Mahindra Thar Roxx Update: మహీంద్రా థార్ రాక్స్ త్వరలో కొత్త అప్‌డేట్‌తో మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే థార్ ఓజీలో పరిచయం చేసిన అధునాతన రియర్ సస్పెన్షన్ టెక్నాలజీని ఇప్పుడు థార్ రాక్స్ లోనూ అందించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్పై షాట్స్ లో ఈ SUV కొత్త సస్పెన్షన్ సెటప్‌తో కనిపించడం ఈ అంచనాలకు బలం చేకూరుస్తోంది. అయితే, ఈ అప్‌డేట్‌పై మహీంద్రా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మహీంద్రా ఇటీవల థార్ ఓజీని కొత్త ప్లాట్‌ఫామ్, అదనపు ఫీచర్లు, మెరుగైన హార్డ్ వేర్‌తో పరిచయం చేసింది. ఇందులో ముఖ్యంగా వెనుక యాక్సిల్ కోసం తీసుకొచ్చిన సస్పెన్షన్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాట్స్ లింకేజ్ తో కూడిన పెంటాలింక్ సస్పెన్షన్, ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపింగ్ (FDD) టెక్నాలజీ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఇదే తరహా అప్‌డేట్ థార్ రాక్స్‌కు కూడా అందే అవకాశం ఉంది. తాజాగా కనిపించిన టెస్ట్ వాహనంలో వెనుక డిఫరెన్షియల్ దగ్గర రెండు రాడ్లు కనిపించాయి. ఇవి వాట్స్ లింకేజ్ సెటప్‌ను పోలి ఉండటంతో కొత్త సస్పెన్షన్‌ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం థార్ రాక్స్ బాడీ ఆన్ ఫ్రేమ్ SUV అయినప్పటికీ, మంచి రైడ్ క్వాలిటీని అందించే వాహనంగా గుర్తింపు పొందింది. కొత్త సస్పెన్షన్ అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా రోడ్లపై గుంతలు, ఎగుడుదిగుడులు ఉన్నప్పుడు కుదుపులు తగ్గడం, హైవేలపై ప్రయాణం మరింత స్మూత్‌గా ఉండనుంది. అయితే, వాస్తవంగా ఎంతవరకు మెరుగుదల ఉంటుందనేది అధికారిక వివరాలు, డ్రైవింగ్ టెస్టుల తర్వాతే వెల్లడికానుంది.
2024లో విడుదలైన మహీంద్రా థార్ రాక్స్ తన బాక్సీ డిజైన్‌తో SUV ప్రియులను ఆకట్టుకుంది. రౌండ్ హెడ్ ల్యాంప్స్, సిక్స్ స్లాట్ గ్రిల్, మందపాటి వీల్ ఆర్చ్ క్లాడింగ్, రూఫ్ రైల్స్, వెనుక స్పేర్ వీల్ ఈ మోడల్ ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. ఇంటీరియర్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS, ఆరు ఎయిర్ బ్యాగ్స్, ESC లాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
థార్ రాక్స్ లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. వీటికి 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లు అందుబాటులో ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి రియర్ వీల్ డ్రైవ్, ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లు లభిస్తాయి. ప్రస్తుతం థార్ రాక్స్ ఎక్స్ షోరూమ్ ధర రూ.12.52 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మారుతి జిమ్నీ, ఫోర్స్ గుర్ఖా, మహీంద్రా థార్ ఓజీ ఈ మోడల్ తో పోటీ పడుతున్నాయి.
Read Also: హ్యుందాయ్ బేయాన్ వచ్చేస్తోంది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!