India Pakistan War : కిరానా కొండలు. ఈ పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఆ పేరు ఎత్తగానే పాకిస్తాన్ ఉలిక్కిపడుతోంది. అమెరికా అలర్ట్ అవుతోంది. ఇండియా వ్యూహాత్మక నవ్వు నవ్వుతోంది. ఇంతకీ కిరానా కొండలపై ఎందుకంత చర్చ? అక్కడ అసలేం జరిగింది? అనేది ఇంట్రెస్టింగ్.
కిరానా హిల్స్ మిస్టరీ
పాకిస్తాన్‌లోని సర్గోధా సిటీ సమీపంలో ఉన్నాయి కిరానా కొండలు. దాదాపు 100 చదరపు మైళ్ల విస్తీర్ణం. వీటిని స్థానికంగా నల్ల పర్వతాలు అని కూడా పిలుస్తారు. కీలకమైన ముషఫ్ వైమానిక దళ స్థావరం సమీపంలో.. ఖుషబ్ అణు కేంద్రం నుంచి 75 కి.మీ. దూరంలో ఉన్నాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతాన్ని చాలా కాలంగా రహస్యంగా ఉంచిందంటే అదెంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఇండియా పాకిస్తాన్ యుద్ధంతో ఈ కిరానా కొండలు సడెన్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.
అక్కడ దాడి జరిగిందా?
పహల్గాం ఉగ్రదాడికి రివేంజ్‌గా.. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అనేక ఉగ్ర స్థావరాలు, సైనిక కేంద్రాలపై అటాక్ చేసింది. అందులో భాగంగా సర్గోధ వైమానిక స్థావరంపై కూడా క్షిపణులతో దాడి చేసింది. ఆ స్థావరానికి కేవలం 20 కి.మీ. దూరంలోనే ఉన్నాయి కిరానా కొండలు. అందుకే ఇప్పడింత ఉలిక్కిపాటు.
ఆ కొండల్లో ఆటంబాంబులు దాచారా?
కిరానా కొండల భూగర్భంలో పాకిస్తాన్ అణ్వాయుధాలను నిల్వ ఉంచిందని అంటారు. అది పాక్ ప్రముఖ అణ్వస్త్ర కేంద్రమని చెబుతారు. అయితే ఈ విషయం తమకు తెలీదని భారత ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు. పాకిస్తాన్ తన అణ్వాయుధాలను కిరానా హిల్స్ కింద నిల్వ చేస్తుందని చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ కాస్త సెటైరికల్‌గా ఆయన మాట్లాడటంతో అనుమానం మరింత పెరుగుతోంది. తాము కిరానా హిల్స్‌పై దాడి చేయలేదని చెప్పారు. పాక్ అణు స్థావరాన్ని తాము లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో మాత్రం కిరానా కొండలపై అటాక్ జరిగిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
అణు పరీక్షలు అక్కడే..
1980లలో పాకిస్తాన్ కిరానా-1 అని పిలవబడే సబ్‌క్రిటికల్ అణు పరీక్షలు ఆ కొండల భూగర్భ సొరంగాలలో నిర్వహించినట్టు తెలుస్తోంది. ఖుషాబ్ అణు రియాక్టర్‌తో సహా సున్నితమైన సైనిక స్థావరాలు అందుకే కిరానా హిల్స్‌కు సమీపంలో ఉన్నాయని అంటారు. కిరానా కొండ కిందనే పాక్ తన అణ్వాస్త్రాలను నిల్వ చేసిందని చాలాకాలంగా పుకార్లు ఉన్నాయి. భారత వైమానిక దాడుల తర్వాత.. లేటెస్ట్‌గా ఆ ప్రాంతంలో చిన్నపాటి భూకంపం కూడా రావడం ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది.
ట్రెండింగ్‌లో కిరానా హిల్స్
కిరానా హిల్స్ సమీపంలో ఆర్మీ కార్యకలాపాలు జరుగుతున్నట్టు కొన్ని శాటిలైట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాకు చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఒకటి ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టాయని కూడా అంటున్నారు. అణు లీకేజీని గుర్తించే B-350 AMS ఎయిర్‌క్రాఫ్ట్ కిరానా కొండల ప్రాంతంలో రేడియేషన్ లీక్ ఆనవాళ్లను అంచనా వేసే ప్రయత్నం చేసిందంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తుండటంతో.. కిరానా హిల్స్ బ్యాక్‌గ్రౌండ్, అండర్ గ్రౌండ్‌పై నెటిజన్లలో తీవ్ర ఆసక్తి పెరిగింది. కిరానా హిల్స్ ట్రెండింగ్‌గా మారింది.
Also Read : ఆ గన్స్ మాకివ్వండి.. పాక్ సంగతి తేలుస్తాం..