Kasturi Rangan : భారత అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్, పద్మ విభూషణ్.. కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు. 84 ఏళ్ల వయసులో.. బెంగళూరులోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. 1994 నుంచి 2003 వరకు.. 9 ఏళ్ల పాటు ఆయన ఇస్రో ఛైర్మన్‌గా సేవలు అందించారు. భారత అంతరిక్ష రంగానికి చేసిన కృషికి గాను.. 1982లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 2000లో పద్మ విభూషణ్ పురస్కారాలు వరించాయి.
ఇస్రోపై చెరగని ముద్ర వేశారు కస్తూరిరంగన్. చంద్రయాన్‌కు ప్రణాళికలు వేసింది ఆయనే. ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ (PSLV)లను విజయవంతంగా ప్రయోగించారు. జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) ను సైతం ఆయన హయాంలోనే పరీక్షించారు. INSAT ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లిందీ అప్పుడే. భాస్కర-1, భాస్కర-2 ప్రాజెక్టులను కస్తూరి రంగన్ పర్యవేక్షించారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యునిగా పని చేశారు కస్తూరి రంగన్. ప్రణాళికా సంఘం సభ్యుడిగా కూడా పని చేశారు. JNU ఛాన్సలర్‌గా, బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా కొనసాగారు.
1940, అక్టోబర్ 24న కేరళలోని ఎర్నాకుళంలో జన్మించారు కస్తూరి రంగన్. ముంబై యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ చేశారు. హైఎనర్జీ ఆస్ట్రానమీలో పీహెడీ చేసి డాక్టరేట్ సాధించారు. అంతరిక్ష శాస్త్రంలో 244 పైగా పరిశోధక పత్రాలు ఆయన పేరు మీద ఉన్నాయి.