ఏప్రిల్ 1 నుంచి భారత ప్రభుత్వం గూగుల్ ట్యాక్స్ ని రద్దు చేస్తోంది. దీనికి సంబంధించి ఆర్థిక బిల్లులో సవరణలు కూడా పూర్తయ్యాయి. ఈ ట్యాక్స్ రద్దు చేస్తే టెక్ దిగ్గజ కంపెనీలకు భారీగా లాభాలు సమకూరే అవకాశముంది. పన్ను, పన్నుమీద పన్నుతో సామాన్యుడి నడ్డి విరిచే భారత ప్రభుత్వం కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే ట్యాక్స్ ని రద్దు చేస్తుందంటే ఆశ్చర్యమే. కానీ దీని వెనక ఆసక్తికర కారణం ఉంది.
గూగుల్ ట్యాక్స్ అంటే ఏంటి..?
భారత దేశంలో సోషల్ మీడియా వంటి ప్లాట్ ఫామ్ లను నిర్వహించే విదేశీ కంపెనీలకు వచ్చే ప్రకటనలపై మన ప్రభుత్వం వసూలు చేసే పన్నునే గూగుల్ ట్యాక్స్ అంటారు. వాస్తవానికి దీన్ని ఈక్వలైజేషన్ లెవీ అని పిలవాలి. కానీ గూగుల్ ట్యాక్స్ గా ఇది సుప్రసిద్ధం. గూగుల్, మెటా వంటి కంపెనీల నుంచి ఈ పన్నుని భారత ప్రభుత్వం వసూలు చేస్తుంది. భారత్ లోని వివిధ కంపెనీలు, వ్యక్తులు.. ప్రకటనల రూపంలో విదేశీ సంస్థలకు సొమ్ము చెల్లిస్తారు. అందులోనుంచి మన ప్రభుత్వం 6 శాతం ఈక్వలైజేషన్ లెవీ కింద వసూలు చేస్తుంది.
సడన్ గా రద్దు ఎందుకు..?
గూగుల్ ట్యాక్స్ ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణం ఉంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా ఇతర దేశాలకు అతి పెద్ద వార్నింగ్ ఇచ్చారు. తమ దేశ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించాలని, లేకపోతే తాము కూడా అదే స్థాయిలో ఇతర దేశాల ఉత్పత్తులపై పన్నులు వేస్తామని హెచ్చరించారు. భారత్ కూడా హిట్ లిస్ట్ లో ఉంది. ట్రంప్ మాటలు వినకపోతే రొయ్యలు, బాస్మతి బియ్యం, ఆభరణాల వంటి ఎగుమతులపై భారీగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. పన్నులు పెరిగితే మన ఎగుమతులు పడిపోవడం ఖాయం. ఈ భయంతోనే మన ప్రభుత్వం గూగుల్ ట్యాక్స్ ని రద్దు చేసింది.
ఎవరికి లాభం..?
గూగుల్ ట్యాక్స్ రద్దుతో విదేశీ కంపెనీలకు భారీగా లాభం చేకూరుతుంది. అదే సమయంలో స్వదేశీ కంపెనీలపై కూడా భారం తగ్గుతుంది. ఆమేరకు అడ్వర్టైజింగ్ రంగంలో కూడా అభివృద్ధి కనపడుతుంది. ప్రకటనల ఖర్చు తగ్గుతుంది కాబట్టి, భారతీయుల వ్యాపార ప్రకటనలు మరింత చౌకగా మారతాయి. డిజిటల్ ప్రకటనలకు ఇది మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.
టెక్ దిగ్గజాలు ఇక అడ్వర్టైజింగ్ ధరలలో లెవీని లెక్కించాల్సిన అవసరం ఉండదు. ఇది వారి లాభాలను పెంచుతుంది. భారత్ సుంకాలు తొలగించింది కాబట్టి.. అమెరికా మనపై సాఫ్ట్ కార్నర్ తో ఉంటుంది. అంటే ట్రంప్ నిర్ణయానికి మనం పెద్దగా ప్రభావితం కానవసరం లేదు. అందుకే ముందు చూపుతో భారత ప్రభుత్వం ఈ ట్యాక్స్ ని రద్దు చేసింది. దీంతో భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగవుతుందని, డిజిటల్ రంగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్‌పై ఆధారపడే వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఇదే సమయంలో కొన్ని విదేశీ టెక్ కంపెనీలకు ఇచ్చే పన్ను మినహాయింపులను తొలగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే ఈక్వలైజేషన్ లెవీ రద్దు చేసినా కూడా.. ఇతర నిబంధనల కింద పన్ను విధించే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడుల విషయంలో కూడా భారత ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ప్రకటించడం విశేషం.