Haryana Encounter: హర్యానాలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ కలకలం రేపింది. అండర్ వరల్డ్ డాన్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు హర్యానా పోలీస్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సంయుక్తంగా కోలుకోలేని షాక్ ఇచ్చాయి. మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లుగా చెలామణి అవుతూ, ఇరు రాష్ట్రాల పోలీసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఇద్దరు కీలక షూటర్లను బహదూర్‌గఢ్‌లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు మట్టుబెట్టాయి. హతమైన ఈ ఇద్దరు నిందితులపై హర్యానా ప్రభుత్వం గతంలోనే తలా లక్ష రూపాయల చొప్పున భారీ రివార్డు ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో ప్రాణాలకు తెగించి పోరాడిన ఒక ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ఆ ఇద్దరూ ఎవరంటే?
పోలీసుల కాల్పుల్లో మరణించిన వారిని హిసార్‌కు చెందిన ప్రవేశ్, జఖోద్ ఖేరా గ్రామానికి చెందిన హిమాన్షుగా అధికారులు గుర్తించారు. వీరిద్దరూ లారెన్స్ బిష్ణోయ్, హరిరామ్, అనిల్ పండిట్ నేతృత్వంలోని ప్రమాదకరమైన అంతరాష్ట్ర క్రైమ్ నెట్‌వర్క్‌లో యాక్టివ్ మెంబర్స్‌గా కొనసాగుతున్నారు. ముఖ్యంగా జూన్ 11న హన్సీ ప్రాంతంలో కపిల్ అనే జిమ్ ఆపరేటర్‌ను పట్టపగలే నడిరోడ్డుపై అత్యంత క్రూరంగా కాల్చి చంపిన కేసులో వీరిద్దరే ప్రధాన నిందితులు. ఆ రోజు వీరు జరిపిన కాల్పుల తాలూకు సీసీటీవీ విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి, స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. అప్పటినుంచి ఈ కిల్లర్స్ కోసం పోలీసులు వేట సాగిస్తూనే ఉన్నారు.
పక్కా స్కెచ్.. చుట్టుముట్టిన బలగాలు!
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగానికి, హర్యానా ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ (ఎస్‌టీఎఫ్) కు ఒక అత్యంత విశ్వసనీయ సమాచారం అందింది. సదరు నిందితులు ఆయుధాలతో సంచరిస్తూ, బహదూర్‌గఢ్ పరిసరాల్లో మరో భారీ ప్లాన్‌కు స్కెచ్ వేస్తున్నారని తెలియడంతో జాయింట్ ఆపరేషన్ రంగంలోకి దిగింది. నిందితులను అన్ని వైపుల నుంచి వ్యూహాత్మకంగా చుట్టుముట్టిన పోలీసులు.. ఆయుధాలు కిందపడేసి లొంగిపోవాలని హెచ్చరించారు. అయితే పోలీసుల కళ్లల్లో ధూళి చల్లి తప్పించుకోవాలనే ప్లాన్‌తో, నిందితులు ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ స్పెషల్ సెల్‌కు చెందిన కానిస్టేబుల్ అంకిత్ కాలికి బుల్లెట్ తగిలి గాయపడ్డారు.
ఆత్మరక్షణ కోసమే ఎదురుకాల్పులు: ఎస్పీ
నిందితులు తెగబడి కాల్పులు జరపడంతో, శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని హర్యానా ఎస్టీఎఫ్ ఎస్పీ విక్రాంత్ భూషణ్ తెలిపారు. ఈ ముఖాముఖి పోరులో తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, నిందితులిద్దరూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గాయపడిన కానిస్టేబుల్ అంకిత్‌కు ప్రస్తుతం చికిత్స అందుతోందని, ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌పై బహదూర్‌గఢ్ సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఆపరేషన్ బిష్ణోయ్ గ్యాంగ్ మూలాలను దెబ్బతీసే దిశగా పోలీసులకు లభించిన పెద్ద విజయంగా భావిస్తున్నారు.
Also Read: కోట్ల విలువైన మత్తు… ఒక్క క్షణంలో బూడిద! సైబరాబాద్ పోలీసుల బిగ్ ఆపరేషన్