New Coaches : మధ్య తరగతి ప్రయాణ సాధనమైన రైల్వే సేవల్ని మరింత మెరుగ్గా అందించేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే.. దేశంలోని విస్తారమైన నెట్వర్క్ ద్వారా రోజూ కోట్ల మందిని గమ్య స్థానాలకు చేరవేస్తున్న రైల్వే.. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా నూతన బోగీల ఏర్పాటు, తయారీని ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది. ఇందులో భాగంగా.. వివిధ మార్గాల్లో సేవలందిస్తున్న 370 రైళ్లకు 1000కి పైగా నూతన బోగిలను ఏర్పాటు చేస్తోంది.కాగా.. ఇవ్వన్నీ జనరల్ కేటగిరికి చెందిన బోగీలేనని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే.. అన్ని బోర్డుల పరిధిలోని రైళ్లల్లో ఈ ప్రక్రియ మొదలైందని వెల్లడించిన భారతీయ రైల్వే.. ఈ నవంబర్ చివరి నాటికి అనుకున్న తీరుగా 1000 నూతన బోగీలను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఇప్పటికే పలు రైళ్లకు 583 జనరల్ కోచ్‌లను అమర్చినట్లు తెలిపిన రైల్వే శాఖ.. మిగతా రైళ్లకు ఏర్పాటు చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోందని తెలిపింది. ఈ నూతన ఏర్పాట్ల కారణంగా.. రైల్వేల్లో మరో లక్ష మంది అదనపు ప్రయాణికులకు ప్రయాణ అవకాశం ఏర్పాడుతుందని వెల్లడించింది.
రానున్న రద్దీ రోజుల్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లల్లో ఉండే రైల్వే్.. 2025 హోలీ పండగకు ఈ సీట్లన్నీ అందుబాటులోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్వల్పకాలిక లక్ష్యాల్లో భాగంగా.. మొదటిగా 1 వెయ్యి బోగీలను ఏర్పాటు చేస్తున్న భారతీయ రైల్వే.. రానున్న రెండేళ్లల్లో 10 వేల నాన్-ఏసీ కోచ్‌లను ప్రవేశపెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. ఈ బోగీల ద్వారా దాదాపు 8 లక్షల మంది ప్రయాణికులకు అదనపు సీట్లు అందుబాటులోకి వస్తాయని.. రైల్వే అధికారులు చెబుతున్నారు.
రైల్వే అధికారుల ప్రణాళికల ప్రకారం.. 2024-25 ఆర్థిక ఏడాదిలో రికార్డు స్థాయిలో 5,300 సాధారణ కోచ్ లు ఉన్నాయి. వీటిలో అమృత్ భారత్ జనరల్ కోచ్ లతో సహా 5,605 జనరల్ కోచ్ లు, అమృత భారత్ స్లీపర్ కోచ్ లతో పాటుగా 1,470 నాన్-ఏసీ స్లీపర్ కోచ్ లు, అమృత్ భారత్ ఎస్ఎల్ఆర్ సహా 323 ఎస్ఎల్ఆర్ కోచ్ లు ఉండనున్నాయి. వాటితో పాటుగా 32 హెవీ కెపాసిటీ పార్శిల్ వ్యాన్లు, 55 ప్యాంట్రీ కార్లను రైల్వే శాఖ ఉత్పత్తి లక్ష్యాల్లో భాగం చేసుకుంది. వీటిని మరింత ఎక్కువగా చేర్చుతూ.. 2025-26 లక్ష్యాలకు అనుగుణంగా 10 వేల బోగీలను అందుబాటులోకి తీసుకురానుంది.
రైల్వే శాఖ అంచనాలకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచేందుకు.. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని రైల్వే వర్గాలు వెల్లడించారు. ఈ పదివేల నాన్ ఏసీ కోచ్‌లను ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలతో పాటు భద్రతా ప్రమాణాలతో రూపొందించినట్టు రైల్వే బోర్డు తెలిపింది.
Also Read : కాగ్ అధిపతిగా తెలుగు వ్యక్తి సంజయ్‌మూర్తి.. కాంగ్రెస్ మాజీ ఎంపీ కొడుకు
రానున్న రోజుల్లో రైళ్లల్లో ప్రయాణ అనుభూతిని మరింత మెరుగు పరిచేందుకు.. లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తోంది. ఇందులో భాగంగా..ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్న భారతీయ రైల్వే.. సీట్ల కెపాసిటీని సైతం పెంచేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. వాటితో పాటే వందే భారత్, వందే మెట్రో వంటి ఆధునిక రైళ్లను పెద్ద సంఖ్యలో ప్రవేశపెడుతూ.. ఆధునికతనను సంతరించుకుంటోంది. ఇవ్వన్నీ ఒకెత్తు అయితే.. బుల్లెట్ రైలు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రం ప్రభుత్వం..శరవేగంగా ఆ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది.