Pakistan IMF Loan| ప్రపంచ బ్యాంకు.. పాకిస్తాన్‌కు బిలియన్ డాలర్ల రుణం ఆమోదించడాన్ని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి రుణాల ద్వారా వచ్చే నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ వినియోగిస్తోందని ఎంత చెప్పినా ప్రపంచ బ్యాంకు పట్టించుకోకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇండియాతో యుద్ధం జరుగుతున్న వేళ పాకిస్తాన్ కు తాజాగా వంద కోట్ల రుణం మంజూరు చేయడంతో ఆయన ప్రపంచ బ్యాంకుపై విమర్శలు చేశారు. ప్రపంచ దేశాలు యుద్ధాలు ఆగాలని చెబుతుంటాయి.. కానీ వారి చర్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి.. ఇలా అయితే యుద్ధాలు ఎలా ఆగుతాయి? అని సిఎం అబ్దుల్లా ప్రశ్నించారు.
దీనికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో ఆయన ఒక పోస్ట్ చేశారు. “నాకు అర్థం కావడం లేదు. అంతర్జాతీయ సమాజం (ప్రపంచ దేశాలు) యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటాయి. కానీ ఐఎంఎఫ్ మాత్రం పాకిస్తాన్ కు భారీ రుణం మంజూరు చేస్తుంది. ఆ నిధులతో ఆయుధాలు, బాంబులు కొని కశ్మీర్ లోని పూంచ్, రాజోరి, యురి, తంగ్ధార్ లాంటి చాలా ప్రదేశాల్లో పాకిస్తాన్ విధ్యంసం సృష్టిస్తోంది.” అని ఆయన తన పోస్ట్ లో రాశారు.
రుణం ఎలా ఆమోదించారు?
అంతకుముందు పాకిస్తాన్‌కు ప్రపంచ బ్యాంకు (ఐఎంఎఫ్) 100 కోట్ల డాలర్ల రుణాన్ని మంజూరు చేసినట్లు ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఈ రుణాన్ని ఆమోదించినట్టు తెలిపింది. ఇది మొత్తం 700 కోట్ల డాలర్ల విలువగల ఐఎంఎఫ్ రుణ ప్యాకేజీలో భాగంగా ఉంటుంది. ఈ రుణాన్ని మూడు సంవత్సరాల వ్యవధిలో విడతలుగా ఇవ్వడానికి ఐఎంఎఫ్ గత సంవత్సరం జూలైలో అంగీకరించింది.
ఈ రుణాన్ని ఏడేళ్ల వాయిదాలుగా విడతలుగా విడుదల చేయాలని నిర్ణయించి.. ప్రతి ఆరు నెలలకోసారి రుణ వినియోగాన్ని సమీక్షిస్తామని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. తొలి విడతగా ఇప్పటికే 100 కోట్ల డాలర్లను పాకిస్తాన్‌కు మంజూరు చేసింది. అయితే, ఈ రుణంపై భారత ప్రభుత్వం ప్రారంభం నుంచే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది.
భారత్ వాదన
భారత్ ప్రకారం.. పాక్ ఈ నిధులను ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించే అవకాశం ఉంది. దీని ఫలితంగా.. ఇది కేవలం భారత్‌కే కాకుండా అంతర్జాతీయ సమాజానికే పెద్ద ముప్పుగా మారే అవకాశముందని భారత ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అందుకే, పాకిస్తాన్‌కు అందించే రుణ సహాయాన్ని పూర్తిగా నిలిపివేయాలని భారత్ ఐఎంఎఫ్‌ను కోరుతూ వచ్చింది.
పాకిస్తాన్‌కు 100 కోట్ల డాలర్ల విడుదల ప్రతిపాదనపై శుక్రవారం జరిగిన ఐఎంఎఫ్ బోర్డు సమావేశంలో భారత్ వ్యతిరేకించింది. అయితే, ఈ అంశంపై జరిగిన ఓటింగ్‌లో ప్రపంచ దేశాలు పాకిస్తాన్‌కు రుణం మంజూరు చేయాలని ఓట్ చేయగా..
భారత దేశం మాత్రం ఓటింగ్‌లో పాల్గొనకుండా బాయ్ కాట్ చేసింది. భారత ప్రభుత్వం తీసకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది.
‘‘పాకిస్తాన్‌పై ఉక్కుపాదం మోపుతున్నామంటూ ప్రకటించే మోదీ ప్రభుత్వం ఈ ఓటింగ్‌కు ఎందుకు దూరంగా ఉండిపోయింది? అలా కాకుండా వ్యతిరేకంగా ఓటేస్తే భారత్ వైఖరిని అంతర్జాతీయ వేదికపై బలంగా తెలియజేయగలిగిన విధంగా ఉండేది’’ అంటూ కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది.
ఇటీవల దివాలా స్థితిలోకి చేరిన పాకిస్తాన్‌కు చైనా, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలు, అలాగే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు ఆర్థికంగా సహాయం చేస్తూ వస్తున్నాయి. 2024 నాటికి పాకిస్తాన్ విదేశీ రుణ భారం 130 బిలియన్ డాలర్లను అధిగమించినట్లు సమాచారం.