Holi Violence| శుక్రవారం దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు జరిగాయి. అయితే, ఈ పండుగ నేపధ్యంలో కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. జార్ఖండ్‌లోని గిరిడీహ్ జిల్లాలో హోలీ సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ సంఘటనలో అనేక మంది గాయపడ్డారు. అల్లరి మూకలు అనేక వాహనాలు, దుకాణాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. గిరిడీహ్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మూడు దుకాణాలతో పాటు అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు తమ బలగాలను సంఘటనా స్థలంలో మోహరించి, పరిస్థితిని నియంత్రించారు.
పోలీసు అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన ఘోడతంబాలో జరిగిందని తెలిపారు. ఒక వర్గం హోలీ రంగులు జల్లుకుంటూ వెళ్తుండగా.. స్థానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలై, పరస్పరం రాళ్ల దాడులు జరిగాయి. ఈ ఘర్షణలో అనేక మంది గాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు.
Also Read: రూపాయి సింబల్ వివాదం.. కరెన్సీ చిహ్నం మార్పుపై తమిళ డిజైనర్ ఏమన్నారంటే
హోలీ వివాదంలో జోక్యం.. పోలీసు అధికారి హత్య
బీహార్‌లోని ముంగేర్‌లో ఒక దారుణ ఘటన జరిగింది. హోలీ వేడుకల సమయంలో మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఒక పోలీసు అధికారి తల పగులగొట్టారు. వెంటనే స్థానికులు ఆ పోలీసు అధికారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి చేరుకునేసరికి అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు.
ఈ ఘటనలో రోహ్‌తక్‌కు చెందిన ఏఎస్‌ఐ సంతోష్ కుమార్ మృతి చెందారు. మీడియాకు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. శుక్రవారం రాత్రి ముఫస్సిల్ పోలీస్ స్టేషన్‌కు డయల్ 112కు ఫోను వచ్చింది. నందలాల్‌పూర్‌లో మద్యం మత్తులో ఇరు వర్గాలు ఘర్షణ పడుతున్నాయని ఆ ఫోను ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో ఏఎస్‌ఐ సంతోష్ కుమార్ తన బృందంతో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గొడవ పడుతున్న ఇరు గ్రూపులకు శాంతి స్థాపించే ప్రయత్నం చేశారు.
అయితే, పోలీసుల ప్రయత్నం విఫలమైంది. ఇంతలో వారిలో ఒకరు మారణాయుధంతో ఏఎస్‌ఐ సంతోష్ కుమార్ తల పగులగొట్టారు. వెంటనే అతను స్పృహ తప్పి కింద పడిపోయాడు. అతని తల నుంచి విపరీతంగా రక్త స్రావమైంది. దీంతో స్థానికులు, పోలీసులు అతడిని వెంటనే ముంగేర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. సంతోష్ కుమార్‌ను మెరుగైన చికిత్స కోసం ముంగేర్ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి పట్నా ఆస్పత్రికి తరలించారు. కానీ సంతోష్ కుమార్ అక్కడ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన హోలీ సంబరాలు రంజాన్ శుక్రవారం ప్రార్థనలు
దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ప్రజలు రంగులతో ఆనందించారు, శుభాకాంక్షలు పంచుకున్నారు. రాజకీయ నాయకులు, సినీ తారలు కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. అదే సమయంలో, రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ప్రత్యేక శుక్రవారం ప్రార్థనలు నిర్వహించారు. హోలీ, రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ఒకే రోజు జరగడంతో, వివిధ రాష్ట్రాల్లో సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మసీదుల చుట్టూ సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు మోహరించారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో షాహీ జామా మసీదు వద్ద కూడా అంతా శాంతియతంగానే ముగిసింది. ఈ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. హోలీ వేడుకలు మరియు రంజాన్ ప్రార్థనలు శాంతియుతంగా ముగిసినందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.