Kolkata Doctor Rape Case(Today news paper telugu): పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో నిందితుడు అన్ని బిల్డింగ్‌లలో తరుచూ తిరుగుతూ ఉండేవాడని పోలీసుల విచారణలో తేలింది.
నిందితుడు సంజయ్ రాయ్ కలకత్తా పోలీసులతో కలిసి పౌర వాలవటీర్‌గా పని చేస్తున్నాడు. 2019లో కలకత్తా పోలీసులు డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్‌లో సంజయ్ వాలంటీర్‌గా చేరాడు. ఆ తర్వాత పోలీసు సంక్షేమ విభాగానికి మారాడు. అనంతరం ఆర్జీ కర్ మెడికల్ హాస్పిటల్‌లోని పోలీసు అవుట్ పోస్టుకు మారాడు. అక్కడ క్యాంపస్‌లోని అన్ని బిల్డింగ్‌లలోకి అతడికి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది.
కలకత్తా ఆర్జీ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ హత్య శుక్రవారం జరగగా అర్థ రాత్రి సమయంలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్థారణ అయింది. నిందితుడు సంజయ్ రాయ్ ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడికి ఆగస్టు 23 వరకు కస్టడీ విధించారు.
మొదట హత్య.. ఆ తర్వాత అత్యాచారం..
ప్రాథమిక పోస్టుమార్టం ప్రకారం బాధితురాలి కళ్లు, నోరు, అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం అయినట్లు తెలుస్తోంది. ఇతర భాగాల్లో కూడా గాయాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వైద్యురాలిని మొదట హత్య చేసి ఆ తర్వాత నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టినట్లు తెలిపారు.
ఉరి తీయాలనుకుంటే తీసుకోండి..
నిందితుడు సంజయ్ పోలీసుల దర్యాప్తులో ఎటువంటి పశ్చాత్తాపం లేకపోగా తనను ఉరి తీయాలని అనుకుంటే తీసుకోవాలంటూ ఎదురు చెప్పినట్లు తెలుస్తోంది. అతడి ఫోన్ నిండా అశ్లీల వీడియోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడికి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు అవగా.. ముగ్గురు భార్యలు అతడి నుంచి విడాకులు తీసుకున్నారు. నాలుగవ భార్య ఇటీవల మరణించింది.