Koonamneni Sambasiva Rao: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం దేశంలోను, రాష్ట్రంలోనూ నెలకొన్న వివిధ రాజకీయ, సామాజిక, రైతు సమస్యలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యంపై దాడి.. ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం
కేంద్రంలోని ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉండటానికి కుట్ర చేస్తోందని కూనంనేని ఆరోపించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామక నిబంధనలను మార్చి, సీఈసీని ఎవరూ ప్రశ్నించకుండా చేశారని మండిపడ్డారు. నోటీసులు కూడా ఇవ్వకుండా వేల సంఖ్యలో ఓట్లు తొలగించారని, సుప్రీంకోర్టు తీర్పుల స్ఫూర్తికి ఇది విరుద్ధమని స్పష్టం చేశారు. దీనిపై నిరసన తెలిపే వారిని, జెన్-జీ ఆందోళనలను ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించకుండా అణచివేస్తున్నారని విమర్శించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే తొలగించి, తొలగించిన ఓట్లపై పూర్తిస్థాయి విచారణ జరిపి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కరువు.. నష్టపోయిన రైతాంగం
రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం నమోదు కావడంతో కరువు విలయతాండవం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వరి వేయవద్దని, విత్తనాలు అమ్మకుండా నిరోధించడమే తప్ప, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టలేదని విమర్శించారు. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఎలా సహాయం చేస్తుందో స్పష్టత ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పనులు మందగించడంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్రం నుంచి రావాల్సిన కరువు నిధులను రాబట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
ప్రజలపై భారాలు
కరెంట్ ట్రూఅప్ చార్జీలు పెంచి సామాన్యులపై భారాలు మోపడం సరికాదని కూనంనేని హితవు పలికారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్ చార్జీలను సగానికి పైగా తగ్గించి సామాన్యులకు ఉపశమనం కలిగించాలన్నారు. ఇక రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ నమోదు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని, పార్టీ కేడర్ రంగంలోకి దిగిందని తెలిపారు. గత 75 ఏళ్లుగా కార్మిక వర్గం ఎర్రజెండా వైపే ఉందని, రాబోయే రోజుల్లోనూ అదే మద్దతు కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: ఏం పీక్కుంటారు అన్న కేటీఆర్ ఇప్పుడు గడగడ వణికిపోతున్నాడు!- ఆది శ్రీనివాస్