Rahul Gandhi Inflation: భారత దేశ ఆర్థిక వ్యవస్థ వల్ల కేవలం కొంతమంది బడా వ్యాపారులు మాత్రమే లభాపడుతున్నారని.. మరోవైపు రైతులు, కూలీ, పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా దుర్భర జీవితం గడుపుతున్నారని లోకసభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశ జిడిపి రేటు గత సంవత్సరాలలో 5.4 శాతానికి పడిపోయిందని ఆయన ఆదివారం రాత్రి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
“భారతదేశ జిడిపి వృద్ధి రేటు రెండు సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం జిడిపి రేటు 5.4 శాతం ఉంది. దీంతో ఒక విషయం స్పష్టమైపోయింది. కొంతమంది బిలియనీర్లు (బడా వ్యాపారులు) మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి లాభం పొందుతున్నారు. కానీ రైతులు, కూలీలు, పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా చాలా కష్టాలు పడుతున్నారు.” అని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ఎక్స్ లో రాశారు.
Also Read: మైనారిటీలను వేధించడంలో బంగ్లాదేశ్, భారత్ ఒక్కటే .. మెహ్‌బూబ ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు
నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం పెరిగిపోతుంటే ప్రజల ఆదాయం మాత్రమే తగ్గిపోతోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. “భారత దేశ కరెన్సీ ఒక డాలర్ మారక విలువకు రూ.84.50 ఉంది. బంగాళదుంపలు, ఉల్లి ధరలు 50 శాతం వరకు పెరిగిపోయాయి. రిటైల్ ద్రవోల్యోబణం 6.21 శాతానికి చేరింది. గత 14 నెలలకు ఇదే గరిష్టం. 45 ఏళ్లలో గరిష్ఠ స్థాయిలో నిరుద్యోగ సమస్య రికార్డు సృష్టించింది. గత 5 ఏళ్లలో లేబర్ పని చేసేవారు, ఉద్యోగులు, చిన్న వ్యాపారుల ఆదాయం పెరగకపోగా.. ఇంకా తగ్గిపోయింది” అని ఆయన ట్వీట్ చేశారు.
దేశంలో జిడిపి తగ్గడానికి ప్రధాన కారణం ప్రజల ఆదాయం తగ్గిపోవడమేనని రాహూల్ చెప్పారు. మధ్యతరగతి ప్రజలు కార్లు కొనడం లేదని.. అందుకే రూ.10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కార్ల విక్రయాలు 50 శాతం కూడా లేవని సూచించారు. 2018-19లో కార్ల విక్రయాలు 80 శాతం ఉంటే ఇప్పుడు 50 శాతం కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆదాయం తగ్గిపోవడంతోనే ప్రజలు సొంత ఇంటి కలకు దూరమైపోయారన్నారు. గత పదేళ్లలో కార్పొరేట్ పన్నుల శాతం 7 శాతం తగ్గిపోయిందని.. కానీ ప్రజలపై ఆదాయపన్ను 11 శాతానికి పెరిగిందని ఎత్తిచూపారు. నోట్లరద్దు, జిఎస్‌టీ వల్ల దేశంలోని తయారీ రంగం 13 శాతానికి పడిపోయిందని గత 50 ఏళ్లలో ఇదే అత్యల్పమని తెలిపారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
అందుకే భారతదేశంలో ప్రజలందరూ భాగస్వమ్యం అయ్యేలా కొత్త ఆర్థిక వ్యవస్థ రూపుందించే అవసరం ఉందని.. అందరికీ సమానవకాశాలు ఉండేలా ముందుకు సాగాలని.. అప్పుడే ఆర్థిక వ్యవస్థ చక్రాలు ముందుకా సాగుతాయని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.