Big Stories

Nagaland: నాగాలాండ్‌లో అరుదైన గెలుపు.. అసెంబ్లీలో తొలిసారి మహిళా ఎమ్మెల్యే అడుగు..

Nagaland: మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంట్‌లో దశాబ్దాల తరబడి పోరాటం జరుగుతోంది. ఆకాశంలో సగం అని కీర్తిస్తామే కానీ.. అన్నిట్లో వారికి సమాన అవకాశాలు మాత్రం కల్పించడం లేదు. రాజకీయాల్లో అయితే మరీ దారుణం. చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం అంతంతమాత్రం. మంత్రిమండలిలో మహిళలు లేని రాష్ట్రాలు అనేకం. ఇక మహిళా ముఖ్యమంత్రులు అత్యంత అరుదు. మంత్రి, ముఖ్యమంత్రి వరకూ ఎందుకు.. కనీసం అసెంబ్లీలో ఒక్కరంటే ఒక్క మహిళా ప్రాతినిధ్యం లేని రాష్ట్రం కూడా ఉందంటే నమ్మాల్సిందే. ఒకటి రెండు కాదు.. ఏకంగా 60 ఏళ్లుగా ఆ అసెంబ్లీలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా అడుగు పెట్టలేదనేది వాస్తవం.

- Advertisement -

సరిగ్గా 60 ఏళ్ల క్రితం 1963లో నాగాలాండ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా వచ్చింది. అప్పటి నుంచి 13 సార్లు శాసనసభకు ఎన్నికలు జరిగాయి. కానీ, ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు.

- Advertisement -

నాగాలాండ్‌లో 13.17 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో సుమారు సగం మంది.. అంటే 6.56 లక్షల మంది మహిళా ఓటర్లే. గడిచిన ఆరు దశాబ్దాలుగా అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 20మంది మహిళలు మాత్రమే పోటీ చేశారు. వారిలో ఎవరూ గెలవలేక పోయారు.

ఈసారి ఎన్నికల్లో NDPP ఇద్దరు మహిళలను బరిలోకి దింపింది. కాంగ్రెస్, బీజేపీ ఒక్కో మహిళకు టికెట్‌ ఇచ్చింది. నేషనల్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ-NDPP తరఫున పోటీ చేసిన ‘హెకానీ జఖాలు’, ‘సల్హౌతునొ క్రుసె’లు ఎమ్మెల్యేలుగా గెలిచి చరిత్ర సృష్టించారు. నాగాలాండ్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్న మొదటి మహిళా ఎమ్మెల్యేలుగా రికార్డులకెక్కారు. 60 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఓ మహిళ.. ఎమ్మెల్యేగా గెలవడం ఇదే తొలిసారి. దిమాపుర్‌ స్థానం నుంచి 1,536 ఓట్ల ఆధిక్యంతో ‘హెకానీ జఖాలు’ విజయం సాధించారు. పశ్చిమ అంగామీ నుంచి క్రుసె జయకేతనం ఎగురవేశారు.

హెకానీ జఖాలు.. యూఎస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్సిటీలో ‘లా’ చదివారు. కొంతకాలం అమెరికాలోనే పనిచేశారు. తర్వాత ఢిల్లీకి వచ్చి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం సొంతరాష్ట్రమైన నాగాలాండ్‌కు షిఫ్ట్ అయ్యారు. యూత్‌నెట్‌ అనే ఎన్‌జీఓను స్థాపించారు. యువత, మహిళా సాధికారత కోసం ఆమె చేసిన కృషికి 2018లో నారీ శక్తి అవార్డు వరించింది.

‘సల్హౌతునొ క్రుసె’ ఒక హోటల్‌ యజమాని. NDPP తరఫున పోటీ చేశారు. అయితే, కేవలం 7 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచి సంచలనంగా నిలిచారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News