BigTV English

Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయపు ఆసక్తికర విశేషాలు..!

Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయపు ఆసక్తికర విశేషాలు..!

Ayodhya Ram Mandir : అయోధ్యలో ఈ నెల 22న జరగబోతున్న శ్రీరామాలయం ప్రతిష్ఠ గురించి దేశమంతా నేడు మాట్లాడుకుంటోంది. ఎన్నో విశేషాల సమాహారంగా మరో వెయ్యేళ్లపాటు నిలిచేలా నిర్మించిన ఈ ఆలయ విశేషాలు మీకోసం…


ఇప్పుడు నిర్మితమైన రామ మందిరానికి 1989లోనే డిజైన్ గీశారు. నాటి విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అశోక్ సింఘాల్.. ఈ ఆలయ డిజైన్ బాధ్యతను ఉత్తర భారతంలో దేవాలయ నిర్మాణంలో విశేష పేరు ప్రఖ్యాతులు గాంచిన సోమ్‌పుర కుటుంబీకులకు అప్పగించారు. ఏనాటికైనా ఆ స్థలం హిందువులకే దక్కుతుందనీ, కనుక.. ఆ ప్రదేశానికి వెళ్లి కొలతలు తీసుకురమ్మని సింఘాల్ సోమ్‌పుర కుటుంబీకులను పంపారు. అయితే.. అప్పుడు ఆ ప్రాంతమంతా భద్రతా దళాల చేతుల్లో ఉంది. దీంతో.. సోమ్‌పుర కుటుంబీకులు కాషాయ దుస్తుల్లో అక్కడ టెంటులో ఉన్న రామయ్య దర్శనార్థం వచ్చే భక్తుల్లో కలిసిపోయి రోజంతా కాలి అడుగులతోనే ఆ ప్రాంతం లెక్కలు వేసుకుని, అతి తక్కువ సమయంలోనే ఆ నేటి ఆలయం డిజైన్ గీసి సింఘాల్ చేతిలో పెట్టారు.

అయోధ్యలోని ప్రధాన ఆలయాన్ని ఎల్‌ అండ్‌ టీ సంస్థ నిర్మించింది. ఇక.. దానికి అనుబంధంగా ఉన్న ఉపాలయాలు, ఇతర నిర్మాణాల బాధ్యతను టాటా గ్రూపు స్వీకరించింది. అష్టభుజి ఆకారంలో నిర్మితమైన ఈ గర్భగుడి.. రిక్టర్‌ స్కేల్‌పై 10 తీవ్రత గల భూకంపం వచ్చినా చెక్కు చెదరదు. రాబోయే 2,500 ఏళ్లలో వచ్చే వాతావరణ మార్పులను, వరదలు, భూకంపాలు, తుఫానుల వంటి విపత్తులను తట్టుకునేలా దీనిని నిర్మించారు.


ఆయోధ్య ఆలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సూచికగా 27 మొక్కలను నాటారు. చెట్లుగా మారిన వాటికింద భక్తులు కూర్చొని ధ్యానం చేసుకునే ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోని ఏడు ఖండాలు, 115 దేశాల్లోని నదీ జలాలను, సకల సముద్రాల నీటిని, భూమ్మీది 2,587 వేర్వేరు ప్రదేశాల నుంచి మట్టిని సేకరించి తెచ్చి ఆలయ నిర్మాణంలో వాడారు.

అయోధ్యలో మసీదు కూల్చివేసిన రోజే.. కరసేవకులు ఆ స్థలంలో చిన్న టెంటును ఏర్పాటు చేసి బాల రాముడిని ప్రతిష్ఠించారు. నాడు అయోధ్యకు చెందిన బాబూలాల్ అనే దర్జీ బాలరాముడికి తగిన కోమలమైన వస్త్రాలను కుట్టి స్వచ్ఛందంగా అందిస్తూ వచ్చారు. ఆయన తర్వాత బాబూలాల్ టైలర్స్ పేరుతో ఆ షాపును నడుపుతున్న భగవతీ ప్రసాద్ పహాడీ, శంకర్ లాల్ శ్రీవాస్తవలకే ఇకపైనా రామయ్యకు వస్త్రాల రూపకల్పన చేసే అవకాశం ఇచ్చారు.

రథ సప్తమి నాడు అరసవల్లిలో, ఒడిసాలోని కోణార్క ఆలయంలో సూర్య కిరణాలు.. స్వామి మూలమూర్తిపై పడినట్లుగా, శ్రీరామనవమి నాడు.. రాముని పాదాలపై సూర్య కిరణాలు పడేలా ఆలయాన్ని నిర్మించారు. ప్రపంచంలో మూడో అతి పెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య రామాలయం.. అంకోర్‌వాట్‌, తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది.

గర్భగుడిలో ప్రతిష్ఠించే బాల రాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఐదేండ్ల బాలుడిలా కనిపించే రామయ్య, విల్లంబులు ధరించి, పద్మపీఠంపై కనిపిస్తాడు. ఎందరో శిల్పులు రామయ్య విగ్రహం చేయాలని ఆశపడగా, వారి డిజైన్లను వడపోసి, అంతిమంగా మూడు డిజైన్లను ఉత్తమమైనవిగా నిర్ధారించి, వాటిలో నుంచి కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ డిజైన్‌ను ఎంపిక చేశారు. ఆ మిగిలిన రెండు డిజైన్ల విగ్రహాలనూ ఆలయంలో ప్రదర్శనకు ఉంచనున్నారు.

మందిర నిర్మాణంలో ఎక్కడా.. ఇనుము, స్టీల్‌, సిమెంట్‌, కాంక్రీటును వాడలేదు. నేల, గోడలు, మెట్లు, పైకప్పు.. ఇలా అంతటా రాతినే వినియోగించారు. యూపీ, గుజరాత్‌, రాజస్థాన్‌ నుంచి తెప్పించిన ప్రత్యేక శిలలను ఆలయానికి సమీపంలోని కరసేవకపురంలో 30 ఏళ్ల నుంచి చెక్కుతూనే వచ్చారు. నాటి కరసేవ సందర్భంగా దేశం నలుమూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు. అయోధ్య రామమందిరం ప్రధానాలయపు తలుపులు చేసే పనిని సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్‌ డిపో నిర్వాహకులు దక్కించుకొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను కూడా గతంలో వీరే తయారు చేసి అందించారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×