Home Tips For Period Pain: సాధారణంగా పీరియడ్స్ అంటేనే కొందరు మహిళలు భయపడుతూ ఉంటారు! ఆ సమయంలో వచ్చే నొప్పి, రక్తస్రావం, చికాకు, ఇతర సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరికి భరించలేనంతగా నొప్పి వస్తూ ఉంటుంది. దీంతో బాగా నీరసించిపోతారు. ఎటువంటి పనులు కూడా సరిగ్గా చేయలేక పోతుంటారు. అయితే వీటి నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. అవేంటో తెలుసుకుందాం.
8 గంటల నిద్ర అవసరం
పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎనిమిది గంటల నిద్రపోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు. “నెలసరి సమయంలో తక్కువగా నిద్రపోవడం వల్ల మరింత నొప్పికి కారణం కావొచ్చు. ఎనిమిది గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాల్సిందే” అని స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు కెల్లీ రాయ్ తెలిపారు.
పీచు పదార్థాలను తక్కువగా తీసుకోండి
పీరియడ్స్ సమయంలో పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు కాస్త దూరంగా ఉండాలని నిపుణులు తెలిపారు. పీరియడ్స్ సమయంలో పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉబ్బరం పెరుగుతుందని చెప్పారు. సారా ట్యోగుడ్ అనే వైద్యురాలు చేపట్టిన అధ్యయనంలో నెలసరి సమయంలో పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవటమే మంచిదని తేలింది.
రోజుకు 8-10 గ్లాసుల త్రాగునీరు
పీరియడ్స్ సమయంలో రోజుకు 8-10 గ్లాసుల మంచినీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. తక్కువ మోతాదులో నీరు తీసుకోవడం వల్ల మూత్రవిసర్జన చేసేటప్పుడు మంట, తలనొప్పి ఎక్కువగా వస్తుందని నిపుణులు తెలిపారు. డీహైడ్రేషన్ వల్ల అలసటగా ఉన్నట్లు అనిపిస్తుందని.. అందుకే రోజూ తగిన మోతాదులో నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఒత్తిడి నుంచి విముక్తి
పీరియడ్స్ సమయంలో మహిళలు ఒత్తిడికి గురవ్వడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఒత్తిడి గురైనా.. యోగా, ధ్యానం చేసి అందులో నుంచి బయటపడాలని సూచిస్తున్నారు. చిరాకు తక్కువయ్యేలా చేయడానికి కూడా ఇది ఒక మంచి మార్గం. డీప్ బ్రీతింగ్ వ్యాయామం చేయటం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. రోజుకు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని లోతుగా ఊపిరి తీసుకోవటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
Also Read: జుట్టుకు రంగు వేస్తున్నారా? అయితే మీకు క్యాన్సర్ వచ్చినట్టే..
హెర్బల్ టీ
సహజంగా చేసిన టీలు తాగండి. పుదీనా, చామంతి లాంటి మంచి వాసన ఉండే టీలు కండరాలను ఫ్రీగా ఉంచుతాయి. వాటిలో ఉండే నొప్పిని తగ్గించే గుణాలు నొప్పిని తగ్గిస్తాయి. రోజుకు రెండు సార్లు ఈ టీ తాగితే మనసుకు కూడా హాయిగా ఉంటుంది. మెగ్నీషియం ఉండే ఫుడ్ తినండి. మెగ్నీషియం అనే పోషకం కండరాలు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. పాలకూర, బాదం, మంచి కొవ్వులున్న గింజల్లో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఒంట్లోని వాపును తగ్గించడంతో పాటు బలాన్ని ఇస్తాయి.
సరైనా ఆహారం
క్యారెట్, బెర్రీలు, టొమాటోలు, ఆకుపచ్చ కూరగాయలు వంటివి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో సమృద్ధిగా ఉంటాయి. ఈ పదార్థాలు తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే అసౌకర్యాలు తగ్గుతాయి. శరీరం తేలికగా ఉండటంతో పాటు చిరాకు కూడా తగ్గుతుంది.