Wife Refuses To Cook| పెళ్లి చేసుకున్నంత మాత్రాన భార్య.. భర్తకు పనిమనిషిగా మారిపోతుందా? వంట చేయకపోయినా, ఇంటి పనులు చేయకపోయినా ఆమెను తప్పుపట్టవచ్చా? ఈ ప్రశ్నలకు బాంబే హైకోర్టు సమాధానం ఇచ్చింది. ఇంటి పనులు చేయడానికి భార్య నిరాకరించడం మాత్రమే మానసిక క్రూరత్వం కిందకు రాదని స్పష్టం చేసింది. విడాకుల కేసులో కీలక తీర్పు ఇచ్చింది. వివాహం అనేది సమాన భాగస్వామ్యమని, సేవా ఒప్పందం కాదని స్పష్టం చేసింది.
ఈ దంపతులకు 2002లో వివాహమైంది. అయితే పెళ్లైన కొద్దికాలానికే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. భర్త వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ (CA). 2004లో ఆయన విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. భార్య సరిగా ప్రవర్తించడం లేదని, తన తల్లిదండ్రులకు విధేయత చూపడం లేదని ఆరోపించారు. ఇంటి పనులు చేయడం లేదని, వంట చేయడం కూడా రాదని ఫిర్యాదు చేశారు. ఆమె ప్రవర్తన తనకు మానసిక ఒత్తిడిని కలిగిస్తోందని పేర్కొన్నారు.
అయితే భార్య ఈ ఆరోపణలను ఖండించింది. తాను వంట చేయడం, బట్టలు ఉతకడం, పాత్రలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులన్నీ చేసేదానినని చెప్పారు. భర్త, ఆయన కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే పుట్టింటికి వెళ్లాల్సి వచ్చిందని వాదించారు.
2010లో బాంద్రా కుటుంబ న్యాయస్థానం భర్తకు విడాకులు మంజూరు చేసింది. భార్యకు భరణం ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని భార్య బాంబే హైకోర్టులో సవాలు చేసింది.
భర్త చేసిన ఆరోపణలు సాధారణమైనవని హైకోర్టు అభిప్రాయపడింది. దాంపత్య జీవితంలో చిన్నచిన్న గొడవలు, అభిప్రాయ భేదాలు సహజమని పేర్కొంది. వాటిని మాత్రమే ఆధారంగా చేసుకుని మానసిక క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. వంట చేయకపోవడం, ఇంటిని శుభ్రం చేయకపోవడం మాత్రమే విడాకులకు సరైన కారణం కాదని తేల్చిచెప్పింది. వివాహం సమానత్వంపై ఆధారపడాలి కానీ యజమాని, సేవకురాలి సంబంధంలా ఉండకూడదని వ్యాఖ్యానించింది.
Also Read: బిర్యానీ ధరకు ఇల్లు మీ సొంతం.. కేవలం రూ.155కే రెండు బెడ్రూమ్ల ఫ్లాట్
భార్య చేతివృత్తుల నిపుణురాలు. అందు వల్ల ఆమె స్వతహాగా సంపాదించుకోగలదని, ఆమెకు భరణం అవసరం లేదని భర్త కోర్టులో వాదించాడు. ఆమె ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాసుల నిర్వహిస్తున్నట్లు ప్రకటన కూడా ఉందని తెలిపాడు. అయితే ఆ తరగతుల ప్రకటన ఇచ్చిన విషయాన్ని కుటుంబ న్యాయస్థానం ఆదాయానికి ఆధారంగా తీసుకుంది. అయితే అప్పుడప్పుడు తరగతులు నిర్వహించడం స్థిరమైన ఆదాయానికి నిదర్శనం కాదని హైకోర్టు పేర్కొంది.
భార్యకు తగినంత ఆదాయం ఉన్నట్లు ఆధారాలు లేవని గుర్తించింది. చార్టర్డ్ అకౌంటెంట్‌గా భర్తకు ఆదాయ సామర్థ్యం ఉందని పేర్కొంది.
దీంతో భార్యకు నెలకు రూ.10,000 భరణం, నివాస ఖర్చుల కోసం మరో రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది.
Also Read: భారీ పెరిగిన పాల ధరలు.. అయినా నో టెన్షన్.. తక్కువ ఖర్చుతో పోషకాలు ఇచ్చే 7 ఫుడ్స్ ఇవిగో
ఈ తీర్పు దాంపత్య సంబంధాల్లో మహిళల గౌరవం, సమానత్వాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. సంప్రదాయ కుటుంబ బాధ్యతలను భార్యపై మాత్రమే చట్టపరంగా మోపలేమని స్పష్టం చేస్తోంది.