India Bans Pakistan: పాకిస్థాన్‌ను భారత్ అష్టదిగ్బంధనం చేస్తోంది. దాయాది దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే.. పాక్‌ను మరో చావుదెబ్బ కొట్టింది. పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పాక్ ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత్ నుంచి తగులుతున్న ఒక్కో దెబ్బకు పాకిస్థాన్ విలవిల్లాడిపోతోంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో.. వాణిజ్య యుద్ధం కూడా తీవ్రమైంది. పాకిస్థాన్ నుంచి గానీ, పాకిస్థాన్ ద్వారా గానీ ఎగుమతి అయ్యే అన్ని వస్తువుల.. ప్రత్యక్ష, పరోక్ష దిగుమతుల్ననింటిని భారత్ నిషేధించింది. దీనికి సంబంధించి.. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. జాతీయ భద్రత, ప్రజా విధానంగా ఆధారంగా ఈ నిషేధాన్ని విధించారు.
పాక్‌ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్న భారత్
ఇప్పటికే భారత్-పాక్ మధ్య ఉన్న ఏకైక భూ సరిహద్దు కేంద్రం.. అట్టారీ-వాఘా దగ్గర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ని మూసేశారు. దాంతో.. భూమార్గం ద్వారా వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. పాకిస్థాన్ విమానాలకు సంబంధించిన భారత్ తన గగనతలాన్ని కూడా మూసేసింది. దాంతో.. వాణిజ్య రవాణాకు సంబంధించిన విమాన సేవలు కూడా ఆగిపోయాయి. మొత్తంగా పాకిస్థాన్ నుంచి అన్ని రకాల వస్తువుల దిగుమతుల్ని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా నిషేధించారు.
మరింత దిగజారనున్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ
ఇప్పటికే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలహీనంగా ఉంది. ఇప్పుడు భారత్ ప్రకటించిన వాణిజ్య యుద్ధంతో.. దాయాది దేశం మరింత ఎఫెక్ట్ కానుంది. తాజా నిషేధంతో.. ఔషధాలు, రసాయనాలు, పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ లాంటి వస్తువుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. గతేడాది పాకిస్థాన్ నుంచి భారత్‌కు.. సుమారు 305 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి అయ్యాయి. ఆ లెక్కన చూస్తే.. పాకిస్థాన్ ఇప్పుడు భారీగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక.. భారత వస్తువులు.. దుబాయ్, సింగపూర్, శ్రీలంక లాంటి దేశాల ద్వారా పాకిస్థాన్‌కు చేరుతున్నాయి. వీటి విలువ సుమారు 10 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నిషేధంతో.. ఈ వాణిజ్యాన్ని కూడా ఆపేస్తుంది. ఈ చర్యల వల్ల పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆహార కొరతతో పాటు ఔషధాల కొరత తీవ్రమవుతుందని అంచనా వేస్తున్నారు.
Also Read: పాక్‌లో సైనిక తిరుగుబాటు? ప్రధాని షెహబాజ్ సైలెంట్ మోడ్!
భారత్ – పాకిస్థాన్ మధ్య వాణిజ్య సంబంధాలు 2019 నుంచే దాదాపుగా స్తంభించాయ్. పుల్వామా దాడి తర్వాత.. రెండు దేశాల మధ్య అంతంతమాత్రంగానే వాణిజ్యం కొనసాగుతోంది. అయినప్పటికీ.. దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల ద్వారా అనధికార వాణిజ్యం జరుగుతోంది. ఇప్పుడు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగే ఎగుమతులు, దిగుమతులన్నీ నిలిచిపోయాయ్. పహల్గామ్ ఉగ్రదాడి.. రెండు దేశాల మధ్య ఆర్థిక, దౌత్య, వాణిజ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. భారత్.. పాక్ వస్తువుల దిగుమతిపై నిషేధం విధించడం, సరిహద్దులు మూసేయడం, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం లాంటి చర్యలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతాయి.
భారత తీర జలాల్లో పాక్ బోట్లపై నిషేధం
అలాగే..భారత తీర జలాల్లో పాకిస్థాన్ బోట్లపై కూడా నిషేధం విధించింది. అసలు పాక్‌కు చెందిన ఏ బోట్ కూడా భారత పోర్టుల్లోకి ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే భారత గగనతలంలోకి పాకిస్థాన్ సివిల్, మిలటరీ విమానాలు ఎంటర్ కాకుండా నిషేధం విధించింది కేంద్రం. దీంతో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ చైనా, శ్రీలంక మీదుగా తిరిగి వెళుతున్నాయి. అంతకంటే ముందే భారత గడ్డపై పాక్ దేశస్థులపే నిషేధం పడింది. దౌత్యాధికారుల సంఖ్యను సగానికి సగం తగ్గించేసింది. అదే సమయంలో భారత్‌లో పాకిస్థాన్ పౌరులు ఉండకూడదని ఆదేశాలు వెలువడ్డాయి.
పాక్ పోర్టుల్లోకి కూడా భారత్ నౌకలు వెళ్లొద్దన్న కేంద్రం
ఇప్పటికే వందలాది మంది భారత్‌ను విడిచి పెట్టి వెళ్లారు. ఇలా ఏ విధంగా కూడా పాకిస్థాన్ అనే పేరు భారత్‌లో వినపడకుండా చర్యలు తీసుకుంటోంది భారత్. మరోవైపు పాక్ పరోక్ష దిగుమతులపైనా నిషేధం విధించింది. ఏ విధంగానూ పాక్‌కు చెందిన దిగుమతులు భారత్‌లోకి రావడానికి వీల్లేదని ప్రకటించింది. నేరుగా కానీ.. ఇతర దేశాల మీదుగా కానీ పాక్‌కు చెందిన వస్తువులు భారత్‌లోకి రాకూడదని ఆదేశాలు వెలువడ్డాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇవి అమల్లో ఉండనున్నాయి.