Mounjaro KwikPen Diabetes| డయాబెటీస్ (మధుమేహం), ఊబకాయం లాంటి రెండు ప్రధాన ఆరోగ్య సమస్యలకు సమాధానంగా ఒకే ఇంజక్షన్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు మౌంజారో క్విక్‌పెన్. అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ అనే ఫార్మా కంపెనీ ఈ మౌంజారో (టిర్జెపటైడ్) క్విక్‌పెన్ తయారు చేసింది. భారతదేశంలోని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) నుండి అనుమతి పొందింది. ఈ ఏడాది మార్చిలో.. కంపెనీ మౌంజారోను 2.5 ఎంజీ, 5 ఎంజీ లాంటి రెండు డోసులతో ఇంజెక్షన్ వయల్ రూపంలో లాంచ్ చేసింది.
మౌంజారో క్విక్‌పెన్ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ క్విక్‌పెన్ ఇంజెక్షన్ వారానికి ఒకసారి వాడే ఒక మల్టీ-డోస్, సింగిల్-పేషెంట్ ప్రీఫిల్డ్ పెన్. ఇది టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం ఉన్నవారికి ఔషధం వాడడానికి సులభమైన మార్గాన్ని అందిస్తుంది. మౌంజారో ఒక ప్రత్యేకమైన ఔషధం.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను, ఆకలిని నియంత్రించే రెండు హార్మోన్లు—జీఐపీ (గ్లూకోజ్-డిపెండెంట్ ఇన్సులినోట్రోపిక్ పాలీపెప్టైడ్), జీఎల్‌పీ-1 (గ్లూకాగన్-లైక్ పెప్టైడ్-1)—రిసెప్టర్లను యాక్టివేట్ చేస్తుంది.
సరళంగా చెప్పాలంటే.. మౌంజారో ఈ విధంగా సహాయపడుతుంది.
మౌంజారో ఆరు డోసేజ్ ఎంపికలు (2.5 ఎంజీ నుండి 15 ఎంజీ వరకు) త్వరలో భారతదేశంలో అందుబాటులోకి రానున్నాయి.
మౌంజారో పెన్ ఇంజెక్షన్ బరువుని ఎలా నియంత్రిస్తుంది?
ఈ ఔషధం మెదడులోని ఆకలిని నియంత్రించే కేంద్రాలపై పనిచేస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం అయ్యే క్రియం వేగవంతం చేసి.. త్వరగా కడుపు ఖాళీ చేస్తుంది. దీనివల్ల వాడేవారు ఎక్కువ సేపు ఆకలి లేకుండా ఉంటారు. క్లినికల్ డేటా ప్రకారం.. ఇది కొవ్వు జీవక్రియను మెరుగుపరచి, శరీరంలో కొవ్వును తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మౌంజారో క్విక్‌పెన్‌ను ఎవరు వాడవచ్చు?
క్విక్‌పెన్ ఈ క్రింది వారికి ఆహారం, వ్యాయామంతో కలిపి సప్లిమెంటరీ చికిత్సగా ఆమోదించబడింది:
టైప్ 2 డయాబెటిస్ ఉన్న పెద్దలు
ఊబకాయం ఉన్న పెద్దలు అంటే బీఎంఐ – 30 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు.
బరువు సంబంధిత సమస్యలు (అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటివి) ఉన్న అధిక బరువు ఉన్న పెద్దలు (బీఎంఐ ≥ 27)
మౌంజారో క్విక్‌పెన్ భారతదేశంలో ఎప్పుడు అందుబాటులో ఉంటుంది?
సీడీఎస్‌సీఓ మార్కెటింగ్ అనుమతిని ఇచ్చినప్పటికీ.. లిల్లీ కంపెనీ లాంచ్ తేదీ లేదా ధర వివరాలను ఇంకా ప్రకటించలేదు. త్వరలో ఈ వివరాలు వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం, మౌంజారో వయల్ రూపంలో 2.5 ఎంజీ ధర రూ. 3,500,.. 5 ఎంజీ వయల్ ధర రూ. 4,375గా ఉంది.
నిపుణుల హెచ్చరిక
మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో రోబోటిక్ మరియు లాపరోస్కోపిక్ సర్జరీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ గౌతమ్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఊబకాయ నిరోధక ఔషధాలకు సానుకూల స్పందన ఉన్నప్పటికీ.. వాటి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇంకా నిరూపణ కాలేదని అన్నారు. ఔషధం వాడే సమయంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. కానీ, ఔషధం ఆపేసిన తర్వాత బరువు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఊబకాయానికి బేరియాట్రిక్ సర్జరీ దీర్ఘకాలికంగా మరింత నమ్మదగిన పరిష్కారమని ఆయన సూచించారు.
మార్కెట్‌లో తీవ్ర పోటీ
ఫార్మాట్రాక్ డేటా ప్రకారం.. మే నెల నాటికి మౌంజారో 81,570 యూనిట్లు విక్రయించబడ్డాయి, ఏప్రిల్ నుండి మే వరకు 60 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో, డానిష్ ఔషధ సంస్థ నోవో నార్డిస్క్ తమ బ్లాక్‌బస్టర్ బరువు తగ్గించే ఔషధం వెగోవీని మంగళవారం భారతదేశంలో ప్రారంభించింది. ఈ నెలాఖరు నాటికి ఇది ఫార్మసీలలో అందుబాటులో ఉంటుందని నోవో నార్డిస్క్ ఇండియా ఎండీ విక్రాంత్ శ్రోత్రియా తెలిపారు.
Also Read: ఆఫీసులో పనిఒత్తిడి, గొడవలతో షుగర్ వ్యాధి.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు
భారతదేశంలో డయాబెటిస్, ఊబకాయం సమస్యలు
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS)-5 (2019–21) ప్రకారం.. 15–49 ఏళ్ల వయస్సు గల 24 శాతం మహిళలు, 23 శాతం పురుషులు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. ఇది 2015–16తో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ అంచనా ప్రకారం.. భారతదేశంలో డయాబెటిస్ ఉన్న పెద్దల సంఖ్య 2021లో 74.2 మిలియన్ల నుండి 2045 నాటికి 124 మిలియన్లకు పెరుగుతుంది.
ఇంతలో.. భారతీయ ఫార్మా కంపెనీలు మౌంజారో, వెగోవీకి సరసమైన ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయడానికి పోటీపడుతున్నాయి. వెగోవీలోని క్రియాశీల పదార్థం సెమాగ్లూటైడ్ 2026 నాటికి భారతదేశంలో పేటెంట్ నుండి తప్పుకోనుంది, ఇది జనరిక్ ఔషధాలకు మార్గం సుగమం చేస్తుంది.