆరు కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. లాటరీ వ్యాపారి శాంటియాగో మార్టిన్ తరఫున ఈ డబ్బు చెల్లించారనేది ఆయన అలిగేషన్. అయితే ఇది ఒక రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణ మాత్రమే. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు మాత్రం లేవు.
ఇంతకీ అసలు సమస్య ఏంటి అంటే.. భారతదేశంలో ఏనుగుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కీలక పాత్ర పోషించింది. 2002లో ఈ చట్టానికి మరిన్ని రక్షణలు కల్పించారు. అడవి ఏనుగులను పట్టుకోవడం, వాటి వ్యాపారం చేయడంపై కఠిన ఆంక్షలు తీసుకొచ్చారు. కానీ 2022లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టానికి సవరణలు తీసుకొచ్చింది. దీంతో బందిఖానాలో ఉన్న ఏనుగులను మతపరమైన అవసరాలు సహా ఇతర ప్రయోజనాల కోసం బదిలీ చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ మార్పు తర్వాత ఏనుగుల బదిలీలకు మళ్లీ డిమాండ్ పెరిగిందనే వాదన వినిపిస్తోంది. అంటే చట్టంలో ఉన్న ఒక వెసులుబాటును ఉపయోగించుకుని.. అడవుల్లో పట్టుకున్న ఏనుగులను కూడా బందిఖానాలో పుట్టినవిగా చూపించి బదిలీ చేసే ప్రమాదం ఉందన్నది వారి భయం. ఇప్పుడు దుర్గతో పాటు ఈ ఐదు ఏనుగుల విషయంలో కూడా ఇదే అనుమానం వ్యక్తమవుతోంది.
Also Read: ట్రంప్‌కు డెమోక్రాట్ల దెబ్బ.. రాబోయే రెండేళ్లలో జరిగేది ఇదే!
అందుకే ఈ ఐదు ఏనుగులు నిజంగానే బందిఖానాలో పుట్టాయా? వాటి తల్లుల వివరాలు, DNA రికార్డులు ఎక్కడ ఉన్నాయి? యాజమాన్య ధ్రువీకరణ పత్రాల్లోని వివరాలను అస్సాం అటవీ శాఖ పూర్తిగా పరిశీలించిందా? అంత వేగంగా అనుమతులు ఎందుకు ఇచ్చారు? ఆరు కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణల్లో నిజమెంత? వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అస్సాం, తమిళనాడు ప్రభుత్వాలపై ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఐదు ఏనుగులను ఒక ఆలయం నుంచి మరో ఆలయానికి తరలించిన వ్యవహారం కాదు. భారతదేశంలో ఏనుగుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రూపొందించిన వ్యవస్థ నిజంగా పనిచేస్తోందా? లేక చట్టాల్లోని వెసులుబాటులను ఉపయోగించుకుని మళ్లీ ఏనుగుల వ్యాపారం మొదలైందా? అనే పెద్ద ప్రశ్నను ఈ వ్యవహారం మన ముందు ఉంచుతోంది. ఏనుగులకు పూజలు చేయడం ఒక సంప్రదాయం కావచ్చు. కానీ ఆ సంప్రదాయం పేరుతో వాటి స్వేచ్ఛను, భద్రతను, వాటి జీవితాలను బలిచేయకూడదు. అందుకే ఈ ఐదు ఏనుగుల అసలు కథ బయటకు రావాల్సిన అవసరం ఉంది.