EX CM SM Krishna: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి ఎస్‌ఎం కృష్ణ ఇక లేరు. ఆయన వయస్సు 92 ఏళ్లు. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
మైసూర్‌లోని మహారాజా కళాశాలలో ఎస్ఎం కృష్ణ పట్టభద్రుడయ్యారు. బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో చదివారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో గుర్తింపు పొందారాయన. 1971- 2014 వరకు, అతను వివిధ సమయాల్లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యునిగా సేవలందించారు. డిసెంబర్ 1989 నుండి జనవరి 1993 వరకు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పని చేశారు.
ఆ తర్వాత ఎస్ఎం కృష్ణ 1999- 2004 వరకు కర్ణాటక 16వ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన హయాంలో ఐటీ ఇండస్ట్రీలో అభివృద్ధిలోకి వచ్చింది. ఆ తర్వాత 2004-2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా, కేంద్ర విదేశాంగ మంత్రిగా పని చేసిన అనుభవం ఆయన సొంతం.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రావడం, కర్ణాటకలో మారిన పరిస్థితుల నేపథ్యంలో 2017 మార్చిలో బీజేపీలో చేరారు. చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో చేరినప్పుడు బహిరంగంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కర్ణాటక అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అన్నీఇన్నీ కావు.