LiveIn Relation Supreme Court| సుదీర్ఘకాలం పాటు ఒక పురుషుడితో సహజీవనం చేసి.. ఆ తర్వాత అతను పెళ్లి పేరుతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడని మహిళలు చేసే ఆరోపణలు.. వారు దాఖలు చేసే అత్యాచార కేసులు చెల్లవని సుప్రీంకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ఇలాంటి సందర్భాలలో.. పెళ్లి చేసుకుంటాననే హామీతో మాత్రమే వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని కచ్చితంగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
లివ్-ఇన్ పార్టనర్ అత్యాచారం చేశాడని దాఖలైన కేసులో బ్యాంకు అధికారిపై క్రిమినల్ చర్యలను రద్దు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహం చేసుకుంటానని చెప్పడంతోనే అతనితో 16 సంవత్సరాలుగా శారీరక సంబంధం ఏర్పరచుకున్నానని ఆరోపించిన మహిళా లెక్చరర్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.
“ఇద్దరు వ్యక్తులు బాగా చదువుకున్నారని, ఇష్టపూర్వకంగా ఏకాభిప్రాయ సంబంధాన్ని కొనసాగించారని, వేర్వేరు పట్టణాల్లో నివసిస్తున్నప్పటికీ తరచుగా ఒకరి ఇళ్లను ఒకరు సందర్శించేవారని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసును లవ్ ఫెయిల్యూర్ లేదా లివింగ్-ఇన్ బ్రేకప్‌గా కోర్టు పరిగణించింది. 16 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు సన్నిహిత సంబంధం కొనసాగినందున, వారి మధ్య 16 సంవత్సరాల పాటు లైంగిక సంబంధాలు నిరంతరాయంగా కొనసాగాయి. వారి బంధంలో నిందితుడు ఎప్పుడూ బలవంతం లేదా పెళ్లి పేరుతో మోసం చేశాడని భావిచలేం.
Also Read: జీతం పెంచాలంటే పరీక్షలో పాస్ కావాలి.. ఐటి కంపెనీ కండీషన్!
ఎందుకంటే దాదాపు 16 ఏళ్లుగా వారు కలిసి ఉన్నారు. ఇన్నేళ్ల పాటు అతను కేవలం పెళ్లి చేసుకుంటాననే నమ్మిస్తూ ఆమెను లైంగికంగా అనుభవించాడని కచ్చితంగా చెప్పలేం. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడి ఉంటుంది”, అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని భావించినప్పటికీ, కేవలం పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే ఇన్నేళ్లు ఆమె, అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకుందని భావించడం సరికాదని కోర్టు పేర్కొంది. బంధం ఎక్కువ కాలం కొనసాగినప్పుడు అటువంటి వాదనలు విశ్వసనీయతను కోల్పోతాయని కోర్టు అభిప్రాయపడింది.
ఇటీవల కేరళ హైకోర్టు కూడా ఇలాంటిదే ఒక తీర్పు చెప్పింది. తప్పుడు లైంగిక ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించే మహిళలపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి తప్పుడు కేసులు పెట్టేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హైకోర్టు హెచ్చరించింది. ఫిర్యాదుదారులు చేస్తున్న ఆరోపణ అబద్ధమని తేలితే వారిపై చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. బదరుద్దీన్ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళలు దాఖలు చేస్తున్న లైంగిక వేధింపుల ఫిర్యాదులన్నీ నూరు శాతం నిజమైనవి కావని, అందుకే ఇటువంటి ఫిర్యాదులపై వివరణాత్మక దర్యాప్తు అవసరమని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇటువంటి తప్పుడు ఫిర్యాదులు స్వీకరిస్తే.. సంబంధిత అధికారులే కాదు.. విచారణ చేపట్టే న్యాయస్థానాలు కూడా చిక్కుల్లో పడతాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్ (Anticipatory bail) మంజూరు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
కొందరు మహిళలు చేసే ఫిర్యాదులు అబద్ధమని తెలిసినా, వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసు అధికారులు తటపటాయిస్తుంటారని, అటువంటి సందర్భాల్లో పోలీసులు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అధికారుల తీసుకున్న నిర్ణయాలు సరైనవే అయితే వారి ప్రయోజనాలను కోర్టు కాపాడుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. తప్పుడు ఫిర్యాదులతో బాధితులపై చర్యల తీసుకుంటే దాని వల్ల కలిగే నష్టాన్ని ఏ విధంగానూ తీర్చలేమని, అందుకే పోలీసులు విచారణ దశలోనే నిజానిజాలను నిర్థారించుకోవాలని హైకోర్టు సూచించింది.