
India Bangladesh Test : బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. రసవత్తరంగా జరిగిన రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి.. టీమ్ ఇండియా ఆదిలో తడబడింది. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతూ.. కష్టాల్లో పడింది.
45 పరుగులు… 4 వికెట్ల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్… మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్లు విజృంభించడంతో ఓ దశలో గెలుపు వారివైపే ఉన్నట్టు కనిపించింది. ఆ సమయంలో అయ్యర్ 29 పరుగులు, అశ్విన్ 42 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ 8వ వికెట్‌కు 71 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేసి, జట్టును విజయ తీరాలకు చేర్చారు. అంతకుముందు భారత బ్యాటర్లలో అక్షర్‌పటేల్ ఒక్కడే 34 పరుగులతో రాణించాడు. ఇక బంగ్లా బౌలర్లలో మిరాజ్ 5 వికెట్లు తీయగా.. షకీబ్ 2 వికెట్లు పడగొట్టాడు.
టెస్టు సిరీస్‌ను గెలిచిన తర్వాత ట్రోఫీని కెప్టెన్ కేఎల్ రాహుల్ అందుకున్నాడు. అనంతరం యువ ఆటగాడు సౌరభ్ కుమార్‌కు అందజేసి.. గతంలో ఎంఎస్ ధోనీ పాటించిన సంప్రదాయాన్ని ఇప్పుడు రాహుల్ కొనసాగించాడు. రెండో టెస్టులో జట్టుకు విజయాన్ని అందించిన అశ్విన్ మ్యాన్… ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను పుజారా గెలుచుకున్నాడు.