డెత్ స్పాట్‌గా మారిన టూరిస్ట్ లొకేషన్
టూరిస్ట్‌లే టార్గెట్‌గా రెచ్చిపోయిన ఉగ్రవాదులు
ఉగ్రవాదులను ఏరివేసే పనిలో భద్రతా బలగాలు
చాలా రోజులుగా ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ లోయలో మళ్లీ ఉగ్రవాదుల గన్ గర్జించింది. కశ్మీర్ ప్రశాంతతను భగ్నం చేస్తూ టూరిస్టులే టార్గెట్‌గా కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. ఇందుకోసం ట్రెక్కింగ్ హెవన్‌గా పేరుగాంచిన పహెల్‌గామ్‌లోని బైసరన్ ప్లేస్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. ట్రెక్కింగ్ కోసం వచ్చిన ఓ బృందం వద్దకు ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. ముందుగా వారి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత వారిపై కాల్పులు జరిపారు. విచక్షణరహితంగా కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి అడవుల్లోకి పారిపోయారు. కాల్పులు తర్వాత అక్కడి పరిస్థితులు భయానకంగా మారాయి.
కశ్మీర్ ఉగ్రదాడుల్లో సంచలన విషయాలు
కశ్మీర్ ఉగ్రదాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మినీ స్విడ్జర్లాండ్ చూద్దామని వచ్చిన టూరిస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన తర్వాత.. ఉగ్రావాదులు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు భాధితులు చెబుతున్నారు. ఉగ్రవాదులను కొందరు కావాలనే వదిలేసినట్లు తెలుస్తోంది. కళ్లముందే తన భర్తను కాల్చిచంపిన ఉగ్రవాదులు తనని ఎందుకు వదిలేశారు.. తనని కూడా చంపేయమని కోరగా.. ఈ విషయం నువ్వు వెళ్లి మోదీకి చెప్పాలి. అందుకే వదిలేస్తున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఉగ్రదాడిపై ప్రధాని మోడీ రివ్యూ
ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే పహల్గామ్ ఉగ్రదాడిపై రివ్యూ చేశారు ప్రధాని మోడీ. సౌదీ పర్యటనను మధ్యలోనే ముగించుకొని ఢిల్లీ చేరిన ఆయన.. ఎయిర్‌పోర్టు లాంజ్‌లోనే సమీక్ష జరిపారు. NSA అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్..ఉగ్రఘటనపై వివరించారు. మరికాసేపట్లో.. హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి.. అజిత్ దోవల్, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు.
శ్రీనగర్‌లో అమిత్‌షా కీలక సమావేశం
ఇటు అమిత్‌షా శ్రీనగర్‌లో కీలక సమావేశం నిర్వహించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమావేశమయ్యారు. భద్రతా చర్యలపై చర్చించారు. మరోవైపు జమ్మూకశ్మీర్ మొత్తం హై అలర్ట్ కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతున్నారు. జమ్మూకశ్మీర్ నుంచి టూరిస్టులు వెనక్కి వచ్చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ.. శ్రీనగర్‌లో బంద్‌కు పిలుపునిచ్చారు.
రంగంలోకి దిగిన భద్రతా బలగాలు
కాగా.. కాల్పుల విషయం తెలుసుకున్న వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ముందుగా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులను తరలించేందుకు హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది ఆర్మీ. మరోవైపు పహెల్‌గామ్‌లో అదనపు బలగాలను మోహరించారు. ఆ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు.
Also Read: వివాహం ఒక రోజు ముందు వరుడి కండీషన్.. పెళ్లికూతురు ఆత్మహత్య
బైసరన్ వ్యాలీని వ్యూహత్మకంగా సెలెక్ట్ చేసుకున్న ఉగ్రవాదులు
ఉగ్రవాదులు దాడి చేసేందుకు బైసరన్ వ్యాలీని వ్యూహత్మకంగా సెలెక్ట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. పహెల్‌గామ్ హిల్ స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ప్రాంతం. ఇక్కడికి ఏ వాహనాలు వెళ్లలేవు. కాలినడక ఒక్కటే దారి. అందుకే ఈ విషయం ప్రపంచానికి తెలిసేందుకు కాస్త సమయం పట్టింది. భద్రతా బలగాలు అక్కడికి చేరుకునే సమయానికి వారు అక్కడి నుంచి పరారయ్యారు.
హైఅలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
పహెల్‌గామ్ ఏరియా మొత్తాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు. కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. తమ కోసం వచ్చే భద్రతా బలగాల కోసం ఉగ్రవాదులు ట్రాప్‌లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించి.. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నారు.
ఈ అమానుష ఘటనకు పాల్పడింది తామే
ఈ అమానుష ఘటనకు పాల్పడింది తామే అంటూ ప్రకటించుకుంది.. లష్కరే తొయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఈ సంస్థ కశ్మీర్‌లో దాడులు చేయడం ఈ మధ్య పరిపాటిగా మారింది. గతేడాది కూడా పలు దాడులు చేసింది. TRF చీఫ్ షేక్ సజ్జద్ గుల్ అనేక దాడులకు మాస్టర్‌మైండ్‌గా ఉన్నాడని నిఘా సంస్థలు గుర్తించాయి.