Pahalgam Attack Update : అనుకున్నట్టే అయింది. ఉగ్రవాదుల అడ్డా PoK అని తేలింది. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఇండియన్ ఆర్మీ సరిహద్దుల్లో నిఘా పెంచింది. పీవోకే 42 టెర్రర్ లాంచ్ ప్యాడ్‌లను గుర్తించింది. ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని.. వాటిళ్లో 150 నుంచి 200 మంది వరకు టెర్రరిస్టులు ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు భారత భద్రతా బలగాలు పసిగట్టాయి. ఆ టెర్రర్ క్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయనే పక్కా సమాచారం ఆర్మీ చేతికి చిక్కినట్టు తెలుస్తోంది. మరో సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ఆపరేషన్‌కు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం.
పాక్‌లో భయం షురూ..
అయితే, ఈ విషయం ముందే పసిగట్టిన పాకిస్తాన్ సైన్యం.. PoKలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. టెర్రరిస్ట్‌లను ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలిస్తోందట. ఈ మేరకు పాక్ ఆర్మీ కదలికలను నిఘా వర్గాలు గుర్తించాయని తెలుస్తోంది.
మరోసారి సర్జికల్ స్ట్రైక్స్?
పీఓకేలోని పలు ప్రాంతాల్లో వందలాది ఉగ్రవాదులతో క్యాంపులు ఉన్నట్టు గుర్తించారు. వారందరూ విడతల వారీగా భారత్‌లో చొరబాటుకు సిద్ధంగా ఉన్నవారే. అయితే, పహల్గాంలో హిందువులపై ఉగ్రవాదుల మారణహోమం తర్వాత ఇండియా తీవ్రంగా స్పందించింది. ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది. సరిహద్దుల్లో కనిపిస్తే కాల్చివేతకు సిద్ధంగా ఆర్మీ ఉంది. ఇక ఇప్పట్లో ఈ ఉద్రిక్త పరిస్థితులు తగ్గకపోవచ్చు. అదే సమయంలో రివేంజ్ కోసం రగిలిపోతున్న భారత్.. ఎలాంటి తీవ్రమైన దాడులకైనా దిగొచ్చు. పీవోకేపై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ తరహా అటాక్స్ ఉంటాయనే బలమైన ప్రచారం జరుగుతోంది. అందుకే, పాకిస్తాన్ అలర్ట్ అయింది. పీవోకేలో పెంచి పోషిస్తున్న ఉగ్రమూకలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందని భారత నిఘా వర్గాలు తేల్చాయి.
పహల్గాం ముష్కరుల కోసం వేట
మరోవైపు, పహల్గాం సైతానుల కోసం ఆర్మీ వేట కొనసాగుతోంది. ప్రధాని మోదీ చెప్పినట్టుగానే.. భూమి అంచుల వరకూ వేంటాడుతున్నారు. ఆ నలుగురు ముష్కరుల జాడను నాలుగుసార్లు ట్రాక్ చేశాయి మన భద్రతా బలగాలు. దొరికినట్టే దొరికి.. ఆ నాలుగుసార్లూ జస్ట్ మిస్ అయ్యారు. ఒకసారి జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కూడా జరిగాయని తెలుస్తోంది.
అడవుల్లో దొంగాట..
ఇంటెలిజెన్స్ సమాచారంతో దట్టమైన అడవుల్లో ఆ నలుగురు టెర్రరిస్టులు నక్కినట్టు తెలిసి.. వారిని ఆర్మీ చుట్టుముట్టే ప్రయత్నం చేసింది. బలగాల కదలికలను గుర్తించి.. వాళ్లు అక్కడి నుంచి పారిపోయినట్టు తెలిసింది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఉగ్రవాదులు సులువుగా తప్పించుకోగలుగుతున్నారు. అయినా, ఇంకా ఎన్నాళ్లో వాళ్లు ఆటలు సాగవని.. త్వరలోనే వారిని వేటాడుతామని ఆర్మీ బలగాలు ధీమాగా చెబుతున్నాయి.
Also Read : ఉగ్రదాడి కవరేజ్.. ఆ 16 ఛానెళ్లపై కేంద్రం యాక్షన్
కశ్మీర్ అంచుల వరకూ వేట
పహల్గాంలో కాల్పులకు తెగబడి.. 26 మంది హిందువులను చంపేసిన ఉగ్రవాదులు.. సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. వారి ఉనికిని మొదట తెహస్లీ దగ్గర గుర్తించారు. ఆ తర్వాత కుల్గాం ఫారెస్ట్‌కు జారుకున్నారు. అక్కడే భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య ఫైరింగ్ జరిగింది. అక్కడి నుంచి త్రాల్ కొండలు.. అట్నుంచి కొకెర్నాగ్ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు సమాచారం. స్థానికులను భయపెట్టి.. అడవులకు సమీపంలోని గ్రామాల నుంచి వాళ్లు ఆహారం తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు శిక్షణ పొందిన సైనికుల్లా.. చాలా అప్రమత్తంగా ఉంటున్నారని అంటున్నారు. వారిని ఎలాగైనా పట్టుకోవాలని.. ఆర్మీ, సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసులు పట్టుదలగా కూంబింగ్ చేస్తున్నాయి.