Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యల్లాపూర్ దగ్గర ఘాట్‌రోడ్‌లో లారీ బోల్తా పడింది. 10 మంది మృతి చెందగా, మరో 15 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో లారీలో 25 మంది ఉన్నారు. కూరగాయలు అమ్మేందుకు వారంతా సవనూర్ నుంచి కుంత మార్కెట్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే లారీ ఘాట్ సెక్షన్‌కు ఎంటరయ్యే సరికి ఒక్కసారిగా బోల్తా పడింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపూర్ తాలూకాలోని గుల్లాపుర ఘట్ట జాతీయ రహదారిపై కూరగాయల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సావనూర్ నుంచి యల్లాపూర్ వెళుతుండగా ట్రక్కు ప్రమాదావశాత్తు 50 మీటర్ల లోయలో పడింది. ఈ ఘటనలో సుమారు 15 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుబ్బళ్లి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: వీడి క్రూరత్వం ఎవరూ ఊహించలేదు.. కడుపులోని బిడ్డ బయటకి వచ్చేలా హత్య..
ఇదిలా ఉంటే.. కర్నూరు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో విషాదం చోటు చేసుకుంది. వేద పాఠశాల విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కర్నాటకలోని హంపీలో జరిగే ఆరాధన ఉత్సవాలకు వెళ్లి వస్తున్న విద్యార్థుల తుఫాన్ వాహనం టైర్ ఊడిపోవడంతో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు సహా డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హామీ ఇచ్చారు. మృతి చెందిన వారు ఏపీలోని కర్నూలుకు చెందిన వారు.