Road accident : భారత్ లో రోడ్డు ప్రమాదాల సంఖ్య చాలా ఎక్కువే. ప్రమాదాలు జరిగిన సమయంలో కొంత మంది.. స్పాట్ లోనే చనిపోతుంటే, మరికొందురు తీవ్ర గాయాల పాలవుతుంటారు. అలాంటి వారిని సరైన సమయంలో ఆసుపత్రుల్లో చేర్చితే.. ప్రాణాల్ని కాపాడే అవకాశాలుంటాయి. కానీ.. మన దేశంలో తీవ్రంగా గాయపడిన వారిని ఆదుకునేందుకు చాలా మంది ముందుకు రారు. మనకెందుకులే అని కొందరు, సాయం చేస్తే సరిపోదు.. తర్వాత ఏమైనా అయితే ఏంటి పరిస్థితి అని భయపడే వాళ్లు ఇంకొందరు. దాంతో.. ఏటా వేల మంది ప్రాణాలు నిలుపుకునే అవకాశాలున్నా.. చనిపోతున్నారు. ఈ పరిస్థితుల్ని మార్చేందుకు కేంద్ర రవాణా శాఖ ఓ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
ఏదైనా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గంట వరకు ఉన్న సమయాన్ని గోల్డెన్ అవర్ అంటుంటారు. ఆ సమయంలో క్షతగాత్రులని ఆసుపత్రులకు తీసుకువెళితే.. వారి ప్రాణాలు కాపాడవచ్చు. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకి, ట్రామా కేర్ సెంటర్ లకు తీసుకెళ్తే పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయం కారణంగా చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు.
లేదా.. దారిలో గాయపడిన వారు ప్రాణాలు కోల్పోతే ఆ కేసు తమ మీదకి వస్తుందేమోనన్న భయం వెంటాడుతుంది. అలాంటి వారికి భరోసా కల్పిస్తూ, అపాయంలో ఉన్న వారిని కాపాడిన వారికి రక్షణ కల్పించేలా… కేంద్ర ప్రభుత్వం ‘గుడ్ సమరిటన్’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితుల్ని కాపాడి ఆసుపత్రులకు తరలిస్తే రూ.5 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నారు. ఏటా.. దేశ వ్యాప్తంగా ఎక్కువ మందిని కాపాడిన 10 మందికి రూ.లక్ష
ప్రోత్సహాన్ని అందించనున్నారు.
రోడ్డు ప్రమాద బాధితుల్ని కాపాడే విషయంలో ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించడంతో పాటు వారిలో అవగాహన కోసం కేంద్రం 2021 లోనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. కానీ.. పెద్దగా ప్రచారంలో లేకపోవడంతో ఎవరికీ తెలియదు. అందుకే.. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పథకానికి ఖర్చయ్యే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ పథకం అమలును ఆయా జిల్లాల్లోని పోలీసులు, కలెక్టర్ కార్యాలయాలు, రవాణాశాఖ సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
ఈ పథకానికి ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో గాయపడిన వారిని గంటలోపు ఆసుపత్రికి తరలించిన తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆసుపత్రి వర్గాలు సైతం పోలీసులకు సమాచారాన్ని అందిస్తాయి. అలా చేస్తే సాయం చేసిన వారికి అధికారిక లెటర్ హెడ్ మీద ప్రాణదాత అనే పేరుతో ప్రమాదానికి సంబంధించిన సమాచారంతో ఓ లెటర్ ఇస్తారు.
ఆ వివరాల్ని, సమాచారాన్ని పరిశీలించి జిల్లా స్థాయి అధికారులకు పోలీసులు పంపిస్తారు. అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి రవాణా కమిషనర్ కి సిఫార్సు లేఖ వెళుతుంది. అక్కడి నుంచి బహుమతి కాపాడిన వ్యక్తి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. దాంతో పాటే ఓ ప్రశంసా పత్రాన్ని అందిస్తారు. ఇలా.. దేశంలో ఎక్కువ మందిని కాపాడిన వారిని గుర్తించి వారికి ఏడాదికి ఓసారి అదనపు పోత్సాహకంగా రూ.1 లక్ష అందజేస్తారు. ఓ వ్యక్తి గరిష్టంగా ఐదు సార్లు ప్రశంసా పత్రాలు, రూ.5 వేల నగదు అందుకునేందుకు వీలుంటుంది.
Also Read : అండర్ వాటర్ డ్రోన్లు, ఏఐ కెమెరాలు.. కుంభమేళలో భద్రతా ఏర్పాట్లు తెలిస్తే షాక్ అవుతారు.
ఈ చట్టం ద్వారా ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేసే వారికి రక్షణకు మరికొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీని ప్రకారం.. వేధింపులు, నిర్బంధం, పోలీసు కేసుల నుంచి గుడ్ సమరిటన్ చట్టం రక్షిణ ఇస్తుంది. దీని ప్రకారం వారు ఎటువంటి పౌర లేదా క్రిమినల్ చర్యలకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు. క్షతగాత్రులను చేర్చిన వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్లిపోవచ్చు, వ్యక్తిగత వివరాలను అందించాల్సిన అవసరం లేదు, బాధితుడి చికిత్స కోసం డబ్బులు ఖర్చు చేయక్కర్లేదు.