Parents Kills Son: గుజరాత్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకును చంపడంతోపాటు అతడిది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. జూన్ 30న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తల్లిదండ్రులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
రాజ్ కోట్ జిల్లా గుండాల గ్రామంలో 23 ఏళ్ల రామ్ అనుమానస్పదంగా మృతి చెందాడు. తొలుత రామ్ ఆత్మహత్య చేసుకున్నట్లు అంతా భావించారు. తల్లిదండ్రులు కూడా ఇదే విషయాన్ని నమ్మించారు. తీరా పోస్ట్ మార్టంలో అతడు హత్యకు గురైనట్లు నిర్ధారణ అయ్యింది. సొంత తల్లిదండ్రులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలడంతో రామ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు రామ్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో పెళ్లైన 4 నెలలకు భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మరోవైపు డబ్బుకోసం రామ్.. తండ్రి బాబుబాయ్, తల్లి మనీషా బెన్ ను నిత్యం వేధించేవాడు. ప్రతీ రోజూ వాగ్వాదానికి దిగేవాడు. ఈ క్రమంలో జూన్ 30న కూడా వారి మధ్య గొడవ చేటుచేసుకుంది. దీంతో సహనం కోల్పోయిన తల్లి.. మద్యంమత్తులో ఉన్న రామ్ చేత బలవంతంగా యాసిడ్ తాగించింది. అటు తండ్రి అతడిపై దాడి చేశాడు. చివరికి గొంతు నులిమి కొడుకు ప్రాణాలు తీసినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.
Also Read: మరో ఘోరం.. పాయసంతో భర్తను లేపేసిన భార్య.. బాత్రూమ్ కింద కప్పెట్టి హైడ్రామా!
అయితే ఈ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు బాబుబాయ్.. స్థానికంగా ఉన్న తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించాడు. గోండల్ సివిల్ ఆస్పత్రిలో త్వరితగతిన ప్యానెల్ పోస్ట్ మార్టం నిర్వహించాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. రిపోర్ట్ ను తారుమారు చేసేందుకు కూడా పలువురు లోకల్ లీడర్లను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. అయితే శవపరీక్ష నివేదికలో హత్య అని తేలడం, భార్య ఫిర్యాదు చేయడంతో తల్లిదండ్రులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: నిన్న అయోధ్య.. నేడు బద్రీనాథ్.. స్వామి వారి కానుకలు మాయం?