Govt Funds Private Party| ఒక ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగి తన స్నేహితులకు, వారి కుటుంబాలకు పార్టీకి ఆహ్వానించాడు. అంతేకాదు వారి సిబ్బందికి డ్రైవర్లకు కూడా దావత్ ఇచ్చాడు. అందరికీ మంచి భోజనాలు పెట్టి.. పార్టీలో అందరూ ఎంజాయ్ చేశాక.. వచ్చిన బిల్లుని ప్రభుత్వ నిధుల ద్వారా చెల్లించాడు. ఇప్పుడు ఈ విషయం గురిచి అనుకోకుండా మీడియా బయటపెట్టడంతో ఆ ప్రభుత్వ ఉద్యోగి తీరు వివాదాస్పదంగా మారింది.
ఒక రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) పదవిలో ఉండి తన స్నేహితులకు ఆయన మంచి పార్టీ ఇచ్చాడు. వారి కుటుంబాలతో సహా రావాలని పిలిచాడు. వారి రాకపోకల ట్యాక్సీ బిల్లు సైతం తాను చెల్లిస్తానని చెప్పాడు. పైగా వారి డ్రైవర్లకు ఇతర సిబ్బంది కూడా భోజనాల ఏర్పాట్లు చేశాడు. కానీ చివరికి ఇదంతా ప్రభుత్వ ధనంలో చెల్లించాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది.
హిమాచల్ ప్రదేశ్ చీఫ్ సెక్రటీరీ ప్రబోధ్ సక్సేనా ఐఎఎస్.. పదవీ కాలం మార్చి 31 2025న ముగిసింది. కానీ ఆయన పదవి కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పొడగించింది. ఇటీవల హోలీ సందర్బంగా ఆయన రాష్ట్ర రాజధాని షిమ్లాలో హిమాచల్ టూరిజం పేరున కొత్త హోటల్ ప్రారంభించారు. హోలీ సందర్భం కావడతో తన కుటుంబం, బంధువులు, స్నేహితులను కుటుంబ సమేతంగా హోటల్ లో పార్టీకి రావాలని ఆహ్వానించాడు. దీంతో ఆయన పిలిచిన వారంతా భార్య పిల్లలతో కలిసి వచ్చారు. వచ్చిన వారందరికీ ప్లేట్ భోజనం రూ.1000 చొప్పున హెటల్ యజమాన్యం బిల్లు చేసింది. మొత్తం 75 మంది పార్టీకి హాజరు కాగా..జిఎస్టీ కాకుండా బిల్లు మొత్తం రూ.75000 అయింది. వారితో పాటు వారి 22 మంది డ్రైవర్లు ఇతర సహాయక సిబ్బందికి ప్లేట్ భోజనం రూ.585 తో హోటల్ వారు చార్జ్ చేశారు. ఇది కాకుండా కొంతమంది ట్యాక్సీలో వచ్చారు.
ఆ ట్యాక్సీ బిల్లు మొత్తం రూ.11,800 అయింది. ఇదంతా బిల్లులో కలిపితే వెరసి రూ.1,22,020 హోటల్ యజమాన్యం బిల్లు వేసి సదరు చీఫ్ సెక్రటరీ ఆఫీసు కి పంపింది. ఆ బిల్లుని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జెనెరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం క్లియర్ చేయడంతో ప్రభుత్వ నిధులతో ఆ బిల్లు మొత్తం చెల్లించడం జరిగింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో జాతీయ మీడియా దీనిపై దుమారం రేపింది. ముఖ్యంగా బిజేపీ, ఇతర ప్రతిపక్ష నాయకులు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని విమర్శలు చేస్తున్నారు. ఒక వైపు రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉంటే ప్రజా ధనాన్ని నీరులా ఖర్చు పెట్టడం ఏంటి? వ్యక్తిగత పార్టీలు కూడా ప్రభుత్వ నిధులతో చేసుకోవడమేంటని ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు.
Also Read: మతి స్థితిమితం లేని యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసులు.. 10 రోజులుగా కోమాలో..
హిమాచల్ ప్రదేశ్ బిజేపీ ప్రతినిధి, ఎమ్మెల్యే రణధీర్ శర్మ ఈ అంశంపై మాట్లాడుతూ..”రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. అధికారుల ప్రైవేట్ పార్టీల కోసం ప్రభుత్వ నిధులు వాడుతున్నారు. హోలీ రోజు అధికారులు వారి కుటుంబాలు, వారి వద్ద పనిచేసి సిబ్బంది పార్టీ చేసుకొని రూ.లక్షా 20 వేలకు పైగా బిల్లు చేశారు. ఆ బిల్లుని చీఫ్ సెక్రటరీ జెనరల్ అడ్మెనిస్ట్రేషన్ కు పంపగా.. అక్కడి నుంచి దానికి పేమెంట్ జరిగింది. అధికారులు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వారి సొంత అవసరాల కోసం, పార్టీలు ఎంజాయ్ చేయడం కోసం ప్రజా ధనం ఎలా ఖర్చు పెడుతున్నారు. ఇదంతా తెలిసి కూడా ప్రభుత్వం ఏమీ చేయడంలేదు. వారిని ఆపడం లేదు. ఎప్పుడూ సంక్షేమం, మార్పు గురించి మాట్లాడే ముఖ్యమంత్రి ఈ విషయంపై స్పందించాలి.. ఇకపై ఇలాంటి ఘటనలు జరగబోవని హామీ ఇవ్వాలని బిజేపీ డిమాండ్ చేస్తోంది” అని అన్నారు.
అయితే ఈ విషయం ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కానీ, చీఫ్ సెక్రటరీ సక్సేనా గానీ స్పందించకపోవడం గమనార్హం.