Alternative Crops: స్వేచ్ఛ బ్యూరో: ఎల్‌నినో తో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వరికి ప్రత్యామ్నాయంగా, తక్కువ నీటితో సాగయ్యే స్వల్పకాలిక పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలతో పాటు అధిక ఆదాయాన్నిచ్చే కూరగాయల పంటల సాగు జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్,వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు. రబీ (యాసంగి) 2026-27 కార్యాచరణ ప్రణాళికపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించి, పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అధికారులకు ఆదేశాలు జారీ..
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా యాసంగి సీజన్‌కు సంబంధించిన సమీక్షా సమావేశాలు నిర్వహించాలని అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన అంశాలను క్రోడీకరించి, రబీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. క్షేత్రస్థాయి అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు తక్కువ నీటితో పండే పంటల ఎంపిక, అనువైన విత్తన రకాలు, పంట యాజమాన్య పద్ధతులపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సందేహాలను నివృత్తి చేయాలని కోరారు.
ఎరువుల కంపెనీల ప్రతినిధులతో సమావేశం
వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో ఎరువుల కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. యాసంగి సీజన్‌కు సరిపడా ఎరువుల సరఫరా, ప్రస్తుత నిల్వల స్థితిగతులపై సమీక్షించి, రాబోయే సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈకాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ సంచాలకుడు డా.బి.గోపి, ఉద్యానవన శాఖ సంచాలకులు డా.యాస్మీన్ బాషా,తదితరులు పాల్గొన్నారు.
Also Read: కోళ్ల ఫారాల్లో డ్రగ్స్ తయారీ.. ఈగల్ ఫోర్స్ సంచలన నిజాలు!