Indians Kidnap: అక్రమ మార్గంలో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన ముగ్గురు గుజరాత్ యువకులు అంతర్జాతీయ ముఠా చేతిలో చిక్కుకున్నారు. అమెరికా పంపిస్తామని నమ్మించిన ఏజెంట్లు, వారిని ఇథియోపియా తీసుకెళ్లి బందీలుగా మార్చారు. రూ.కోటి ఇవ్వాలని బాధితుల కుటుంబాలను కిడ్నాపర్లు డిమాండ్ చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అనూహ్యంగా కిడ్నాపర్లతో బేరసారాలు నిర్వహించారు. చివరికి రూపాయి చెల్లించకుండా బాధితులను భారత్ రప్పించడంతో కథ సుఖాంతమైంది.
గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన రుత్విక్ జాన్సారీ (23), మమతా చావ్డా (30), మయూరి సోలంకి (27) అనే ముగ్గురు వరసకు బావబామ్మర్థులు అవుతారు. మమత భర్త ఇప్పటికే విద్యార్థి వీసాపై అమెరికాలో ఉంటుండగా.. ఆమె ఆరుసార్లు వీసా కోసం ప్రయత్నించింది. అయితే అప్లై చేసిన ప్రతీసారి ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీంతో ఎలాగైనా ఆమెను అమెరికా పంపాలని భావించిన కుటుంబ సభ్యులు.. ఆ ముగ్గురినీ అక్రమ మార్గంలో (డంకీ రూట్) పంపేందుకు ఏజెంట్లను ఆశ్రయించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 20న వారు అమెరికా పయనమయ్యారు.
మమత చివరిగా సెప్టెంబర్ 22న తన తండ్రి కిరీట్ చౌహాన్‌తో ఫోన్‌లో మాట్లాడింది. ఆ తర్వాత ముగ్గురి ఫోన్లు స్విచ్ఛాప్ కావడంతో కుటుంబంలో ఆందోళన మొదలైంది. బాధితుడి తండ్రి వెంటనే స్థానిక లాంగ్నాజ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో బాబాఖాన్ అనే పేరుతో ఒక అంతర్జాతీయ నంబర్ నుంచి వారికి వాట్సాప్ కాల్ వచ్చింది. ముగ్గురు యువకులు తమ కస్టడీలోనే ఉన్నారని, ప్రాణాలతో కావాలంటే రూ. 1 కోటి పరిహారం చెల్లించాలని బెదిరించాడు.
దీంతో రంగంలోకి దిగిన లాంగ్నాజ్ పోలీసులు, మెహసానా లోకల్ క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది.. సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తు ప్రారంభించారు. ఏజెంట్ అల్ పేష్ పంచాల్ ద్వారా కిడ్నాపర్లతో వ్యూహాత్మకంగా చర్చలు జరిపారు. తమది చాలా పేద కుటుంబమని, అంత డబ్బు ఇచ్చుకోలేమని నమ్మబలికారు. పోలీసుల బేరసారాలతో కిడ్నాపర్ రూ.కోటి నుంచి రూ. 15 లక్షలకు తగ్గించాడు. అయినప్పటికీ రూపాయి కూడా ఇచ్చేది లేదని ఖరాకండీగా చెప్పడంతో ఎట్టకేలకు కిడ్నాపర్ దిగివచ్చాడు. వారిని సురక్షితంగా వదిలేయడమే కాకుండా సెప్టెంబర్ 30కి భారత్‌కు తిరిగి రాడానికి విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసి ఇచ్చాడు. అక్టోబర్ 1న ఆ ముగ్గురూ క్షేమంగా భారత్ చేరుకున్నారు.
Also Read: ఎల్‌నినో దెబ్బకు ప్రభుత్వం కీలక నిర్ణయం.. వరి స్థానంలో ఇవి వేస్తే కాసుల వర్షమే!
అయితే ఈ అక్రమ రవాణా వెనుక పెద్ద ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రూ. 75 లక్షలు వసూలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో స్థానిక ఏజెంట్ అల్ పేష్ పంచాల్ పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వడోదరకు చెందిన భార్గవ్ పటేల్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మెటా నుంచి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వివరాలు సేకరించి నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు.
Also Read: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 మలుపులు.. ఈ రోడ్డు మీద డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదు!