Yogi Adityanath: ఓటు చోరీపై కాంగ్రెస్ ఏడాదికి పైగా పోరాడుతోంది. కేంద్రంలోని ఎన్డీయే మంత్రులు రాహుల్ గాంధీ ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. సిఈసి జ్ఞానేష్ కుమార్ అయితే రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ రాజకీయ విమర్శ చేశారు. సర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని ఎన్డీయే పెద్దలు చెబుతూ వచ్చారు. సిఈసికి మద్దతుగా బిజెపి మంత్రులు నిత్యం విపక్షాలపై విరుచుకు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ భారీ ఆందోళనలకు దిగింది. కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఓటు చోరీకి వ్యతిరేకంగా గళం విప్పింది. అందరూ కలిసి సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి కీలక సమయంలో దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సంచలన ఆరోపణ చేశారు. యూపీలో ఒక కోటి 27లక్షలకు పైగా హిందువుల ఓట్లు సర్ తర్వాత గల్లంతు అయ్యాయని యోగి ఆరోపించారు. ఆయన బిజెపి ముఖ్యమంత్రి కావడంతో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంతకాలం విపక్షాలు చేస్తోన్న ఆరోపణనే బిజెపి ముఖ్యమంత్రి చేయడంతో కేంద్రం డిఫెన్స్ లో పడ్డట్లయ్యింది.
ఓటర్ల జాబితాలో లోపాలపై బిజెపి సీఎం ఆగ్రహం
ఉత్తర ప్రదేశ్ లో సర్ ప్రక్రియ అనంతరం 13.39 కోట్ల ఓట్లు ఉన్నట్లు ఓటర్ లిస్ట్ లో ఉంది. అయితే కనీసం 16 కోట్ల ఓట్లయినా ఉండాలని మిగతా ఓట్లు గల్లంతయ్యాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటోన్న లబ్ధిదారుల్లో 55 లక్షల మంది పేర్లు ఓటరు జాబితాలో గల్లంతయ్యాయని యోగి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 18 -19 ఏళ్ల వయసున్న నాలుగున్నరలక్షల మంది యువత ఓట్లు కూడా జాబితాలో మిస్ అయ్యాయని యోగి ఆరోపిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటరు జాబితాలో నమోదైన వారిలో 66లక్షల మంది ఓటర్ల పేర్లు కూడా అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో లేవని యోగి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిజెపి కార్యకర్తలు, నేతలు బి.ఎల్.ఓ.లను కలిసి గల్లంతు అయిన ఓట్లలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరి పేరు ఓటరు జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గల్లంతయిన ఓట్లు బిజెపి పడేవే అని కూడా యోగి అన్నారు.
సిఈసి రాజీనామా డిమాండ్!
దేశ వ్యాప్తంగా సిఇసి జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల కమిషన్ 13 కోట్లకు పైగా ఓట్లను గల్లంతు చేసిందని విపక్షాలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషన్ లోని మిగతా ఇద్దరు కమిషనర్లు సంధూ, జోషీలు సిఇసి తీసుకున్న 14 నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు మీడియా బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఓటర్ల నమోదులో ఫాం 6 లో రాజ్యాంగ విరుద్ధంగా సిఇసి జ్ఞానేష్ కుమార్ మార్పులు తీసుకురావడాన్ని కూడా సుప్రీం కోర్టు తప్పు పట్టింది. ఆ అధికారం ఈసీకి లేదని స్పష్టం చేసింది. సిఇసిని అడ్డుపెట్టుకుని కేంద్రంలోని బిజెపి పెద్దలు బిజెపియేతర పార్టీలకు సంబంధించిన ఓట్లనే పనిగట్టుకుని సిఇసి గల్లంతు చేస్తున్నారని రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలు పదే పదే ఆరోపించారు. బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటు చోరీతోనే బిజెపి విజయాలు సాధించిందని విపక్షాలు మండి పడుతున్నాయి. అయితే వీటిని నిరాధార ఆరోపణలుగా ప్రభుత్వం కొట్టిపారేస్తూ వచ్చేది. ఇపుడు బిజెపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇదే ఆరోపణ చేయడం విశేషం.
Also Read: చిరు, ఎన్టీఆర్ నుంచి తేజ సజ్జ వరకు.. అమిత్ షా భేటీల వెనుక అసలు వ్యూహమేంటి?