BigTV English

ED Notices: మహేష్ బాబు ,ధోని కి ED నోటీసులు.. అసలు స్కాం ఏంటంటే..

ED Notices: మహేష్ బాబు ,ధోని కి ED నోటీసులు.. అసలు స్కాం ఏంటంటే..

ED Notices: టీవీల్లో, పేపర్లలో, సోషల్ మీడియాలో వచ్చే కమర్షియల్ యాడ్స్ క్రియేటివిటీతో ఉంటాయి. ఇదో పెద్ద ఇండస్ట్రీ. ఎంత క్రియేటివిటీ వాడితే జనంలో అంత క్లిక్ అవుతుంది. అయితే కొన్ని మాత్రం క్రియేటివిటీతో సంబంధం లేకుండా.. దేశంలోని పాపులర్ స్టార్లు, సెలబ్రిటీలు, ఇన్ ఫ్లూయెన్సర్లను తెరపై చూపించి యాడ్ షూట్స్ చేసి జనాన్ని డైవర్ట్ చేసి, భారీ లాభాలు పొందుతాయి సంస్థలు. ఆ తర్వాత బోర్డు తిప్పేస్తే.. చేతులు ఎత్తేస్తే… పరిస్థితి ఏంటి? రియల్ ఎస్టేట్ యాడ్ లో యాక్ట్ చేసిన మహేశ్ బాబుకు ప్రస్తుతం ఈడీ నోటీసుల వ్యవహారంతో సెలబ్రిటీల యాడ్స్ పై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.


ఈడీ దాకా వెళ్లిన మహేశ్ బాబు కమర్శియల్ యాడ్

అనుకున్నదే అయింది.. టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు రియల్ ఎస్టేట్ సంస్థకు చేసిన వాణిజ్య ప్రకటనలపై మ్యాటర్ ఈడీ దాకా వెళ్లింది. ఈడీ దెబ్బకు ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతున్న పరిస్థితి. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ లకు మహేశ్ బాబు గతంలో కమర్షియల్ యాడ్స్ చేశారు. సాయి సూర్యడెవలపర్స్ ప్రకటనలో అయితే మహేశ్ ఫ్యామిలీ మొత్తం నటించారు. యాడ్ చేశారు .. డబ్బులు పుచ్చుకున్నారు.. ఇందులో తప్పేం ఉంది అనుకోవచ్చు. కానీ అక్కడే అసలు మ్యాటర్ ఉంది. తనను అభిమానించే వారికి సూపర్ సలహా అంటూ సాయిసూర్య డెవలపర్స్ గురించి ఆ కమర్షియల్ యాడ్ లో అదరగొట్టారు మహేశ్ బాబు.


అనుమతి లేని వెంచర్లలో ప్లాట్ల అమ్మకం..

సీన్ కట్ చేస్తే ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు జనానికి అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు అమ్మారనీ, మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు కూడా చేశారని, అగ్రిమెంట్లు లేకుండా డబ్బులు తీసుకోవడం, అవకతవకలకు సంబంధించి కేసులు ఫైల్ అయ్యాయి. నిజానికి సాయి సూర్య డెవలపర్స్ ఎవరిదో జనానికి డైరెక్ట్ గా తెలియదు. ఆ కంపెనీ ఓనర్, డైరెక్టర్లను వాళ్లు చూడలేదు. అందులో కొన్న వారంతా సినీ హీరో మహేశ్ బాబు ఫేస్ చూసి ముందుకొచ్చారన్నదే నిజం. మహేశ్ బాబు యాడ్ చేశారు. ఒక్కరే కాదు.. ఆయన సతీమణి, పిల్లలు కూడా ఈ రియల్ ఎస్టేట్ యాడ్ లో కనిపించారు. సో ఫ్యామిలీ మొత్తం కలిసి చేసిన వాణిజ్య ప్రకటన ఇది. పెద్ద కంపెనీ అయి ఉండొచ్చు. నమ్మకమైన సంస్థ అని ప్రిన్సే స్వయంగా చెబుతున్నారు.. ఇంకెందుకు లేటు.. మన హీరోనే చెప్పాడు కాబట్టి కొనేద్దాం అని చాలా మంది కొన్నారు.

యాడ్ చేసి మహేశ్ బాబు ఇరుక్కుపోయారా?

ఇప్పుడు మరోసారి సీన్ కట్ చేద్దాం. కొన్న వారిలో కొందరు ఇరుక్కుపోయారు. అది వేరే విషయం. కానీ ఇప్పుడు హీరో మహేశ్ బాబు ఇరుక్కుపోయిన సీన్ తెరపైకి వచ్చింది. ఎందుకంటే సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూపుల్లో మనీలాండరింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే ఈడీ దర్యాప్తు స్పీడప్ చేస్తోంది. ఈ రెండు సంస్థల నుంచి హీరో మహేశ్ బాబు 5.9 కోట్లు తీసుకున్నాడంటున్నారు. అందులో 3.4 కోట్లు చెక్, 2.50 కోట్లు క్యాష్ రూపంలో. అయితే ప్రచారం కోసం ఆ డబ్బు తీసుకున్నాడు కాబట్టి ఈడీ మహేశ్ బాబు పేరునూ కేసుల్లో చేర్చింది. మహేశ్ బాబు 2.50 కోట్ల క్యాష్ తీసుకోవడంతో దానికీ మనీలాండరింగ్ కు లింక్ ఉందన్నది ఈడీ డౌట్. అందుకే ఈనెల 27న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇష్యూ చేసింది.

మహేశ్ బాబు కమర్శియల్ యాడ్స్ పై వివాదాలెన్నో

భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్, సురానా గ్రూపు, సాయి సూర్య డెవలపర్స్ మీద ఆల్రెడీ తెలంగాణ పోలీసుల ఎంక్వైరీ వేగంగా సాగుతోంది. ఆ వివరాల ఆధారంగా ఈడీ మరింత డీప్ గా వెళ్లి ఆర్థిక అక్రమాలేంటో వెలుగులోకి తెచ్చే పనిలో ఉంది. నిజానికి మహేశ్ బాబు చేసిన కమర్షియల్ యాడ్స్ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ వివాదాలు వచ్చాయి. పోయాయి. అయితే ఇప్పుడు మాత్రం కథ మరో రూట్ లో వెళ్తోంది. మోసపూరిత సంస్థలకు ప్రచారం చేస్తే సెలబ్రిటీలు, ఇన్ ఫ్లూయెన్సర్లు కూడా జవాబుదారీలే అని సుప్రీం కోర్టు చాలా క్లియర్ గా ఆదేశాలిచ్చింది. పతంజలి కేసులో సుప్రీం కీ కామెంట్స్ చేసింది. ఓ సెలెబ్రిటీ కమర్షియల్ యాడ్ చేసే ముందు ఆ సంస్థకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడం, మోసపూరితం కాదని నిర్ధారించుకోవడం ఇవన్నీ వారి బాధ్యతే అని స్పష్టం చేసింది. లేకపోతే మోసం చేసిన వారితో పాటు సెలబ్రిటీలదీ సమాన బాధ్యతే అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది.

ఫ్యామిలీ మెుత్తం నటించినప్పుడు ఎంత జాగ్రత్త అవసరం?

రైట్ ఇప్పుడు మళ్లీ మహేశ్ బాబు విషయానికే వద్దాం. ఇదే సాయి సూర్య డెవలపర్స్ యాడ్ షూట్ కోసం మొత్తం ఆయన ఫ్యామిలీనే రంగంలోకి దిగింది. ఇలాంటి సందర్భంలో మహేశ్ బాబు ఎంత జాగ్రత్త తీసుకోవాల్సింది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఈడీ ఎంక్వైరీకి వెళ్లాల్సిన పరిస్థితి. ఇది వేరే వ్యక్తులైతే ఓకేగానీ… మహేశ్ బాబు టాలీవుట్ సూపర్ స్టార్. అలాంటిది ఒక్కసారి ఈడీ ఆఫీస్ మెట్లెక్కితే దేశమంతా మార్మోగిపోతుంది. మీడియా, సోషల్ మీడియా అంతా అక్కడే ఉంటుంది. అటెన్షన్ మొత్తం మహేశ్ బాబుపై పడుతుంది. ఇదంతా ఇప్పుడు మహేశ్ బాబుకు అవసరమా అన్నది పాయింట్. నెగెటివిటీ స్కోప్ పెంచేలా సీన్ మారుతుంది.

డబ్బులు ఎక్కువ ఇస్తే చేసేస్తారా అన్న ప్రశ్నలు

కమర్షియల్ యాడ్‌కు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారా.. అయితే చేసేద్దాం.. కంపెనీ ప్రొఫైల్ తర్వాతి సంగతి. వీటిని చూసే జనాల సంగతి చివరి మ్యాటర్. ఇదే సెలబ్రిటీలు చేస్తున్న తప్పు. ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని మరీ యాడ్స్ చేయాలి, లేకపోతే ఇదిగో ఇలా మహేశ్ బాబులా చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు తెలియదు అంటే చట్టం ఊరుకోదు. దర్యాప్తు సంస్థలు ఆగిపోవు. మహేష్ బాబు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ పలు ఉత్పత్తులను ప్రమోట్ చేశారని ఆ సమయంలో ఆయన సేవా పన్నులు కట్టలేదంటూ హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ 2018లో నోటీసులు పంపిన వ్యవహారం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. అయితే తాను బాధ్యతగల పౌరుడినని, అన్ని ట్యాక్సులు కట్టానని, బ్యాంక్ అకౌంట్లను ఎలా ఫ్రీజ్ చేస్తారని అప్పట్లో ఆయన రిప్లై కూడా ఫైల్ చేశారు. సో మ్యాటర్ ఏంటంటే.. సినిమాలు వేరు, నిజ జీవితం వేరు. ఒక్కసారి కమిట్ అయితే అన్నిటికీ జవాబులు చెప్పాల్సిందే.

సెలబ్రిటీలూ.. చీటీ చిరుగుద్ది..!

తప్పుదారి పట్టించే ప్రకటనలను కంట్రోల్ చేయడానికి మన దేశంలో అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. అయితే ఇది కొన్ని సందర్భాల్లో ఆపగలుగుతోంది. చాలా సందర్భాల్లో చాలా మంది సెలబ్రిటీలు మిస్ లీడింగ్ యాడ్స్ వివాదాల్లో ఇరుక్కున్నారు. పెద్ద శిక్షల దాకా వెళ్లకపోయినా విచారణలో ఎవరి లీగల్ పాయింట్లు వారికి ఉంటాయి కదా. వాటిని చూపి బయటపడుతున్నారు. అయితే తమను నమ్ముకున్న అభిమానులకు సరైన గైడెన్స్ ఇవ్వడమే అసలు మ్యాటర్.

ధోనొ చుట్టూ కమర్శియల్ యాడ్స్ వివాదాలు

కమర్షియల్ యాడ్స్ లో ఎక్కువ వివాదాలు చుట్టుముట్టిన వారిలో మహేంద్రసింగ్ ధోనీ ఫస్ట్ లైన్ లో ఉన్నారు. దేశంలో బ్రాండ్ వాల్యూ ఎక్కువున్న సెలబ్రిటీ ధోనీనే. 2024లో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్‌లను మించి 42 బ్రాండ్ డీల్స్ కు ధోనీ సైన్ చేశాడంటే రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విషయం ఏంటంటే 2009 నుంచి 2016 వరకు ఆమ్రపాలి గ్రూప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ధోనీ పని చేశాడు. ఢిల్లీ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఈ సంస్థ 40కి పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లను లాంఛ్ చేసింది. ధోనీని చూసి చాలా మంది ఈ గ్రూప్ వెంచర్లలో ఇండ్లు కొనుక్కున్నారు.

ధోనీపై ఎఫెక్ట్ చూపిన ఆమ్రపాలి వివాదం

అయితే ఈ కంపెనీ హౌసింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకుండా మోసం చేసిందని చాలా మంది ఆరోపించారు. ఈ మ్యాటర్ సుప్రీం కోర్టు దాకా వెళ్లడం, అక్కడ కోర్టు సీరియస్ కామెంట్స్ చేయడం, చివరికి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఈ కంపెనీ రిజిస్ట్రేషన్‌ను 2019 జులై 23న రద్దు చేయడంతో మరక ధోనీపైనా పడింది. ఈ కంపెనీ కస్టమర్లు అప్పట్లో ధోనీని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి, కంపెనీ బ్రాండింగ్ నుంచి వైదొలగాలని లేదంటే పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలంటూ డిమాండ్లు చేశారు. ఈ ఒత్తిడితో ధోనీ 2016లో ఆమ్రపాలి బ్రాండ్ అంబాసిడర్‌గా వైదొలిగాడు.

యాడ్స్‌ను ధోని సరి చూసుకోలేదన్న ASCI

2023లో అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ధోనీని అతను ప్రమోట్ చేసిన కొన్ని యాడ్స్‌ సరిగా ఉన్నాయా లేదా అన్నది చూసుకోకుండా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. ASCI రిపోర్ట్ ప్రకారం, ధోనీ 10 సంస్థల యాడ్స్ లో నిబంధనలను పాటించలేదని తేలింది. ఈ యాడ్స్‌లో అతను ప్రచారం చేసిన ఉత్పత్తుల గురించి సరైన ఆధారాలు, అధికారిక ధృవీకరణ లేకపోవడం విమర్శలకు దారితీసింది. ఇవి ధోనీ బ్రాండ్ ఇమేజ్‌పై పెద్దగా ఎఫెక్ట్ చూపకపోయినా.. సెలబ్రిటీలు యాడ్స్‌లో పాల్గొనే ముందు ప్రొడక్ట్స్ గురించి జాగ్రత్తగా ఉండాలన్న మెసేజ్ నైతే ఇచ్చాయి. ఇవే కాదు.. ధోనీ అప్పట్లో ఫెయిర్ నెస్ క్రీమ్స్ బ్రాండ్స్ ప్రమోట్ చేశాడు. ఈ యాడ్స్ వర్ణవివక్షను ప్రోత్సహిస్తున్నాయన్న విమర్శలు సోషల్ మీడియాలో వచ్చాయి. చివరగా.. ధోనీ కొన్ని ఆన్ లైన్ గేమ్స్ ను ప్రమోట్ చేయగా.. అవి ఎకానమీ రిస్క్ లకు దారి తీస్తాయన్న చర్చ జనంలో జరిగింది.

2021లో రాపిడో యాడ్‌లో నటించిన అల్లు అర్జున్

2021లో అల్లు అర్జున్ రాపిడో బైక్ టాక్సీ యాడ్ లో నటించారు. ఆ ప్రకటనలో TSRTC బస్సులను తక్కువ చేస్తూ, రాపిడో సేవలను సౌకర్యవంతంగా, ఆధునికంగా చూపించే ప్రయత్నం జరిగిందన్నది వివాదంగా మారింది. ఈ ప్రకటన ఆర్టీసీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని అప్పట్లో చాలా చర్చ జరిగింది. కాంట్రోవర్సీగా మారింది. ఆ సంస్థ ఎండీ సజ్జనార్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆర్టీసీ పేదలకు, సామాన్య జనానికి చాలా సేవలు అందిస్తుందని, అలాంటి సంస్థను తక్కువగా చూపి యాడ్ చేశారని సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది. అల్లు అర్జున్ ఈ యాడ్ కాన్సెప్ట్ పై పూర్తిస్థాయిలో వర్కవుట్ చేయకుండానే ముందుకు వెళ్లడం అప్పట్లో విమర్శలకు కారణమైంది.

25 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు

ఇక తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ ఉన్న బెట్టింగ్ యాప్స్ చుట్టూ పెద్ద కథే నడుస్తోంది. 2025 మార్చి 20న తెలుగు రాష్ట్రాల్లోని 25 మంది సెలబ్రిటీలు, ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసు నమోదైంది. కేవలం డబ్బుల కోసమే వారంతా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారన్నది అభియోగం. ఆర్థిక నష్టాలు, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు, రియల్ ఎస్టేట్ విషయంలో సెలబ్రిటీలు జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పరిస్థితిని బెట్టింగ్ ప్రమోషన్స్ కేసు గుర్తు చేసింది. 2016లో ఆన్ లైన్ రమ్మీ యాడ్ లో ప్రకాశ్ రాజ్, రానా నటించారు. వారి పేర్లు కూడా తెరపైకి రావడంతో వివరణ ఇచ్చుకున్నారు. అటు విజయ్‌ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, నిధి, అగర్వాల్‌, ప్రణీత, అనన్య నాగళ్ల సహా పలువురిపై ఫిర్యాదులు వచ్చాయి.

తెలియర చేశా.. తప్పు తెలుసుకున్నానన్న ప్రకాశ్ రాజ్

యాంకర్లు విష్ణుప్రియ, రీతూచౌదరిని పంజాగుట్ట పోలీసులు విచారించారు కూడా. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు తమ టీమ్ ల ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. తెలియక చేశా.. తప్పు తెలుసుకున్నానని ప్రకాశ్ రాజ్ వీడియో రిలీజ్ చేశారు. సో ఒక యాడ్ వచ్చినప్పుడు దాన్ని రకరకాల యాంగిల్స్ లో క్రాస్ చెక్ చేసుకుని ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావు కదా అన్నది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోవడంతో వివాదాలు

ఇక మిస్ లీడ్ యాడ్ కేసులో పతంజలి గ్రూప్, యోగా గురు రాందేవ్ బాబాకు కూడా పెద్ద చిక్కులే తీసుకొచ్చింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు డయాబెటిస్, బీపీ, ఆస్తమా, క్యాన్సర్, కోవిడ్-19 వంటి వ్యాధులను నయం చేయగలవని అప్పట్లో రిలీజ్ చేసిన యాడ్స్ లో చెప్పుకున్నారు. అయితే వీటికి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోవడంతో వివాదాస్పదమయ్యాయి. అలాంటి ప్రకటనలు ఆపాలని సుప్రీం కోర్టు చెప్పినా కంటిన్యూ చేయడంతో కోర్టు ధిక్కార కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు అన్ని పేపర్లలో క్షమాపణల యాడ్స్ వేశాక కోర్టు ధిక్కార కేసు మూసేసింది సుప్రీం కోర్టు.

Also Read: అరెస్ట్ భయం.. అజ్ఞాతంలో కాకాణి

చర్చనీయాంశమైన బాలీవుడ్ స్టార్ల పాన్ మసాలా యాడ్స్

అటు బాలీవుడ్ స్టార్లు పాన్ మసాలా, గుట్కా ఉత్పత్తులను ప్రమోట్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాము పొగాకు రహిత ఉత్పత్తులనే ప్రమోట్ చేశామని కొందరు వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఈ ప్రొడక్ట్స్ ఆరోగ్యానికి హానికరమని, సెలబ్రిటీలు సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న అక్షయ్ కుమార్ భవిష్యత్ లో ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.

సెలబ్రిటీలు చేసిన హెల్త్ ప్రొడక్ట్ యాడ్స్‌పై ASCI ఆంక్షలు

మనదేశంలో ASCI అంటే అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇలాంటి తప్పుదారి పట్టించే ప్రకటనలను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటుంది. కొందరు సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన హెల్త్ ప్రొడక్ట్ యాడ్స్‌పై ASCI ఆంక్షలు కూడా విధించింది. మరికొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన ఉత్పత్తులు నాణ్యత లేకపోవడం లేదా మోసపూరితంగా ఉండటం వల్ల వినియోగదారులు కోర్టుల్లో కేసులు వేసిన సందర్భాలూ ఉన్నాయి. సో మ్యాటర్ ఏంటంటే.. సెలబ్రిటీలు తమ ఛరిష్మాతో లక్షల మందిని ప్రభావితం చేస్తారని, అలాంటప్పుడు వారు ప్రమోట్ చేసే ఉత్పత్తుల గురించి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. కొందరు సెలబ్రిటీలు, వివాదాల్లో ఇరుక్కున్న తర్వాత భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటామని ప్రకటించారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×