Gautam Adani | అదానీ గ్రూప్ కంపెనీలు అమెరికాలో ప్రాజెక్టుల కోసం లక్షల కోట్ల రుణాలు పొందడానికి వేల కోట్ల లంచం ఇవ్వచూశారని అమెరికా న్యాయ శాఖ ఇటీవల ఆరోపణలు చేయడంపై అదానీ గ్రూప్ చైర్మెన్ గౌతమ్ అదానీ తొలిసారి స్పందించారు. శనివారం ఆయన రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ ఆరోపణలు, దాడులు తనకు ఇంకా బలం చేకూరుస్తాయని చెప్పారు.
జైపూర్ లో జరిగిన 51వ జెమ్ అండ్ జెవెలరీ అవార్డ్స్ కార్యక్రమంలో అదానీ మాట్లాడుతూ.. “మీలో చాలామంది రెండు వారాలుగా న్యూస్ లో వినే ఉంటారు. మాపై అమెరికా అధికారులు చాలా ఆరోపణలు చేశారు. అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించిందని వారు ఆరోపణలు చేశారు. ఇలాంటి సవాళ్లు ఎదుర్కోవడం మాకు కొత్తేమీ కాదు. అయితే నేను ఒక్కటే చెప్పాలను కుంటున్నా.. వారు చేసే ప్రతి దాడి మమల్నీ ఇంకా బలవంతుల్నీ చేస్తుంది. మాకు అడ్డుగా వచ్చే ప్రతి అవరోధాన్ని మేము పైకి ఎక్కడానికి ఒక మెట్టుగా ఉపయోగించుకుంటాం.
Also Read: అదానీ అవినీతిలో ప్రధాని మోడీ భాగస్వామ్యం.. రాహుల్ ఆరోపణలు.. మండిపడిన బిజేపీ
మీడియాలో మాకు వ్యతిరేకంగా చాలా చూపించారు. కానీ అమెరికా ఎఫ్‌సిపిఎ చట్టాలను ఉల్లంఘించినట్లు కానీ విచారణ అడ్డుకునే కుట్ర చేసినట్లు కానీ అదానీ కుటుంబంలో ఏ ఒక్కరిపై నేరారోపణలు లేవు. ఈ రోజుల్లో మంచి కంటే చెడు చాలా వేగంగా వ్యాపిస్తుంది. మేము చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నాం. అంతర్జాతీయ చట్టాలను, విదేశాలలో అక్కడి చట్టాలను మేము పూర్తిగా అనుసరిస్తున్నాం.” అని ఆయన అన్నారు.
గౌతం అదానీకి వ్యతిరేకంగా ఉన్న ఆరోపణలు ఇవే
అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అమెరికాలో సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ కాంట్రాక్టుల కోసం అక్కడి బ్యాంకుల నుంచి లక్షల కోట్ల రుణాలు పొందాలను చూశాయి. ఈ రుణాలు పొందడానికి తమకు అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు భారత అధికారులకు రూ.2029 కోట్లు (265 మిలియన్ డాలర్లు) లంచాలు ఇచ్చారని అదానీ గ్రీన్ ఎనర్జీ సిఈఓ వినీత్ జైన్, కంపెనీ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీ (గౌతం అదానీ సోదరుడి కుమారుడు)తోపాటు, అదానీకి చెందిన మరో కంపెనీ అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ సిఈఓ రంజిత్ గుప్తా, మరో ఇద్దరు ఉన్నతాధికారులు సిరిల్ కాబేన్స్ (ఫ్రాన్స్, ఆస్ట్రేలియా పౌరుడు), రూపేష్ అగర్వాల్, కెనెడా పెట్టుబడిదారులు అయిన దీపక్ మల్హోత్ర, సౌరబ్ అగర్వాల్ పై అమెరికా న్యాయ శాఖ (జస్టిస్ డిపార్ట్‌మెంట్) ఆరోపణలు చేస్తూ కోర్టులో కేసు నమోదు చేసింది. వీరికి వ్యతిరేకంగా సంభాషణల రికార్డ్ ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
అమెరికాలోని పెట్టుబడిదారులను తప్పుడు సమాచారం ఇచ్చి వారిచేత పెట్టుబడులు పెట్టించేందుకు మోసం చేశారని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ తెలిపింది. కానీ అదానీ గ్రూప్ ప్రతినిధులు ఈ ఆరోపణలు నిరాధారామైనవిగా కొట్టిపారేశారు.
అమెరికాలో అదానీలపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో భారతదేశంలో రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు అదానీకి చెందిన కంపెనీలపై నిష్పాక్షికంగా విచారణలు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయిదే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ అవినీతి ఆరోపణల వ్యవహారమంతా అమెరికా, అదానీ కంపెనీల మధ్య ఉందని ఇందులో తమ ప్రమేయం అవసరం లేదని వ్యాఖ్యానించింది.
“ఇది ఒక చట్టపరమైన అంశం. ఇది ప్రైవేట్ కంపెనీలు, అమెరికా న్యాయ శాఖ మధ్య జరుగుతోంది. కొన్ని ప్రక్రియలు, చట్టపరమైన విధానాలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై భారతదేశ ప్రభుత్వంతో అమెరికా ప్రభుత్వం చర్చించలేదు.” అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.