Tamil Nadu Rupee Symbol: తమిళనాడులో రూపాయి చిహ్నం మార్పుపై వివాదం వేడెక్కింది. ఈ వివాదంపై రూపాయి సింబల్ డిజైనర్ ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ చివరికి స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ ప్రతుల్లో ఆయన రూపొందించిన రూపాయి చిహ్నాన్ని తొలగించి.. దాని స్థానంలో “రూ” అనే అర్థం వచ్చే తమిళ పదాన్ని డీఎంకే ప్రభుత్వం చేర్చిన విషయం తెలిసిందే. ఈ సంగతి భాషా యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తూ.. బీజేపీ, అధికార డీఎంకే మధ్య పరస్పర విమర్శలతో వివాదం సాగుతోంది. అయితే.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాను తప్పుబట్టబోనని ఉదయ్ కుమార్ స్పష్టం చేశారు.
“మేము రూపొందించే అన్ని డిజైన్‌లకు పేరొస్తుందన్న హామీ లేదు. అలాగే, అందరూ వాటిని మెచ్చుకోవాలని కూడా లేదు. ప్రతి ఒక్కరూ తమ పనిలో విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఆ విమర్శలను సానుకూలంగా తీసుకుని, ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు సాగాలి. నాది అదే ధోరణి. అంతమాత్రాన ఇది నన్ను లేదా నా పనిని అవమానించడం అని నేను భావించను. రూపాయి చిహ్నాన్ని రూపొందించడం గర్వకారణమని భావిస్తున్నాను,” అని ఆయన తెలిపారు.
Also Read: నిరుపేద కూలీకి రూ.23 లక్షల జీఎస్టీ నోటీసు!.. లక్షల కోట్లలో పన్ను ఎగవేతలు
డీఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించబోనని కూడా స్పష్టం చేశారు. “చిహ్నం మార్పుకు ప్రభుత్వానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు. అవి నన్ను అసంతృప్తికి గురి చేయలేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
“నేను నాకు అప్పగించిన పని గురించి మాత్రమే ఆలోచిస్తాను. భారత కరెన్సీ కోసం సాధారణంగా, అర్థవంతంగా ఉండే విధంగా ఒక చిహ్నాన్ని రూపొందించాలనే బాధ్యతతో పని చేశాను. ఆ సవాళ్లలో విజయం సాధించాను. అంతేకానీ.. ఇది వివాదంగా మారాలని లేదా మారుతుందని నేను అనుకోలేదు,” అని ఒక జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్ కుమార్ చెప్పారు.
భారత కరెన్సీ అయిన రూపాయి కోసం ఒక చిహ్నాన్ని రూపొందించాలని.. 2009లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఒక బహిరంగ పోటీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 3,331 డిజైన్‌లను సమర్పించారు. వాటిలో అయిదు డిజైన్‌లను మాత్రమే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ షార్ట్‌లిస్ట్ చేసింది. అందులో ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ పంపిన డిజైన్ ఫైనలైజ్ అయ్యింది. ఈ చిహ్నం దేవనాగరి లిపి ‘र’ (ర) మరియు లాటిన్ లిపిలోని ‘R’ను పోలి ఉంటుంది. ₹ చిహ్నంలోని రెండు సమాంతర గీతలు సమానత్వాన్ని, సంపద పంపిణీని సూచిస్తాయి.
అయితే, ఒక తమిళ వ్యక్తి రూపొందించిన చిహ్నాన్ని మార్చేసి.. డీఎంకే ప్రభుత్వం దారుణంగా అవమానించిందని బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ విమర్శల మధ్య, ఆ చిహ్నం రూపకర్తే ఈ చర్యను తేలికగా తీసుకోవడం గమనార్హం.