GST Council: ఆరోగ్య బీమా పాలసీ, లైఫ్ ఇన్యూరెన్సు ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వాయిదా వెనుక ఏం జరిగింది? సోమవారం నాటిని సమావేశంలో క్లారిటీ వస్తుందని భావించినప్పటికీ చివరి నిమిషంలో ఎందుకు వాయిదా పడింది? నవంబర్ వరకు వెళ్లడానికి కారణాలేంటి? కేంద్ర పెద్దలు సూచనలు మేరకే వెనక్కి వెళ్లిందా? ప్రభుత్వం తన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టడంతో ఇన్యూరెన్స్ కంపెనీలు ఎందుకు సైలెంట్ అయ్యాయి? ఇలా రకరకాల ప్రశ్నలు అప్పుడే మొదలయ్యాయి.
సోమవారం ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్నిరాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, ఆ శాఖ ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడుతాయని భావించినప్పటికీ చివరి నిమిషంలో వెనక్కి వెళ్లాయి.
ALSO READ: ఇండియాలోకి మంకీపాక్స్ ఎంట్రీ.. తొలి కేసు ఎక్కడంటే..?
ముఖ్యంగా ఆరోగ్య, లైఫ్ ఇన్యూరెన్లపై జీఎస్టీ ఎత్తివేసే నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశామని తెలిపారు కేంద్ర ఆర్థికమంత్రి. దీనిపై మంత్రుల బృందంతో కమిటీ వేశామని, అక్టోబర్ చివరి నాటికి నివేదిక ను సమర్పిస్తారని తెలిపారు.
నవంబర్‌లో జరగనున్న సమావేశంలో దీనిపై క్లారిటీ వస్తుందన్నారు. కాకపోతే క్యాన్సర్ రోగులకు తీపి కబురు చెప్పింది. చికిత్సలో ఉపయోగించే మందులపై జీఎస్టీ తగ్గిస్తున్నట్లు తెలిపారు. వీటిపై ప్రస్తు తం 12శాతం ఉన్న జీఎస్టీని ఐదుశాతానికి తగ్గించామన్నారు. దీంతోపాటు స్నాక్స్‌పై జీఎస్టీ రేట్లు 18 నుంచి 12 శాతానికి తగ్గించింది జీఎస్టీ సమావేశం.
మతపరమైన తీర్థయాత్రల కోసం హెలికాప్టర్ సేవల నిర్వహణపై పన్నును ఐదు శాతానికి తగ్గించింది కౌన్సిల్. కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి తీర్థ యాత్రలకు భక్తులను తీసుకువెళ్లే హెలిక్యాప్టర్ సేవలపై పన్ను ఇప్పటి వరకు 18 శాతం వరకు విధించేది.
ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో వాటిపై కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. క్యాసినోపై ఆదాయం 30 శాతం వరకు పెరిగింది. ఆరు నెలల్లో 412 శాతం పెరిగి 6,909 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్థికమంత్రి.
ఆగస్టులో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీపై విపక్షాలు గళమెత్తాయి. లైఫ్, ఆరోగ్య పాలసీలపై 18 శాతం జీఎస్టీని విధించడాన్ని తప్పుబట్టాయి. ఇది కేవలం పన్ను ఉగ్రవాదమంటూ నిరసనలు చేపట్టింది ఇండియా కూటమి.
మోదీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు నానాఅవస్థలు పడ్డారని ఆరోపించారు. ఆరోగ్యం, లైఫ్ ఇన్యూరెన్లపై జీఎస్టీ విధించడాన్ని ప్రభుత్వం ఆలోచించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి గమనించిన మోదీ సర్కార్, సోమవారం జరిగిన జీఎస్టీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటుందని భావించారు. ఈ నిర్ణయాన్ని మంత్రుల బృందానికి అప్పగించారు.