CM Chandrababu: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వారం పూర్తి స్థాయి బడ్జెట్ ను పెట్టారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సారి భారీగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అభివృద్ధి, సంక్షేమానికి ఈక్వువల్ ప్రియారిటీ ఇచ్చారు. రిలయన్స్ సంస్థతో ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. 65 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నామినేటెడ్ పదవులు పొందిన వారు ప్రజల కోసం పని చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం సూచించారు. గత శనివారం రెండో జాబితాలో భాగంగా 62 మందికి నామినేటెట్ పదవులను ఇచ్చారు. 30వేల దరఖాస్తులను పరిశీలించి సుదీర్ఘ కసరత్తు తర్వాత రెండోవిడత జాబితాను రూపొందించామని ఆయన చెప్పారు. కష్టపడినవారికి న్యాయం చేయాలనే ప్రాతిపదికన ఎంపిక చేశామన్నారు. కేసులు, దాడులు, వేధింపులకు గురైన వారిని గుర్తుపెట్టుకొని గౌరవించామని తెలిపారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా నిలబడి పోరాటం చేసిన వారికి, మహిళలు, యువతకు అవకాశం కల్పించామని చెప్పారు.
10-11-2024 (రూ.2,94,427.25 కోట్లతో పూర్తి బడ్జెట్)
సోమవారం ఏపీ అసెంబ్లీలో పూర్తి స్తాయి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.2,94,427.25 కోట్ల బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీర్చిదిద్దారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా పయ్యావుల బడ్జెట్ ను రూపొందించారు. అభివృద్ధి, సంక్షేమానికి సమానా ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం ఏపీకి 2 కళ్లులా ఉన్న పోలవరం, అమరావతికి బడ్జెట్ లో కేటాయింపులు చేశారు.
11-11-2024 (అమరావతి, పోలవరంపై స్పెషల్ ఫోకస్)
రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు రుణాలు ఇవ్వనున్నాయి. ఆ నిధుల వినియోగానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపుతూనే.. మరోవైపు రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ప్రోత్సాహకాల కోసం 3వేల 445 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 5వేల 445 కోట్లు ఈ బడ్జెట్‌లో పెట్టారు. దీంతో పాటు.. సంపద సృష్టించేందుకు పలు ప్రభుత్వ శాఖలకు 32వేల 712 కోట్ల రూపాయలు కేటాయించారు.
11-11-2024 (సంక్షేమ పథకాలకు పెద్దపీట)
అమరావతి, పోలవరం, అభివృద్ధి కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తూనే సంక్షేమ పథకాలకు కూడా ప్రభుత్వం పెద్ద పీట వేసింది. తల్లికి వందనం పథకానికి 6,487 కోట్లు, అన్నదాతా సుఖీభవ పథకానికి వెయ్యి కోట్లు, మహిళా నిధి కోసం 3వేల 341 కోట్లు బడ్జెట్‌లో పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ పథకాలకు, వారికి సంబంధించిన మౌలిక సౌకర్యాల కల్పనకు 69వేల 437 కోట్లు కేటాయించింది. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కోసం 12 వందల 50 కోట్లు ఇచ్చింది. పేదల గృహ నిర్మాణానికి 4వేల 12 కోట్ల నిధులు చూపింది. వీటితో పాటు పౌరసరఫరాల శాఖకు ప్రత్యేకంగా 3వేల 690 కోట్ల రూపాయలు కేటాయించారు.
11-11-2024 (ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్)
పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రవేశపెట్టగా.. వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టారు. వ్యవసాయం దాని అనుబంధ శాఖలకు 43 వేల 402.33 కోట్లు కేటాంపులు జరిపారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని అచ్చెన్న అన్నారు. 11 ఉద్యాన పంటలను క్లస్టర్ విధానంలో ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆలోచన. 2024-25లో లక్షా 74 వేల ఎకరాలను వ్యవసాయ పంటల నుంచి ఉద్యాన పంటల కిందకు తీసుకొస్తామని అన్నారు. విపత్తుల సమయంలో పంట నష్టానికి ఇచ్చే పెట్టుబడి సాయాన్ని హెక్టారుకు 17 వేల నుంచి 25 వేలకు పెంచామని మంత్రి అచ్చెన్న చెప్పారు. దీనిక తగ్గట్టు బడ్జెట్ లో కేటాయింపు చేశామని అన్నారు.
11-11-2024 (పారిశ్రామిక దగ్గజాలతో చర్చ)
స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్- 2047పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ తొలి సమావేశం సోమవారం జరిగింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ పారిశ్రామిక దగ్గజాలు పాల్గొన్నారు. అవకాశాల కల్పనతో సంపద సృష్టించడం సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు. తర్వాత ఆ సంపదను పేద వర్గాలకు పంచి ప్రజల జీవనప్రమాణాలను పెంచొచ్చని ఆయన అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తం చేశారు. 15 శాతం సాధిస్తామన్న విశ్వాసంతో తామున్నామని ఆయన చెప్పారు.
12-11-2024 (రిలయన్స్ రూ.65వేల కోట్ల పెట్టుబడులు)
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక వేత్తలకు ఏపీ గమ్య స్థానంగా కనిపిస్తోంది. రిలయన్స్ భారీ పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తోంది. 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. దీని కోసం 65వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.5 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేయనుంది. పైలట్ ప్రాజెక్టు కింద కాకినాడలో 3, రాజమహేంద్రవరంలో 2, విజయవాడ, కర్నూలు, నెల్లూరుల్లో ఒక్కొక్కటి చొప్పున 8 ప్లాంట్లను రాష్ట్రంలో సంస్థ ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది నవంబరు నాటికి వాటిని ఉత్పత్తిలోకి తెస్తుంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో మొదటి ప్లాంటుకు డిసెంబరు 28న శంకుస్థాపన చేస్తారు.
ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాల తగ్గుతాయి. దీంతో పాటు ఇంధన ఖర్చు ఆదా అవుతుంది. ఇక వ్యవసాయ అవశేషాలను మండించడాన్ని నివారించవచ్చు. ప్రధానంగా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. స్థానిక రైతులకు ఆర్థిక ప్రయోజనం కూడా ఉంటుంది.
రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని ప్రకటించిందని సీఎం చంద్రబాబు అన్నారు. 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ సాధించాలన్న కేంద్ర లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఇది కీలకం అవుతుందని ఆయన ఆలోచన.
12-11-2024 ( ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం)
మంగళవారం శాసనసభ కమిటీ హాల్లో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో జరుగుతున్న చర్చలను ప్రజలు గమనిస్తారని చంద్రబాబు అన్నారు. నియోజకవర్గ సమస్యలను తమ ఎమ్మెల్యే ప్రస్తావిస్తున్నారా? లేదా అనే విషయాన్ని చూస్తారని చెప్పారు. సభ బయట కూడా ఇసుక, మద్యం వంటి వ్యవహారాల్లోనూ, ప్రైవేట్ పంచాయతీల్లోనూ తలదూర్చొద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. సభలో ప్రతిపక్షం లేదని అనుకోవద్దని చెప్పారు. ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని దిశానిర్ధేశం చేశారు.
12-11-2024 ( చీఫ్ విప్‌లు, విప్‌ల నియామకం )
ఇక రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శాసనసభ, శాసనమండలి చీఫ్ విప్‌లు, విప్‌లను ప్రకటించింది. ప్రభుత్వ చీఫ్ విప్‌గా శాసనసభలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మండలిలో పంచుమర్తి అనురాధను నియమించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా, రికార్డు స్థాయిలో అసెంబ్లీలో చీఫ్ విప్ సహా 16 మంది, మండలిలో చీఫ్ విప్ సహా నలుగురు విప్‌లను ప్రకటించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంతమంది ఎప్పుడూ లేరు.
13-11-2024 (నదుల అనుసంధానంపై చర్చ)
గోదావరి, కృష్ణా, పెన్నాకు అనుసంధానంపై బుధవారం జలవనరులశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఉన్నా నదుల అనుసంధానం చేసి తీరుతామని ఆయన చెప్పారు. ఇప్పటికే గోదావరి, కృష్ణాను అనుసంధానం చేసి లక్షల ఎకరాలకు ప్రయోజనం కల్పించామన్నారాయన. సముద్రంలో వృథాగా పోతున్న నీటిని సరిగా ఉపయోగించుకుంటే రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదని చంద్రబాబు ఆలోచన. పోలవరం కుడికాలువను మరింత వెడల్పు చేసి 40 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో గోదావరి వరద జలాలు మళ్లించాలనే ఒక ప్రతిపాదన ఉంది. లేకుంటే ప్రత్యేకంగా వరద కాలువ తవ్వి పోలవరం నీటిని ఎత్తిపోసి మళ్లించాలనేది రెండో ప్రతిపాదన. ఈ రెండింటిలో సానుకూల, ప్రతికూల అంశాలపై చర్చ జరిగింది. మరోసారి అధికారులు పూర్తిగా విశ్లేషించి రావాలని చంద్రబాబు సూచించారు.
13-11-2024 ( స్థానిక సంస్థల్లో పోటీకి అర్హతల్లో మార్పు)
ఏపీ అసెంబ్లీ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. జనాభా నియంత్రణలో భాగంగా 1994లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పోటీకి అనర్హులని చట్టం చేశారు. కానీ.. ప్రస్తుతం జనాభా పెరగాల్సి అవసరం ఏర్పడింది. దీంతో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలనే నిబందనను రద్దు చేస్తూ బిల్లు పెట్టారు. ఆ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
14-11-2024 ( డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ)
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలుత ఈ ఎన్నిక విషయాన్ని సభాపతి అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. తర్వాత సభాపతితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రఘురామను సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వద్దకు వెళ్లి అభినందించారు.
14-11-2024 ( 6 పాలసీలపై సీఎం వివరణ)
గురువారం శాసనసభలో ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్‌ఎంఈ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేటు పార్క్ పాలసీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీల గురించి సీఎం చంద్రబాబు వివరించారు. రిలయన్స్ సంస్థతో సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఈ సంస్థం 65వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు సంకల్పించామని చెప్పారు. ఆ దిశగా ఆరు విధానాలు రూపొందించామన్నారు చంద్రబాబు. వీటి ద్వారా అన్ని రంగాల్లో 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చిన సీఎం వివరణ.
15-11-2024 ( వైపీపీ పాలనపై చంద్రబాబు ఫైర్)
గత ప్రభుత్వం చేసిన అప్పులు, విధ్వంసంపై అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగించారు. కన్న తల్లి శీలాన్ని శంకించే వారు మనుషులా.. పశువులా? అని ద్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. తల్లి వ్యక్తిత్వాన్నే హననం చేసేవారికి మనం ఒక లెక్కా? కన్న తల్లిపైనా అసభ్యకర పోస్టులు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే ఏమనుకోవాలిని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. కూటమిలోని నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ అసభ్య పోస్టులు పెట్టొద్దని చెప్పారు. ఒకవేళ పెడితే కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఇక ఆర్ధిక విధ్వంసం గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. గత ఐదేళ్లలో అప్పులు తెచ్చినా మూలధన వ్యయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలు మయం అయినా.. వీటికి ఒక్క రూపాయి ఖర్చుచేయలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులు తీర్చలేక ఐపీ పెట్టిన వ్యక్తిలా మార్చేశారని ద్వజమెత్తారు. అవినీతి, అక్రమాలు చేయడానికే వీరంతా రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు.
15-11-2024 ( రాష్ట్ర అప్పులపై సీఎం సవాల్)
2019కి ముందు మంత్రిగా ఉన్న లోకేశ్ ఉపాధిహామీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని, 24 వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు వేయించారని చంద్రబాబు గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ 4,500 కోట్ల రూపాయలతో 30వేల పనులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఇలా చెప్పుకోవడానికి వైసీపీ హయాంలో ఒక్క పని కూడా జరగలేదని సీఎం ఆవేదన. పనులు జరగపోయినా అప్పులు మాత్రం 9లక్షల 74వేల 556 కోట్లకు చేరిందని చంద్రబాబు ప్రధాన విమర్శ. ఇది అబద్ధం అని ఎవరు వచ్చినా లెక్కలు చూపించి, గుంజీలు తీయిస్తానని వార్నింగ్ ఇచ్చారు.
15-11-2024 ( ఐఐటీ మద్రాసుతో కీలక ఒప్పందాలు)
ఐఐటీఎం ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం చర్చలు జరిపారు. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్‌టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సలహాలు తీసుకునేందుకు ఐఐటీ మద్రాసుతో రాష్ట్ర క్రీడా శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అధునాతన సాంకేతికతను ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్‌వేగా అభివృద్ధి చేయడానికి ఐటీ శాఖ మరో ఎంఓయూ చేసుకుంది. దీని ఫలితంగా రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా కనెక్టివిటీ మెరుగవనుంది. వీటితోపాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ, అత్యాధునిక పరిశోధనలు, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే సామాజిక కార్యకలాపాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఐఐటీఎం నిర్ణయించింది.
16-11-2024 (పొరపాట్లు గుర్తు చేసుకున్న సీఎం)
శనివారం సీఎం చంద్రబాబు ఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ శత వసంతోత్సవం వేడకల్లలో పాల్గొన్నారు. భారతదేశ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని అంచన వేసి చెప్పారు. ప్రధానమంత్రి మోదీ 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు ప్రారంభించారని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ముందుకెళతామన్నారు చంద్రబాబు. తాను తొలిసారి 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నపుడు రాష్ట్రం ఎన్నో సమస్యల్లో ఉందని గుర్తు చేశారు. కొత్త విధానాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని గాడినపెట్టానని అన్నారు. దానివల్ల 1999లో రెండోసారి గెలిచామని చెప్పారు. అయితే పేరు కోసం ప్రయత్నించినప్పుడు ఓడిపోయానని అన్నారు చంద్రబాబు. అందరూ నన్ను పొగుడుతుంటే అన్నీ బాగా చేస్తున్నానేమోనని అనుకొనేవాడినతి తెలిపారు. 2004, 2019లో కొన్ని తప్పులు చేశానన్నారాయన. కానీ.. ప్రధాని మాత్రం అలా చేయకుండా నిత్యం ప్రజలతోనే ఉన్నారని సీఎం ఆలోచన.
16-11-2024 ( తమ్ముడి మృతదేహానికి నివాళి)
షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు శనివారం ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వెళ్లాల్సి ఉంది. కానీ.. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడి మృతితో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి రామ్మూర్తి నాయుడి మృతదేహానికి నివాళి అర్పించారు.