Maha Kumbh Mela: మహా కుంభమేళాలో అరుదైన ఘటన జరిగింది. 27 ఏళ్లుగా ఓ మహిళ తన భర్త కోసం గాలిస్తోంది. అయితే మహా కుంభమేళాకు వచ్చిన ఆ మహిళకు భర్త ఎదురుపడ్డారు. అప్పుడు ఏం జరిగిందంటే..
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే, సకల పాపాలు తొలగుతాయన్నది భక్తుల విశ్వాసం.అందుకే దేశ, విదేశాల నుండి భక్తులు పెద్ద ఎత్తున కుంభమేళాకు తరలివస్తున్నారు. అలాగే నాగ సాధువులు, అఘోరాలు రాగా.. కుంభమేళాలో భక్తితత్వం వర్ధిల్లుతోంది. అయితే ఓ మహిళ తన భర్తకు దూరమై 27 ఏళ్లుగా తన పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ జీవనం సాగిస్తోంది. మహా కుంభమేళాకు ఆ మహిళ రాగా, అక్కడే తన భర్తను గుర్తించింది.
ఝార్ఖండ్ కు చెందిన గంగాసాగర్ కు భార్య ధన్వాదేవి, ఇద్దరు సంతానం. అయితే 1998లో భార్య పిల్లలను వదిలి గంగాసాగర్ వెళ్లిపోయారు. అప్పటినుండి తన భర్త కోసం ధన్వాదేవి గాలింపు చర్యలు చేపడుతూనే ఉంది. కుంభమేళాకు ధన్వాదేవి రాగా, ఒక్కసారిగా భర్త గంగాసాగర్ ఎదురుపడ్డారు. 27 ఏళ్ల అనంతరం భర్తను చూసిన ఆమె ఆనందంతో కన్నీళ్లు నేల రాల్చింది. భర్త అఘోరాగా మారినట్లు గుర్తించిన ధన్వాదేవి, తమతో పాటు రావాలని భర్తను వేడుకుంది.
తాను ప్రస్తుతం భక్తితత్వంలో లీనమై ఉన్నట్లు తెలిపిన గంగాసాగర్, భార్యతో పాటు వెళ్లేందుకు నిరాకరించారు. అయితే 27 ఏళ్ల తర్వాత తన భర్త జీవించి ఉన్నట్లు తెలుసుకున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని, భర్త కోసం తాను చూసిన ఎదురుచూపులకు ఆ భగవంతుడే దారి చూపినట్లు ధన్వా దేవి తెలిపారు. ఏది ఏమైనా 27 ఏళ్ల తర్వాత మహా కుంభమేళాలో గంగా సాగర్ ను కళ్లారా చూసే అదృష్టం దక్కిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.