Telangana Journalists: హైదరాబాద్‌లో సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య ప్రకటనలు చేశారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం పూర్తి స్థాయిలో.. కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా అక్రిడిటేషన్ విధానాలు, జర్నలిస్టుల ఆరోగ్య భీమా, జర్నలిస్టులపై దాడులను అరికట్టే చర్యలు, అవార్డుల పునరుద్ధరణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
అక్రిడిటేషన్ పాలసీపై దృష్టి
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందేలా.. కొత్త విధానాలను రూపొందించామని మంత్రి అధికారులకు ఆదేశించారు. జర్నలిస్టుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు.. ప్రత్యేక వెబ్‌సైట్‌ను వెంటనే ప్రారంభించాలని కూడా సూచించారు. అక్రిడిటేషన్ విధానంలో పారదర్శకత ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
జర్నలిస్టులపై దాడుల నివారణ
జర్నలిస్టులపై దాడులు జరగకుండా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకోసం హైపవర్ కమిటీని పునరుద్ధరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కమిటీ మొదటిసారి ఉమ్మడి రాష్ట్రంలో 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. ప్రకారం ఏర్పడింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత.. అది కొనసాగలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఆ కమిటీని తిరిగి ఏర్పాటు చేసి, జర్నలిస్టుల రక్షణకు ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు.
జీతభత్యాలపై చర్యలు
జర్నలిస్టుల జీతభత్యాల సమస్యల పరిష్కారానికి.. త్రైపాక్షిక కమిటీని పునరుద్ధరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మీడియా యాజమాన్యం, జర్నలిస్టులు, ప్రభుత్వం అనే మూడు వర్గాల మధ్య చర్చలు జరగడానికి ఇది సహకరిస్తుందని, జర్నలిస్టుల హక్కులను రక్షించడానికి ఈ కమిటీ సహాయపడుతుందని అన్నారు.
ఆరోగ్య భీమా పాలసీపై చర్చ
జర్నలిస్టుల ఆరోగ్యం రక్షణకై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఈ సందర్భంగా మంత్రి ఆరోగ్యశ్రీ విభాగంతో చర్చలు జరిపి, జర్నలిస్టులకు ప్రయోజనకరంగా ఉండే ఇన్సూరెన్స్ పాలసీని రూపొందించాలని సూచించారు. ఏ పాలసీ ద్వారా ఎక్కువ మంది జర్నలిస్టులకు లాభం చేకూరుతుందో అనే అంశంపై.. లోతైన అధ్యయనం చేయాలని అధికారులు ఆదేశించారు. జర్నలిస్టుల ఆరోగ్య భీమా పథకం ద్వారా కుటుంబ సభ్యులు కూడా.. ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
జర్నలిస్టు అవార్డుల పునరుద్ధరణ
ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి మేరకు.. జర్నలిస్టుల అవార్డులను పునరుద్ధరించేందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల కృషిని గుర్తించి, వారిని ప్రోత్సహించే విధంగా అవార్డులను ఇవ్వడం అవసరమని ఆయన భావించారు. అవార్డుల ద్వారా జర్నలిస్టులు మరింత ఉత్సాహంగా పని చేసే అవకాశం ఉందని తెలిపారు.
సమీక్షలో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఐ & పీఆర్ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, సీపీఆర్‌వో జి. మల్సూర్, ఆరోగ్యశ్రీ సి.ఇ.ఓ. ఉదయ్ కుమార్, కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి
ఈ సమీక్ష సమావేశం ద్వారా జర్నలిస్టుల సమస్యలపై.. ప్రభుత్వం దృష్టిసారిస్తోందని స్పష్టమైంది. అక్రిడిటేషన్ విధానం నుంచి ఆరోగ్య భీమా వరకు అనేక అంశాలపై.. స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం ద్వారా జర్నలిస్టుల జీవన ప్రమాణాలను.. మెరుగుపరచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జర్నలిస్టులు రక్షణతో, గౌరవంతో, భద్రతతో పని చేయడానికి ఈ చర్యలు దోహదం చేస్తాయి.