పాకిస్తాన్ కి గూఢచర్యం చేస్తూ ఉగ్రవాదులకు సమాచారం చేరవేస్తూ.. చివరకు కటకటాల వెనక్కు వెళ్లిన జ్యోతి మల్హోత్రా వీడియోలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. జ్యోతి కేవలం ఇండియాలోనే కాదు.. విదేశాలకు వెళ్లి కూడా ట్రావెల్ వ్లాగ్ లో వీడియోలు పోస్ట్ చేసేది. ఈ క్రమంలో ఆమె గతేడాది చైనాను సందర్శించింది. చైనా సందర్శన సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన వీడియోలు అప్పట్లో తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఆమె ప్రవర్తన అసభ్యకరంగా ఉందంటూ చైనీయులు కామెంట్లు పెట్టారు. ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జ్యోతి మల్హోత్రా గతేడాది చైనాను సందర్శించారు. బహిరంగ ప్రదేశాల్లో వీడియోలు తీస్తూ, రవాణా సాధనాల్లో జనంతో కలసి ప్రయాణిస్తూ, వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ ఆమె వీడియోలు తీసుకున్నారు. అయితే ఆ వీడియోల్లో ఆమె చాలా చీప్ గా ప్రవర్తించినట్టు స్థానికులు విమర్శించారు. ఆమె ప్రవర్తన అసభ్యంగా ఉందని.. ఆమె పోస్ట్ చేసిన వీడియోలకు కామెంట్లు పెట్టారు. చైనాలో స్థానికులు పాటించే నిబంధనలను ఆమె ఉల్లంఘించారు. షాంఘై నుండి బీజింగ్‌కు వెళ్లే హైస్పీడ్ రైలులో విండో సీటు గురించి మాట్లాడుతూ.. అక్కడ కూర్చుని ఉన్న ఒక వ్యక్తిని పైకి లేవాలని కోరారు. దీనికి అతడు అభ్యంతరం తెలపగా అకారణంగా అతడిపై కోప్పడ్డారు జ్యోతి.
మరొక సందర్భంలో జ్యోతి మల్హోత్రా స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను ఇబ్బంది పెట్టారు. సదరు మహిళ ఓవైపు వెళ్తుండగా, స్కూటీ ఆపి రివర్స్ లో వెళ్లాలని కోరారు. జ్యోతి మల్హోత్రా మాటలు అర్థంకాని ఆ మహిళ ఇబ్బంది పడ్డారు. తర్వాత పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేశారు. మాండరిన్ భాషను కూడా ఎగతాళి చేస్తూ జ్యోతి వీడియోలు చేశారు. అయితే ఆ వీడియోలను చైనీయులు తీవ్రంగా విమర్శించారు. బస్సులో ఎక్కి టికెట్ లేకుండా ప్రయాణించడం, టికెట్ అడిగిన డ్రైవర్ తో వాదనకు దిగడం.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. అంతే కాదు.. చైనా వారిని బాడీషేమింగ్ చేస్తూ కూడా జ్యోతి వీడియోలు పోస్ట్ చేశారు. వారు వాడుతున్న ఫోన్లను కూడా కామెంట్ చేసేవారు. చైనా ఫోన్లు చీప్ గా ఉంటాయని కూడా విమర్శించారు. దీంతో ఆమె వీడియోలకు చైనాకు చెందిన చాలామంది నెగెటివ్ కామెంట్లు పెట్టారు. ఆమె ప్రవర్తన సరిగా లేదని అన్నారు.
చైనా వీడియోలకు పూర్తిగా నెగెటివ్ కామెంట్లు రావడంతో ఆ తర్వాత జ్యోతి మల్హోత్రా నష్టనివారణ చర్యలు చేపట్టారు. తనను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ మరో వీడియో పోస్ట్ చేశారు. తాను ఆసియా ఖండంలో చాలా దేశాలు చూశానని, అందరూ తనని ఆదరించారని, అభిమానించారని, కానీ చైనాలో మాత్రం భాష అర్థం కాక ఇబ్బందులు పడ్డానని, బహుశా అందుకే వారు తనని అర్థం చేసుకోలేకపోయి ఉంటారని అన్నారు. మరోసారి చైనాను సందర్శించినప్పుడు కమ్యూనికేషన్ విషయంలో పొరపాట్లు లేకుండా చూసుకుంటానన్నారు జ్యోతి. కానీ నెటిజన్లు ఆమెను క్షమించలేదు. చైనా విషయంలో ఆమె ప్రవర్తన తప్పుగానే ఉందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.